ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాహుల్ గాంధీపై పాక్ మాజీ క్రికెటర్ షాహీద్ అఫ్రిదీ ప్రశంసల వర్షం

national |  Suryaa Desk  | Published : Tue, Sep 16, 2025, 07:00 PM

ఆసియా కప్ 2025లో భాగంగా ఇటీవల జరిగిన భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ వివాదం ఇంకా చల్లారడం లేదు. రెండు దేశాల్లో ఈ మ్యాచ్ ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా పాక్ ప్లేయర్లకు.. భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలోనే పాక్‌తో అసలు క్రికెట్ ఆడకూడదనే డిమాండ్లు వినిపించిన వేళ.. కేవలం ఆటను ఆట లాగే చూడాలని భారత్ మ్యాచ్ ఆడాలని నిర్ణయించుకుంది. ఈ సందర్భంగా మ్యాచ్‌కు ముందు, తర్వాత భారత ఆటగాళ్లు ఎవరూ పాక్ క్రికెటర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దీనిపై రెండు దేశాలకు చెందిన క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు, రాజకీయ నాయకులు.. రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహీద్ అఫ్రిదీ స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీని పొగడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


దుబాయ్‌ వేదికగా జరిగిన భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో పాక్‌కు చెందిన సమ్మా టీవీలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో షాహీద్ అఫ్రిదీ భారత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాడు. ఈ క్రమంలోనే భారత్ విషయంలో నోరు జారాడు. భారత్‌లో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎప్పుడూ మతం, హిందూ-ముస్లిం కార్డును ప్రయోగిస్తుంటుంది అని వివాదాస్పద వ్యాఖ్యలకు తెరలేపాడు. ఇది చాలా చెడ్డ ఆలోచనా విధానం అని నోటికి పనిచెప్పాడు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి.. షాహీద్ అఫ్రిదీ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.


రాహుల్ గాంధీ చాలా పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నవారని.. చర్చలపై ఆయనకు చాలా నమ్మకం ఉందని అఫ్రిదీ పేర్కొన్నాడు. ప్రపంచంలో ఒక్క ఇజ్రాయెల్ ఉంటే సరిపోదా ఇంకోటి కావాలా అని ప్రశ్నించాడు. ఈ సందర్భంగా గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను.. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్‌పై భారత్ చేసిన దాడులను పోల్చుతూ షాహీన్ అఫ్రిదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణం అవుతున్నాయి.


అయితే రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ.. షాహీన్ అఫ్రిదీ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అఫ్రిదీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ.. రాహుల్ గాంధీపై తీవ్రంగా మండిపడుతోంది. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలో భాగంగా అఫ్రిదీ మాట్లాడిన వీడియో క్లిప్‌ను బీజేపీ నేతలు షేర్ చేస్తున్నారు. నిత్యం భారత్‌ను ద్వేషించే వారంతా రాహుల్ గాంధీలో, కాంగ్రెస్ పార్టీలో స్నేహితులను వెతుక్కుంటారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆరోపించారు. హఫీజ్ సయీద్ తర్వాత రాహుల్ గాంధీని ప్రశంసించిన వ్యక్తి షాహీద్ అఫ్రిదీ అని తెలిపారు. ఇందులో ఎలాంటి ఆశ్చర్యం లేదని.. సోరోస్ నుంచి అఫ్రిదీ వరకు.. ఇస్లామాబాద్ నేషనల్ కాంగ్రెస్ అంటూ సెటైర్లు వేశారు.


మరోవైపు.. బీజేపీ ఐటీ సెల్ ఇంఛార్జ్ అమిత్ మాలవీయ కూడా అఫ్రిదీ వ్యాఖ్యలను షేర్ చేస్తూ రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. హిందూ ద్వేషి, భారత్‌పై అవకాశం దొరికినప్పుడల్లా విషాన్ని వెళ్లగక్కే అఫ్రిదీ.. ఉన్నట్టుండీ రాహుల్ గాంధీని ప్రశంసించాడని.. భారత్‌ను ద్వేషించే ప్రతీ వ్యక్తి.. ఎందుకు రాహుల్ గాంధీలో స్నేహితుడిని వెతుక్కుంటాడని ప్రశ్నించారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర రాజకీయ రగడకు కారణం అయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa