ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిల్లలనూ వెంటాడుతున్న క్యాన్సర్

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Sep 16, 2025, 10:31 PM

కేవలం మహిళల్లోనే కాకుండా పురుషులు కూడా క్యాన్సర్ బారిన పడుతున్నారు. మరో ఆందోళనకరమైన విషయం ఏంటంటే..ఇప్పుడు చిన్నారులనూ క్యాన్సర్ మహమ్మారి పట్టి పీడిస్తోంది. నిజానికి పిల్లలకు క్యాన్సర్ వచ్చిందంటే అది కేవలం వారి సమస్య కానే కాదు. అది పూర్తిగా కుటుంబ సమస్యగా మారిపోతుంది. ఒక్కసారిగా వారి జీవితం తలకిందులవుతుంది. తోటి వారంతా జాలిగా చూడడం మొదలు పెడతారు. ఇది పిల్లల్లో యాంగ్జిటీ పెంచుతుంది. మిగతా పిల్లల్లాగే తమ పిల్లలు ఆరోగ్యంగా లేరన్న ఆందోళన తల్లిదండ్రుల్లో పెరుగుతుంది. ఈ సమయంలోనే మానసికంగా కుంగుబాటుకు లోనుకాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతున్నారు డాక్టర్ శ్రణవ్ కుమార్.


క్యాన్సర్ ట్రీట్మెంట్ 


​క్యాన్సర్ రావడమే ఓ ఆందోళనకరమైన విషయం అంటే..అందుకు సంబంధించిన చికిత్స తీసుకోవడం ఇంకా ఆందోళన పెంచుతుంది. ఇదే పిల్లలను తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. ఇంకా జీవితం గురించి ఏమీ తెలియకుండానే లేనిపోని సమస్యలన్నీ భరించాల్సి వస్తుంది. ఆ సమయంలోనే వాళ్లకు అండగా నిలవాలని సూచిస్తున్నారు మణిపాల్ హాస్పిల్స్ కి చెందిన ఆంకాలజీ డిపార్ట్ మెంట్ కన్సల్టెంట్ డాక్టర్ శ్రవణ్ కుమార్. నిజానికి పిల్లలకు అసలు ట్రీట్మెంట్ గురించి అర్థం అయ్యే అవకాశమే ఉండదని, ఆ సమయంలో వాళ్లకి చికిత్స అందించడం అంటే చాలా సవాలుతో కూడుకున్న పని అని వివరించారు. చికిత్స అందించే సమయంలో పిల్లల్లో భయం, నిరుత్సాహం పెరుగుతాయి. నాకే ఎందుకిలా జరుగుతోంది, తోటి పిల్లలంతా బాగా ఆడుకుంటున్నారు కదా..అనే ఓ ఫీలింగ్ మొదలవుతుంది. ఇదే చివరకు కన్ ఫ్యూజన్ కి దారి తీస్తుంది.


తల్లిదండ్రుల ఆందోళన


బిడ్డకు ఆరోగ్యం బాలేకపోతే తల్లిదండ్రులు ఎంత టెన్షన్ పడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మామూలు జ్వరం, జలుబు వస్తేనే ఇబ్బంది పడిపోతారు. అలాంటిది క్యాన్సర్ వచ్చి దానికి చికిత్స తీసుకోవాల్సినంత తీవ్రంగా మారిందంటే పేరెంట్స్ మానసికంగా చాలా కుంగిపోతారు. ఆ సమయంలో పిల్లలకు ధైర్యం చెప్పాల్సిన వాళ్లే ఇలా కుంగిపోతే పరిస్థితి మరీ తీవ్రంగా మారుతుందని అంటున్నరు డాక్టర్ శ్రవణ్ కుమార్. అదే సమయంలో బిడ్డకు ధైర్యం చెప్పినా..తమ గురించి తాము పట్టించుకోకుండా ఉంటారు. ఇది కూడా ఓ రకంగా ప్రమాదకరమే. పిల్లలు, తల్లిదండ్రులు వీరిలో ఎవరు మానసికంగా ధైర్యంగా లేకపోయినా ఆ ప్రభావం కుటుంబం మొత్తంపైన పడుతుంది. అందుకే..ఆ సమయంలో సైకలాజికల్ సపోర్ట్ అనేది చాలా అవసరం అవుతుంది. మరి డాక్టర్ శ్రవణ్ కుమార్ ఈ విషయంలో ఏం చెబుతున్నారు. ఎలాంటి సలహాలు ఇస్తున్నారో చూద్దాం.


కౌన్సిలింగ్, థెరపీ


ఈ సమయంలో తల్లిదండ్రులు, పిల్లలకు కావాల్సింది కేవలం చికిత్స మాత్రమే కాదు. అంతకు మించిన మానసిక ధైర్యం. ఇది ఇవ్వడంలోనే చాలా మంది వెనకబడిపోతున్నారు అని చెబుతున్నారు డాక్టర్ శ్రవణ్ కుమార్. ముందుగా చేయాల్సిన పని ఏంటంటే..పిల్లలకి వాళ్ల వయసుకి అర్థమయ్యేలా జబ్బు గురించి చెప్పాలి. క్లియర్ గా అంతా వివరించాలి. క్యాన్సర్ చికిత్స అంటే నొప్పితో కూడుకున్నది.


ఆ సమయంలో ఎలా ధైర్యంగా ఉండాలి, నొప్పిని ఎలా తట్టుకోవాలని పిల్లలకు మోటివేషన్ అందించాలి. ఎంత చెప్పినా సరే..వాళ్ల బాధ వాళ్లదే కావచ్చు. కానీ కనీసం ఆ మాత్రం ధైర్యం ఇవ్వకపోతే పిల్లలు ఇంకా డీలా పడిపోతారు. క్యాన్సర్ కన్నా భయం ఇంకా ప్రమాదకరమైంది. ఒక్కసారి మొదలైందంటే పిల్లలు మానసికంగా పూర్తిగా కుంగిపోతారు. ఆ స్థితి నుంచి వాళ్లను బయటకు తీసుకురావడం చాలా కష్టమైపోతుంది. అందుకే..కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సైకలాజికల్ సపోర్ట్ అందించాల్సి ఉంటుంది.


ఏం చేయాలి


పిల్లలు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. క్యాన్సర్ మహమ్మారి వచ్చినప్పుడు ఇంకాస్త సెన్సిటివ్ గా మారతారు. మూడ్ స్వింగ్స్ ఉంటాయి. చిరాకు పడుతుంటారు. ఒక్కోసారి ఏడ్చేస్తారు. ఇవన్నీ తల్లిదండ్రులు భరించక తప్పు. కాస్త ఓపిక చేసుకుని వీటిని భరిస్తే క్రమంగా పిల్లల ఆరోగ్యంలో మార్పు వచ్చే అవకాశముంటుంది. అందుకు అనుగుణంగా పిల్లలను రోజూ చదివించాలి. అంటే..క్యాన్సర్ అనేది ప్రమాదకరమైందే అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప పిల్లలకు ఆ పేరు చెప్పి భయపెట్టకూడదు. వాళ్లతో రోజూ చదివించాలి. వాళ్లకి ఏదో జబ్బు ఉందని పదే పదే గుర్తు చేయాల్సిన పని లేదు. చదువు, ఆటలతో కొంత “నార్మల్ లైఫ్” ఫీల్ అయ్యేలా చేయాలి. ఇవన్నీ వాళ్లలో ఆత్మవిశ్వాసం పెంచుతాయి. ముఖ్యంగా, తాము “క్యాన్సర్ పేషెంట్” కాదని, “మనం కూడా ఒక సాధారణ వ్యక్తులమే” అని అనిపిస్తాయి. ఈ మాత్రం పాజిటివిటీ ఇవ్వడం అనేదే చాలా ముఖ్యమైన విషయం అని గుర్తుంచుకోవాలి.


కౌన్సిలింగ్ ఎందుకంటే..


పిల్లలకే కాదు. తల్లిదండ్రులు, పిల్లల బంధువులు, తోడ బుట్టిన వాళ్లు..ఇలా అందరికీ సరైన విధంగా మానసిక ధైర్యాన్ని అందించాల్సి ఉంటుంది. పైగా ఇది చాలా అవసరం. క్యాన్సర్ అంటే..వీరందిరీ చాలా భయాలు, టెన్షన్స్ ఉంటాయి. ఇలా ఉండకపోతే ఎలా, ఇలానే ఉండాలి అని గిరి గీసి పిల్లలను నియంత్రించడం సరి కాదు. మీ భయానికి పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు. అందుకే..వాళ్లు అలా భయపెట్టకుండా ఉండాలంటే వారికీ సపోర్ట్ అవసరం.


ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకుంటే ఒకరి అభిప్రాయాలు మరొకరికి తెలుస్తుంది. సంబంధాలు బలపడతాయి. అదే విధంగా మిగతా కుటుంబాలతో కలిసినప్పుడు “మనం ఒంటరేమీ కాదు” అన్న అనుభూతి వస్తుంది. చికిత్స తర్వాత కూడా ఇలాంటి మద్దతు కొనసాగించాల్సిందే. హాస్పిటల్ లైఫ్, చికిత్స సైడ్ ఎఫెక్ట్స్, మళ్లీ వస్తుందేమో? అన్న భయం – ఇవన్నీ ఫ్యామిలీని మరింత టెన్షన్ పెట్టేస్తాయి. ఈ సమయంలో సరైన విధంగా కౌన్సిలింగ్ తీసుకుంటేమళ్లీ పరిస్థితుల మీద కంట్రోల్ ఉన్నట్టు అనిపిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa