ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వం నుంచి వచ్చే లక్షల జీతం, కారు, సిబ్బందిని వదులుకున్నా.

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 19, 2025, 07:37 PM

ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గురించి తెలుగు రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పురాణాల నుంచి నైతిక విలువల వరకూ ప్రతి అంశాన్ని నలుగురికి అర్థమయ్యేలా చెప్తుంటారాయన. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాగంటి కోటేశ్వరరావును నైతిక విలువల సలహాదారుగా నియమించుకుంది. 2024 నవంబర్ నెలలో చాగంటి కోటేశ్వరరావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. అప్పటి నుంచి ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారాయన. అయితే చాగంటి కోటేశ్వరరావుకు ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తోంది. ఎంతమేరకు జీతభత్యాలు చెల్లిస్తున్నారనే దానిపై అప్పుడప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది.


ఈ నేపథ్యంలో చాగంటి కోటేశ్వరరావు తన జీతం, వసతుల గురించి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాగంటి కోటేశ్వరరావును నైతిక విలువల సలహాదారుగా నియమించిన ఏపీ ప్రభుత్వం.. కేబినెట్ హోదా కల్పించింది. కేబినెట్ హోదాలో ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం నెలకు రూ.2 లక్షలు జీతం చెల్లిస్తోంది. అలాగే కార్యాలయ ఫర్నీచర్‌ ఏర్పాటుకు వన్‌టైం గ్రాంట్, వ్యక్తిగత సహాయ సిబ్బంది అలవెన్స్‌లు, ఇతర సౌకర్యాల కల్పనకు మరో రెండున్నర లక్షలు అందిస్తారు. అయితే వీటిని అన్నింటినీ చాగంటి కోటేశ్వరరావు తిరస్కరించారు. ఈ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.


"ప్రభుత్వం ఇచ్చిన కారు. జీతం, వ్యక్తిగత సిబ్బందిని నేను తీసుకోలేదు. నాకు వాళ్లు ఓ పవిత్రమైన కార్యాన్ని అప్పగించారు. పిల్లలకు నైతిక విలువల గురించి చెప్పమని అడిగారు. నేను వాళ్లకు ఏది చేసిపెట్టగలనో అది చేసిపెట్టాను. ప్రభుత్వం కూడా ప్రేమగా, గౌరవంగా ముందుకు వచ్చి ఇవి పిల్లలకు అందాలని ఐదు పుస్తకాలను ముద్రించి.. ఈ ఏడాది నుంచి పిల్లలకు అందజేసింది. ప్రభుత్వం నాకు పదవి ఇవ్వనప్పుడు కూడా నేను పిల్లల కోసం అదే పని చేశాను. అలాంటప్పుడు మళ్లీ దాని కోసం నాకు లక్షల జీతం. వ్యక్తిగత సిబ్బంది అవసరం లేదు. అందుకే ఇవన్నీ నాకు అక్కర్లేదని చెప్పి.. నేను ఆ పని చేసి పెట్టాను." అంటూ చాగంటి కోటేశ్వరరావు చెప్పారు.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో చాగంటి కోటేశ్వరరావు చేసిన పనిని అభినందిస్తూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. రూపాయి జీతం తీసుకోకుండా ప్రభుత్వం కల్పించిన వసతులు, సౌకర్యాలు తిరస్కరించి ప్రజలకి ఉపయోగపడేలా సలహాలు అందిస్తున్నారని కొనియాడుతున్నారు.


మరోవైపు చాగంటి కోటేశ్వరరావు సలహాలు, సూచనలతో ఏపీ ప్రభుత్వం నైతిక విలువలపై ఐదు పుస్తకాలు రూపొందించింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులకు.. ఈ నైతిక విలువల పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ పుస్తకాలలో సంస్కారవంతమైన విషయాలు, తెలుగు పద్యాలు, పదాలను పొందుపరిచారు. ప్రతి పుస్తకంలోనూ ఆరు కథలు ఉండేలా రూపొందించారు.


ఆరో తరగతి విద్యార్థుల కోసం తోరణాలు పేరుతో పుస్తకం అందించారు. ఇందులో సాయం చేద్దాం, యోగ్యతకే అధికారం, సాటిలేని మేటి, నడత, గుణం వంటి అంశాలతో కథలు రూపొందించారు. ఏడో తరగతి విద్యార్థులకు మనో వికాసం,ఎనిమిదో తరగతి విద్యార్థులకు సూక్తి సుధ, తొమ్మిదో తరగతిలో సద్గుణ సారం, పదవ తరగతి విద్యార్థులకు అమృత ధార పేరుతో పుస్తకాలు ముద్రించారు. ఈ పుస్తకాల ద్వారా పిల్లల్లో నైతిక విలువలు, కుటుంబ బాంధవ్యాలు, సద్గుణాల గురించి వారికి అర్థమయ్యేలా కథల రూపంలో వివరిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa