ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనాతో జాగ్రత్త.. ‘ఎలైట్ క్యాప్చర్’‌పై భారత్‌ను హెచ్చరించిన టిబెట్ మాజీ అధ్యక్షుడు

national |  Suryaa Desk  | Published : Tue, Sep 23, 2025, 08:30 PM

భారత్‌ విషయంలో చైనాపై ప్రవాసీ టిబెట్ ప్రభుత్వ మాజీ అధ్యక్షుడు డాక్టర్ లోబ్‌సంగ్ సాంగే సంచలన ఆరోపణలు చేశారు. భారత్‌లోని రాజకీయ నేతలు, ఇంజినీర్లను సైతం ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఈ విషయంలో భారత్ ఆలస్యం కాకముందే అప్రమత్తం కావాలని సాంగే సూచించారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... ‘ఎలైట్ క్యాప్చర్ (ముఖ్యమైన వ్యక్తుల కొనుగోలు) అనేది చైనా వ్యూహాంలో పురాతన కాలం నుంచి వినియోగించిన విధానం... నాయకులు, మేధావులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్ట్‌లు, నేటి తరంలో యూట్యూబర్లను కూడా కొనుగోలు చేస్తారు.. ఇదే విధంగా టిబెట్, జిగ్జియాంగ్, మంగోలియాలోకి చొరబడ్డారు.. ఇప్పుడు భారత్‌ విషయంలో అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు’ అన్నారు. చైనా రాజకీయ కుట్రలకు భారత్ అతీతం కాదని సాంగే హెచ్చరించారు. కాగా, భారత ఆర్మీ ఉన్నతాధికారులు సైతం ఇటీవల చైనాతో సంబంధాలు విషయంలో ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్మం.


‘ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం నిర్వహించిన నేషనల్ డే వేడుకలను ఒకసారి గమనించండి.. ఎవరు హాజరయ్యారో చూడండి... రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ఇతరు ప్రముఖలు హాజరైన ఫోటోలు అక్కడ దర్శనమిస్తాయి.. వాళ్లందరని కొనుగోలు చేయలేదనుకోండి.. కానీ, చైనా అలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది’ అని పేర్కొన్నారు. భారత్ పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో ఇటీవల జరిగిన ఆందోళనలను ఉదహరించిన ఆయన.. అక్కడ చైనాకు లొంగిపోయిన ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పారు.


‘‘నేపాల్‌లో బహిరంగంగా ఓ పార్టీ చైనాకు అనుకూలం.. ఇంకోటి భారత్‌‌కు అనుకూలం.. శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవుల్లోనూ పాలకవర్గాలను చైనా పెంచిపోషించింది... ఇక పాకిస్థాన్‌లోని దాదాపు అన్ని ముఖ్యమైన రాజకీయ పార్టీలకు చైనా మద్దతు ఉంది.. ఇది ఎలైట్ క్యాప్చర్‌ వల్లే సాధ్యమైంది’’ అని డాక్టర్ సాంగే పేర్కొన్నారు. ఈ వ్యూహం దక్షిణాసియా వెలుపలకు కూడా విస్తరించిందని అన్నారు. ‘‘చైనాను పొగిడిన ఐరోపా మంత్రులను నేను చూశాను.. చైనాను పొగిడిన తర్వాత వారికి చైనా సంస్థల్లో లక్ష డాలర్లు లేదా అంతకంటే ఎక్కు వేతనంతో డైరెక్టర్లుగా ఉద్యోగాలు పొందారు.. కొందరైతే ఏడాదికి 8,88,000 డాలర్లు వేతనం పొందుతున్నారు.. చైనా ఎలా ప్రభావితం చేస్తుందనడానికి ఇదే నిదర్శనం’’ అని అన్నారు.


పార్టీలకు అతీతంగా భారతీయ నాయకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘‘అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందినవారు, వ్యాపారవేత్తలు, జర్నలిస్ట్‌లు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి.. చైనాకు ఎవర్ని కొనుగోలు చేయడం ముఖ్యం కాదు.. వారి అజెండాకు ఉపయోగపడితే చాలు’’ అని అన్నారు. అంతేకాదు, చైనా కార్యకలాపాలు భారత్‌ను అణగదొక్కే తమ విస్తృత భౌగోళిక-రాజకీయ లక్ష్యానికి అనుసంధానమై ఉన్నాయని సాంగే వ్యాఖ్యానించారు. ‘మాల్దీవులు, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్‌లను చైనా ఎందుకు సపోర్ట్ చేస్తుంది.. భారత్‌పై దాడిచేసిన ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో చేసిన తీర్మానాలను ఎందుకు అడ్డుకుంది? ఎందుకంటే దక్షిణాసియాలో భారత్‌ను ఎదగనీయకుండా చేయడమే’ అని పేర్కొన్నారు.


ఇదే సమయంలో చైనా ఆర్ధిక వ్యవస్థను రాజకీయ మాయాజాలంతో పోల్చుతూ.. భారత్, చైనాల మధ్య వాణిజ్య లోటును ప్రస్తావించారు. ‘చైనా నుంచి భారత్ 113 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు కొని.. కేవలం 14 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను విక్రయిస్తోంది.. ఇది 99 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు..దీని అర్థం ఏమిటంటే భారత్‌లో తక్కువ పరిశ్రమలు, తక్కువ తయారీ, తక్కువ ఉద్యోగాలు.. చైనాతో ఉన్న సంబంధం కేవలం అసమానంగా ఉండటం మాత్రమే కాదు, అది ప్రమాదకరమూ’ అని సాంగే అభిప్రాయపడ్డారు.


ఇదే సమయంలో చైనాతో వాణిజ్యం కొనసాగిస్తే అది ప్రజాస్వామ్యం దిశగా నడుస్తుందన్న హెన్రీ కిసింజర్ ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని తప్పుబట్టారు. ‘ఈ భ్రమలో గత మూడు దశాబ్దాలుగా పశ్చిమ దేశాలు భారీగా పెట్టుబుడులు పెట్టాయి.. కానీ, చైనా ప్రజాస్వామ్యంవైపు వెళ్లడం అటుంచితే మరింత నియంతృత్వంగా తయారయ్యింది.. భారత్ ఆ తప్పును పునరావృతం చేయకూడదని ఆశిస్తున్నాను’ అని సాంగే వ్యాఖ్యానించారు. ఇప్పటికే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకున్న తరుణంలో సాంగే వ్యాఖ్యలు భారత్‌కు ఓ గట్టిగా హెచ్చరికగా మారాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa