ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హెచ్-1బీ వీసా పై ట్రంప్ నిర్ణయం, అమెరికా టెక్ పరిశ్రమపై దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావం చూపుతుంది

national |  Suryaa Desk  | Published : Sat, Sep 27, 2025, 02:23 PM

ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలోని లక్షలాది మంది సాంకేతిక నిపుణుల జీవితాలను మార్చేసిన హెచ్-1బీ వీసా కార్యక్రమంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎందరో భారతీయులకు "అమెరికన్ డ్రీమ్"కు ప్రవేశ ద్వారంగా నిలిచిన ఈ వీసా ఫీజును అమాంతం లక్ష డాలర్లకు పెంచుతూ సెప్టెంబర్ 21న ప్రకటన విడుదల చేశారు. గతంలో కేవలం 2,000 నుంచి 5,000 డాలర్ల మధ్య ఉన్న ఈ ఫీజును ఇంత భారీగా పెంచడం టెక్ పరిశ్రమలో, వలసదారుల వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నిర్ణయం... ప్రపంచ టెక్ రంగాన్ని ఏలుతున్న ఎలాన్ మస్క్, సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ వంటి దిగ్గజాలు సైతం ఒకప్పుడు ఇదే వీసాపై ఆధారపడి అమెరికాలో తమ ప్రస్థానాన్ని ప్రారంభించారన్న వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చింది. అమెరికా సాంకేతిక ఆధిపత్యానికి పునాదులు వేసిన ఈ వీసా కార్యక్రమాన్ని కఠినతరం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇది మానవతా సంక్షోభానికి దారితీయవచ్చని హెచ్చరించింది.అయితే, ఈ నిర్ణయం అమెరికా టెక్ పరిశ్రమపై దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా పౌరసత్వం, వలస సేవల (USCIS) గణాంకాల ప్రకారం, ఆమోదం పొందిన మొత్తం హెచ్-1బీ దరఖాస్తులలో 71 శాతం భారతీయులే ఉన్నారు. ఇప్పుడు ఈ కొత్త ఫీజు విధానం వల్ల చిన్న, మధ్య తరహా టెక్ కంపెనీలు విదేశీ ప్రతిభను ఆకర్షించడం దాదాపు అసాధ్యంగా మారనుంది. కేవలం అతిపెద్ద టెక్ కంపెనీలు మాత్రమే ఈ భారాన్ని మోయగలవు. ఇది ఆవిష్కరణల వేగాన్ని తగ్గించడమే కాకుండా, అమెరికాలో నైపుణ్యాల కొరతకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందరో భారతీయ విద్యార్థులు అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించి, ఆ తర్వాత హెచ్-1బీ వీసా ద్వారా అక్కడే స్థిరపడాలని కలలు కంటారు. ఈ నిర్ణయం వారి ఆశలపై నీళ్లు చల్లినట్టయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa