తిరుమల శ్రీవారి దర్శనం కోసం కర్ణాటక నుంచి వచ్చిన ఓ వ్యక్తి.. రైలు ఎక్కడంలో ఆలస్యం కావడంతో రైలు వెళ్లిపోయింది. ఆ తర్వాత మద్యం సేవించిన ఆ వ్యక్తి చేసిన చిత్ర విచిత్రమైన, ప్రమాదకరమైన పని తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలో తీవ్ర కలకలం రేపింది. రేణిగుంట మండలం గురవరాజుపల్లిలోని పంట పొలాల్లో ఉన్న 220 కేవీ హైటెన్షన్ విద్యుత్ టవర్ పైకి ఎక్కిన కర్ణాటకకు చెందిన శివ అనే వ్యక్తి.. కొన్ని గంటల పాటు హంగామా సృష్టించాడు. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చివరికి పోలీసులు అతి కష్టం మీద ఆ వ్యక్తిని కిందికి దించే ప్రయత్నం చేయగా.. వారు ఏర్పాటు చేసిన వలలో పడి గాయపడ్డాడు. అనంతరం అతడ్ని ఆస్పత్రికి పంపించి ట్రీట్‌మెంట్ ఇప్పిస్తున్నారు. అతడు ఇలా చేయడం వెనుక కారణం ఏంటి అనేది ఆరా తీస్తున్నారు.
మంగళవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ టవర్‌పై ఉన్న వ్యక్తిని చూసిన గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురై అతన్ని కిందికి దిగాలని విజ్ఞప్తి చేశారు. కానీ ఫలితం లేకపోవడంతో.. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ జయచంద్ర, ఎస్సై నాగరాజు తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ టవర్ ఎత్తు ఎక్కువగా ఉండటంతో కింది నుంచి వారు మాట్లాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆ వ్యక్తి ఏం చెబుతున్నాడో వారికి అర్థం కాలేదు.
ఆ వ్యక్తిని కిందికి దించే ప్రయత్నంలో భాగంగా.. విద్యుత్ అధికారులు ఆ ప్రాంతంలో 220 కేవీ విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కరెంట్ పోవడంతో ఆ వ్యక్తి హైటెన్షన్ వైర్లను పట్టుకుని భయానకమైన విన్యాసాలు చేయడం మొదలుపెట్టాడు. అతడు పైనుంచి సెల్‌ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడినట్లు కూడా తెలుస్తోంది. టవర్ ఎక్కే ప్రయత్నం చేస్తే దూకేస్తాడని భయపడిన పోలీసులు చాలాసేపు వేచి చూశారు. చివరికి ఆ వ్యక్తి టవర్‌పై నుంచి కిందికి దూకేశాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ముందు జాగ్రత్తగా కింద ఏర్పాటు చేసిన వలను ఉపయోగించారు. దీంతో ఆ వ్యక్తి వలలో పడ్డాడు. అయినప్పటికీ అతడి తలకు తీవ్రగాయాలు అయినట్టు గుర్తించిన పోలీసులు.. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.
రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించిన వివరాల ప్రకారం.. టవర్ ఎక్కిన వ్యక్తి కర్ణాటకలోని చిక్‌మంగుళూరు జిల్లా కడూరుకు చెందిన శివగా గుర్తించారు. శివ అల్లం సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడని.. అతనికి ముగ్గురు కుమారులు ఉన్నారు. శనివారం తన ఫ్రెండ్స్‌తో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చి దర్శనం తర్వాత.. తిరుగు ప్రయాణంలో రైలు మిస్ కావవడంతో మద్యం సేవించాడు. ఆ తర్వాత ఇలా టవర్‌పైకి ఎక్కినట్లు పోలీసులు గుర్తించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa