ఇమ్మిగ్రేషన్ విషయంలో కఠిన వైఖరి అవలంభిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశీ విద్యార్థుల ప్రవేశాలపై పరిమితి విధించాలని, లేకుంటే ఫెడరల్ ప్రభుత్వ నిధులు ఇవ్వబోమని యూనివర్సిటీలకు తేల్చిచెప్పారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షభవనం శ్వేతసౌధం ప్రతిపాదిత నిబంధనలను మెమో రూపంలో అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలకు పంపింది. ఫెడరల్ నిధులు కావాలంటే విదేశీ విద్యార్థులను పరిమిత సంఖ్యలో చేర్చుకోవాలి, జాతి, లింగ ఆధారిత ప్రవేశాలు నిలిపివేయాలి, అడ్మిషన్ సమయంలో విద్యార్థులకు కచ్చితంగా ప్రామాణిక పరీక్ష నిర్వహణ వంటివి చేపట్టాలి. అలా చేస్తేనే నిధుల కేటాయింపులో ప్రాధాన్యత దక్కుతుందని స్పష్టం చేసింది.
ఈ షరతులకు ఒప్పుకున్న విద్యా సంస్థలు ప్రభుత్వ కల్పించే ప్రయోజనాలు పొందవచ్చని ఆ లేఖలో పేర్కొన్నారు. విద్యార్థులకు ప్రభుత్వ రుణాలు, గ్రాంట్లు, కాంట్రాక్టులు, రిసెర్చి నిధులు, విదేశీ పరిశోధకులకు వీసా అనుమతులు, పన్ను మినహాయింపులో ప్రాధాన్యం వంటివి పొందవచ్చని తెలిపింది. ఈ చర్యలను అమెరికాలో ఉన్నత విద్యను సంస్కరించి, తమ భావజాలానికి అనుకూలంగా మార్చుకునేలా ట్రంప్ యంత్రాంగం చేస్తున్న మరో ప్రయత్నంగా భావిస్తున్నారు. ఇక, ప్రతిష్ఠాత్మక వర్సిటీ హార్వర్డ్.. ప్రభుత్వంతో 500 మిలియన్ డాలర్ల ఒప్పందానికి చాలా దగ్గరగా ఉందని పేర్కొన్నాయి. ప్రస్తుతం వైట్‌హౌస్ మెమో అందుకున్న విద్యాసంస్థల్లో ఎంఐటీ సహా ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇటీవల, ట్రంప్ హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచిన విషయం తెలిసిందే.
వైట్‌హౌస్ నిబంధనలు
వీసాలపై వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య 15 శాతానికి, అలాగే, ఒకే దేశం నుంచి విద్యార్థుల సంఖ్య 5 శాతానికి మించరాదు. అంటే, అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య 5 శాతంగా ఉండనుంది. అంతేకాదు, విదేశాల నుంచి అందుకున్న నిధుల వివరాలను కూడా వెల్లడించాలి. విద్యార్థుల ప్రవేశాలు, ఫైనాన్షియల్ ఎయిడ్ సమయంలో లింగ, జాతి, జాతీయత, రాజకీయ భావజాలం, జెండర్ గుర్తింపు, లైంగిక ఆకర్షణ, మతపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకోరాదు. యూజీ కోర్సులకు దరఖాస్తుదారులు కచ్చితంగా శాట్ (SAT) లేదా యాక్ట్ (ACT) వంటి ప్రామాణిక పరీక్షలో అర్హత సాధించాలి.
విద్యా స్వేచ్ఛను పరిరక్షించే విధానాలు అమలుచేయాలి. సంప్రదాయ ఆలోచనా సరళికి విఘాతం కలిగించే, దాడులకు పాల్పడే విభాగాలను తొలగించడం. యూనివర్సిటీలను ఇబ్బందుకుల గురిచేసేలా రాజకీయ నిరసనలు, విద్యార్థులను లేదా వర్గాలను వేధింపులకు పాల్పడకుండా చర్యలు చేపట్టాలి. అలాగే, విద్యా సంస్థల్లో ఉద్యోగులు విధుల సమయంలో రాజకీయ ప్రసంగాలు, చర్యలకు దూరంగా ఉండాలి. మహిళలు, పురుషులకు వేర్వేరుగా వాష్‌రూమ్‌లు, లాకర్ రూమ్‌లు ఉండాలి. హార్డ్‌సైన్స్‌ను అభ్యసించే విద్యార్థులకు ట్యూషన్ ఫీజ్, ప్రోత్సాహకం కింద 2 మిలియన్ డాలర్లు మించి ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ నిబంధనలు అమలు తీరును జస్టిస్ డిపార్ట్‌మెంట్ పర్యవేక్షిస్తుంది. వీటిని ఉల్లంఘిస్తే ప్రభుత్వ లబ్ధిని రెండేళ్లపాటు ఆపేస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa