ఫ్రాన్స్‌లో రాజకీయ అనిశ్చితి మరింత తీవ్రమైంది. కొత్త ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను (Sébastien Lecornu) పదవి చేపట్టిన నెలరోజుల్లోనే తన పదవికి రాజీనామా చేశారు. అంతకుముందు ప్రధాని ఫ్రాంకోయిస్ బయ్రూ (François Bayrou) అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి రాజీనామా చేయగా, అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ (Emmanuel Macron) సెబాస్టియన్‌ను ప్రధానిగా నియమించారు. అయితే, లెకోర్ను తన కొత్త క్యాబినెట్‌ను ప్రకటించిన కొద్ది గంటల్లోనే రాజీనామా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణం సెబాస్టియన్ లెకోర్ను కొత్తగా నియమించిన కేబినెట్‌పై వచ్చిన తీవ్ర విమర్శలే. రాజకీయ మిత్రులు, శత్రువులు సైతం ఆయన మంత్రివర్గ కూర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో బయ్రూ మంత్రివర్గంలో పనిచేసిన వారికే లెకోర్ను తన మంత్రివర్గంలో పెద్దపీట వేశారని, ఇది ఎలాంటి మార్పును సూచించడం లేదని ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి. ముఖ్యంగా, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కీలకమైన బడ్జెట్ ప్రణాళికను పార్లమెంటులో ఆమోదింపజేసుకోవడం లెకోర్నుకు అసాధ్యమని స్పష్టమవడంతో, ఆయన ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
బయ్రూ ప్రభుత్వం అప్పులను తగ్గించే లక్ష్యంతో తీసుకొచ్చిన కఠినమైన బడ్జెట్ ప్రతిపాదనలపై జాతీయ అసెంబ్లీలో ప్రతిఘటన ఎదురైంది. ముఖ్యంగా, అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడంతో బయ్రూ పదవిని కోల్పోయారు. ఈ వరుస పరిణామాలు ఫ్రాన్స్‌లో పాలన ఎంతటి స్తంభన స్థితిలో ఉందో స్పష్టం చేస్తున్నాయి. రెండేళ్లలో ముగ్గురు ప్రధానులు పదవి నుంచి తప్పుకోవడం, లెకోర్నుది ఆధునిక ఫ్రాన్స్ చరిత్రలోనే అతి తక్కువ కాలం పనిచేసిన ప్రభుత్వంగా నిలవడంతో ఈ సంక్షోభం మరింత లోతుకు వెళ్లింది.
ప్రస్తుతం పార్లమెంటులో ఏ ఒక్క కూటమికి స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో, అధ్యక్షుడు మెక్రాన్ నూతన ప్రధానిని ఎన్నుకోవడం సవాలుగా మారింది. దేశంలో నెలకొన్న ఈ రాజకీయ ప్రతిష్టంభన కారణంగా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఆర్థిక లోటు, అధిక ద్రవ్యోల్బణం వంటి సమస్యలతో ఫ్రాన్స్ సతమతమవుతున్న వేళ, ఈ రాజకీయ అనిశ్చితి దేశ భవిష్యత్తుపై ఆందోళనలను పెంచుతోంది. ఈ నేపథ్యంలో మెక్రాన్ తదుపరి అడుగు ఏమిటన్నది జాతీయ, అంతర్జాతీయంగా ఉత్కంఠగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa