తమ ప్రాంతంలో వీధి కుక్కల సమస్యలపై అవగాహన కల్పించడానికి డ్రామా ప్రదర్శిస్తుండగా... అందులో పాత్రధారికి ఊహించని అనుభవం ఎదురైంది. నాటకం వేస్తుండగా ఓ శునకం వచ్చి ఆయనపై దాడిచేసింది. కేరళలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని కన్నూర్ జిల్లా మయ్యిల్ గ్రామంలోని లైబ్రరీ వద్ద కుక్కల దాడులపై వీధి నాటకం ప్రదర్శన జరుగుతోంది. రాధాకృష్ణన్ అనే కళాకారుడు నాటకం ప్రదర్శిస్తుండగా.. ఓ పిల్లాడిపై కుక్క దాడి చేసే సన్నివేశం ఉంది. డ్రామాను రక్తికట్టించేలా సహజత్వం కోసం కుక్కలు మొరగడం, బాలుడి కేకల శబ్దాలను ప్లే చేశారు.
అంతలోనే ఆ శబ్దాలకు పరుగెత్తుకుని వచ్చిన ఓ కుక్క ఆయనపై దాడిచేసింది. అయినప్పటికీ అతడు మాత్రం ప్రదర్శన ఆపలేదు. 15 నిమిషాలపాటు బాధను ఓర్చుకుంటూ మిగిలిన నాటకాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత స్థానికులు ఆయనను చికిత్స కోసం ఆస్పత్రికి తరిలించారు. అయితే, నాటక ప్రదర్శన చూస్తున్నవారంతా కుక్క కరవడం అందులో ఓ భాగమని అనుకోవడం గమనార్హం. నాటక ప్రదర్శన తిలకిస్తున్నవారు ఈ దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్‌లో బంధించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.
ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాల వారి రోజువారీ పోరాటానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. ఈ సంఘటన కన్నూర్‌లో పెరుగుతున్న వీధికుక్కల దాడులపై ఆందోళనను రేకెత్తించింది, ఈ సమస్యను పరిష్కరించడంలో అధికారుల వైఫల్యంపై ప్రజలు ఆగ్రహం చెందుతున్నారు. జూన్ నెలల్లో ఒక్క కన్నూర్ జిల్లాల్లో 21 మంది వీధికుక్కల కాటుకు గురయ్యారు. దీనికి కొద్ది రోజుల ముందే ఓ ప్రాంతంలో 50 మందిని ఓ కుక్క కరిచింది. కాగా, కేరళలో కొంతకాలంగా రేబిస్ కేసులు పెరుగుతుండటం పట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కుక్క గోరు గుచ్చుకుని ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది.
కుక్క కాటుకు రేబీస్ వ్యాక్సిన్ వేయించకోకుంటే ప్రాణాలకే ముప్పు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 50 వేల రేబీస్ మరణాలు నమోదవుతుండా.. వీటిలో 95 శాతం ఆఫ్రికా, ఆసియా దేశాల్లోనే సంభవిస్తున్నాయి. ప్రపంచ రేబీస్ మరణాల్లో 36 శాతం భారత్‌లోనే చోటుచేసుకుంటున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇటీవల సుప్రీంకోర్టు సైతం వీధి కుక్కల సమస్యపై కీలక ఆదేశాలు జారీచేసింది. రోడ్లపై వీధి కుక్కలకు ఆహారం పెట్టొదని, అలాచేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కల సమస్యపై సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలపై తీవ్ర అభ్యంతరాలు కూడా వచ్చాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa