ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నోబెల్ ప్రైజ్ పొందిన ఆవిష్కరణ.. ఆ వ్యాధుల గుట్టు విప్పేయొచ్చు

international |  Suryaa Desk  | Published : Mon, Oct 06, 2025, 09:04 PM

ఫిజియోలజీ, మెడిసిన్ విభాగాల్లో నోబెల్ ప్రైజ్‌లు సోమవారం ప్రకటించారు. 2025 ఏడాదికి గానూ వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసిన మేరీ ఇ.బ్రంకో, ఫ్రెడ్‌ రామ్స్‌డెల్‌ , షిమన్‌ సకాగుచి నోబెల్ పురస్కారం లభించింది. రోగనిరోధక వ్యవస్థకు సంబంధించి కీలకమైన రెగులేటరీ టీ సెల్స్ కనుగొన్నందుకు ఈ పరిశోధకులకు అవార్డు దక్కింది. అమెరికాకు చెందిన మేరీ ఇ.బ్రంకో, ఫ్రెడ్‌ రామ్స్‌డెల్‌‌తో పాటు జపాన్‌కు చెందిన సకాగుచికి సంయుక్తంగా ఈ అవార్డు ప్రకటించారు. వైద్య విభాగంతో మొదలైన ఈ నోబెల్‌ పురస్కారాల ప్రదానం.. అక్టోబర్ 13 వరకు కొనసాగుతుంది.


ఏంటి ఈ టీ సెల్స్!


టీ సెల్స్ అంటే ఒక రకమైన తెల్ల రక్త కణాలు. ఇన్ఫెక్షన్లపై రోగ నిరోధశక్తి పోరాడటంలో ఈ కణాలు కీలక పాత్ర పోషిస్తాయి. బోన్ మ్యారోలో ఉద్భవించే ఈ కణాలు థైమస్ (వినాళ గ్రంథి (ఎండోక్రైన్ గ్రంథి))లో వృద్ధి చెందుతాయి. అందుకే వీటికి టీ సెల్స్ అని పేరు వచ్చింది. అయితే వీటిని 1960ల్లోనే ఇమ్యూనోలజిస్ట్‌లు కొనుగొన్నారు.


రోగనిరోధక శక్తి అనేక రకాల టీ సెల్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. అందులో ఒక్క రకం కణాలకు ఒక్కో రకమైన పని ఉంటుంది. సాధారణ టీ సెల్స్ శరీరంలోకి వచ్చే హానికరమైన.. బ్యాక్టీరియా, వైరస్‌లు, క్యాన్సర్ కణాలను గుర్తించి చంపేస్తుంది.


ఈ టీ సెల్స్‌లో ఉప రకమే.. రెగ్యులేటరీ టీ సెల్స్. వీటిని కనుగొన్నందుకే నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఈ రెగ్యులేటరీ టీ సెల్స్.. శాంతి పరిరక్షకులుగా వ్యవహరిస్తాయి. అంటే.. హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లు అనుకుని.. రోగనిరోధక శక్తి శరీర కణజాలంపై దాడి చేయకుండా ఇవి కాపాడతాయి. ఈ పరిస్థితినే ఆటోఇమ్యూనిటీ అంటారు. ఈ టీ సెల్స్‌కు ఉన్న సామర్థ్యాన్నే.. పెరిఫెరాల్ ఇమ్యూన్ టోలరెన్స్ అంటారు. అంటే ఈ నియంత్రణ థైమస్ గ్రంథి వెలుపల.. శరీర అవయవాలు, కణజాలాలల్లో జరుగుతుంది. ఈ కణాలు లేకుంటే.. సాధారణ రోగనిరోధక ప్రతిస్పందనలు అదుపు తప్పుతాయి. దీంతో ముఖ్యమైన అవయవాలను దెబ్బతింటాయి.


షిమోన్ సకాగుచి 1995లో రెగ్యులేటరీ T కణాలను గుర్తించారు. అంతకుముందు థైమస్‌లోని హానికరమైన కణాలను తొలగించడం ద్వారా మాత్రమే.. ఇమ్యూన్ టోలరెన్స్ ఏర్పడుతుందని నమ్మేవారు. దాన్నే సెంట్రల్ టోలరెన్స్ అనేవారు. అయితే అంతకుమించి.. హానికరమైన బ్యాక్టీరియా వంటి వాటిని చంపేయడమే కాకుండా.. రోగనిరోధక శక్తిని నియంత్రించే మరో రక్షణ కవచం ఉందని.. అవే రెగ్యులేటరీ టీ కణాలని సకాగుచి నిరూపించారు.


2001లో మేరీ బ్రంకో, ఫ్రెడ్ రామ్స్‌డెల్ Foxp3 జన్యువును కనుగొనడం ద్వారా ఈ పరిశోధనల్లో మరో ముందడుగు పడింది. రెగ్యులేటరీ టీ సెల్స్ ఉత్పత్తికి ఈ జన్యువు కీలకమని కనుగొన్నారు. ఆ తర్వాత సకాగుచి.. రెగ్యులేటరీ టీ సెల్స్ నిర్మాణం, పనితీరును.. Foxp3 జన్యువే నియంత్రిస్తుందని నిరూపించారు.


మేరీ ఇ.బ్రంకో, ఫ్రెడ్‌ రామ్స్‌డెల్‌, షిమన్‌ సకాగుచి చేసిన పరిశోధనలు.. ఆటో ఇమ్యూన్ వ్యాధులను నియంత్రిచడానికి ఎంతో ఉపయోగపడనున్నాయి. అంతేకాకుండా క్యాన్సర్ ఇమ్యునోథెరపీని మెరుగుపరిచే అవకాశం ఉంది. ఇక అవయవ మార్పిడులు ఎక్కువ శాతం విజయవంతం అయ్యేలా చేయడానికి దారి చూపించొచ్చు. వివిధ ఆటో ఇమ్యూన్ వ్యాధులను గుర్తించి.. వాటికి ప్రత్యేక థెరపీలు అందుబాటులోకి తీసుకురావచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa