ఇటీవలే భారత ఆర్మీ చీఫ్ పాకిస్థాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదులకు సాయం చేయడం ఆపకపోతే ప్రపంచపటంలో లేకుండా చేస్తామని హెచ్చరించారు. అయితే దీనిపై తాజాగా పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందించారు. భవిష్యత్తులో సైనిక ఘర్షణకు ప్రయత్నిస్తే భారతదేశం తన యుద్ధ విమానాల శిథిలాల కింద సమాధి అవుతుంది అంటూ న్యూఢిల్లీని ఆయన ఆదివారం హెచ్చరించారు. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదిలు పాకిస్థాన్‌కు తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చిన కొద్ది రోజులకే ఈ రియాక్షన్ వచ్చింది.
శుక్రవారం రోజు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది మాట్లాడుతూ.. పాకిస్థాన్ తన గడ్డపై ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపకపోతే అది ప్రపంచ పటంలో తన స్థానాన్ని నిలుపుకోగలదా లేదా అనేది ఆలోచించుకోవాలని సూచించారు. భవిష్యత్తులో సైనిక ఘర్షణ ఏర్పడితే.. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో న్యూఢిల్లీ చూపించిన సంయమనాన్ని మరోసారి ప్రదర్శించబోమని స్పష్టం చేశారు. “ఈసారి భారతదేశం పూర్తి సిద్ధంగా ఉంది. ‘ఆపరేషన్ సిందూర్ 1.0’ సమయంలో మేము చూపించిన సంయమనాన్ని ఈసారి చూపించము. ఈసారి మేము ఒక అడుగు ముందుకు వేసి.. పాకిస్థాన్ ప్రపంచ పటంలో ఉండాలా వద్దా అని ఆలోచించుకునేలా వ్యవహరిస్తాము” అని జనరల్ ద్వివేది గట్టిగా హెచ్చరించారు.
మరోవైపు వైమానిక దళ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అదే రోజు మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత వైమానిక దాడుల్లో అమెరికాకు చెందిన ఎఫ్-16 జెట్లతో సహా కనీసం పదిహేను పాకిస్థాన్ సైనిక విమానాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. భారత వైమానిక దాడుల్లో జరిగిన నష్టం గురించి ఇస్లామాబాద్ చేస్తున్న వాదనలను ఆయన "కల్పిత కథలు"గా అభివర్ణించారు. “మాకు అందిన ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం.. ఈ దాడుల వల్ల కనీసం నాలుగు ప్రాంతాలలో రాడార్లు, రెండు చోట్ల కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, రెండు రన్వేలు, మూడు వేర్వేరు స్టేషన్లలో ఉన్న వారి మూడు విమాన నిల్వ కేంద్రాలు దెబ్బతిన్నాయి” అని ఎయిర్ చీఫ్ మార్షల్ వివరించారు.
భారత రక్షణ మంత్రి హెచ్చరికలు
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశ పౌరులను రక్షించడానికి, దేశ సమగ్రతను కాపాడటానికి అవసరమైతే ఏ సరిహద్దునైనా దాటగల సత్తా భారతదేశానికి ఉందని రుజువైందని అన్నారు. 2016 సర్జికల్ స్ట్రైక్, 2019 బాలాకోట్ వైమానిక దాడి, ఇటీవలి ‘ఆపరేషన్ సిందూర్’ వంటి చర్యలను ఆయన అందుకు ఉదాహరణలుగా ఉదహరించారు. అంతకుముందు రోజు సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్థాన్ ఏదైనా దుందుడుకు చర్యకు పాల్పడితే.. అది చరిత్రను, భౌగోళిక అంశాలను మార్చగల నిర్ణయాత్మక ప్రతిస్పందనను ఆహ్వానిస్తుందని రక్షణ మంత్రి హెచ్చరించారు. సర్ క్రీక్ అనేది గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్, పాకిస్థాన్‌ల మధ్య ఉన్న 96 కిలో మీటర్ల పొడవైన సముద్రపు అంచు. ఇది సరిహద్దు రేఖల విషయంలో రెండు దేశాల మధ్య వివాదాస్పద ప్రాంతంగా పరిగణించబడుతోంది.
అయితే తాజాగా వీటిపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందించారు. భారత సైనిక, రాజకీయ నాయకుల తాజా ప్రకటనలు.. మే నెలలో జరిగిన ఘర్షణల్లో ఎదురైన ఓటమి తర్వాత కోల్పోయిన తమ విశ్వసనీయతను తిరిగి పొందడానికి చేసిన టవిఫల ప్రయత్నాలు' అని ఆయన విమర్శించారు. తమతో మళ్లీ యుద్ధానికి దిగితే.. విమాన శకలాల కిందే భారత దేశాన్ని పాతి పెడతామంటూ వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa