ట్రెండింగ్
Epaper    English    தமிழ்

''ఔరంగజేబు పాలనలో మాత్రమే భారత్ ఏకమైంది'.. పాక్ మంత్రి

national |  Suryaa Desk  | Published : Wed, Oct 08, 2025, 07:27 PM

దాయాది పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ మరోసారి భారత్‌ను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. భారత్ నిజంగా ఐక్యంగా ఉన్న కాలం ఏదైనా ఉంటే అది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాలనా కాలమే అంటూ చరిత్రను వక్రీకరించారు. పాకిస్థాన్‌ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. భారత్‌తో యుద్ధం జరిగే అవకాశాలను తోసిపుచ్చలేమని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే ప్రపంచ పటంలో పాకిస్థాన్ తన ఉనికి కోల్పోతుందని భారత్ హెచ్చరించిన కొద్ది రోజుల్లోనే ఖవాజా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


‘‘చరిత్రలను చూస్తే మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలో తప్పా భారత్ ఎప్పుడూ ఏకీకృతంగా లేదు. పాకిస్థాన్ అల్లాహ్ పేరుతో ఏర్పడింది.. మనలో మనం వాదించుకుంటాం.. గొడవపడతాం.. కానీ, భారత్‌తో యుద్ధం వస్తే అంతా కలిసి పోరాడుతాం’’ అని పాక్ రక్షణ మంత్రి ఖవాజా అసందర్భ ప్రేలాపన చేశారు. కాగా, బ్రిటిష్ పాలన ముగిసి స్వాతంత్య్రం పొందిన తర్వాత గడచిన ఏడు దశాబ్దాలకుపైగా భారత్ స్థిరమైన, ఏకీకృత ప్రజాస్వామ్య దేశంగా ముందుకెళ్తోంది. పాక్‌ మాత్రం అనేక సార్లు సైనిక తిరుగుబాటు, అంతర్గత విభజనలను ఎదుర్కొంది.


దీనికి వందల ఏళ్ల ముందే క్రీస్తుపూర్వం 322 నుంచి 185 వరకు మౌర్యులు విశాల భారతావనిని సామ్రాజ్యంగా చేసుకుని పాలించారు. భారత ఉపఖండంలోని ప్రాంతాలను ఒకే దేశంగా వీరిపాలన ఏకీకృతం చేసింది. ఇది భారత చరిత్రలో అత్యంత పెద్ద సామ్రాజ్యాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. వీరి తర్వాత పాలించిన గుప్తులు కూడా అదే వరవడి కొనసాగించారు. ఆ వంశానికి చెందిన సముద్రగుప్తుడు, పుష్యభూతి వంశానికి చెందిన హర్షవర్ధనుడు కూడా భారత్‌లోని విస్తృత ప్రాంతాలకు రాజకీయ ఐక్యంగా ఉంచారు.


ఇక, మొఘల్ పాలనలో భూభాగ పరంగా చూస్తే ఔరంగజేబు కాలంలోనే సామ్రాజ్యం దాదాపు భారత ఉపఖండాన్ని విస్తరించింది. అయితే, స్థిరత్వంతో కూడిన గొప్ప ఏకీకరణకు సాక్ష్యంగా నిలిచిన అక్బర్ పాలనలా కాకుండా ఔరంగజేబు పాలన అంతులేని యుద్ధాలు, తిరుగుబాట్లతో సాగింది.


ఇక, పాక్ రక్షణ మంత్రి ఖవాజీ భారత్‌తో యుద్దాన్ని తోసిపుచ్చలేమని పేర్కొనడం గమనార్హం. ‘నేను ఉద్రిక్తతలను కోరుకోవడం లేదు. కానీ ముప్పు మాత్రం ఉంది.. దీనిని కొట్టిపారేయలేను. ఒకవేళ యుద్ధం జరిగి, దేవుడు కరుణిస్తే మేము గతంలో కంటే మెరుగైన ఫలితం సాధిస్తాం’ అని కవ్వింపులకు పాల్పడ్డారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఖవాజీ ఈ వ్యాఖ్యలు చేశారు. గతవారం ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాక్‌కు తీవ్ర హెచ్చరికలు చేశారు. ‘ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం లేదా మద్దతు ఇవ్వడం ఆపాలి.. లేకపోతే పాకిస్థాన్ భౌగోళిక ఉనికి కోల్పోవడానికి సిద్ధంగా ఉండాలి’ అని వార్నింగ్ ఇచ్చారు.


కాగా, ఖవాజా అసిఫ్‌‌కు అంతర్జాతీయ వేదికలపై కూడా పాకిస్థాన్ పరువుపోయేలా వ్యాఖ్యలు చేసిన ఘనమైన చరిత్ర ఉంది. గత నెలలో వరదలు సంభవించినప్పుడు లోతట్టు ప్రాంతాల ప్రజలు వరద నీటిని కంటెయినర్లలో నింపుకోవాలంటూ సలహా ఇచ్చి ఆగ్రహానికి గురయ్యారు. అంతేకాదు, వరదలను ఆశీస్సులు అనుకోవాలని ప్రజలను మరింత రెచ్చగొట్టేలా మాట్లాడారు. ఇక, ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ ఈయన గోబెల్స్ ప్రచారం పీక్స్‌కు చేరింది. సీఎన్ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత యుద్ధ విమానాలను పాక్ సైన్యం కూల్చేసిందంటూ ఫేక్ ప్రచారం చేసి బొక్కబోర్లాపడ్డారు. యాంకర్ ఆధారాలు చూపమని అడగటంతో ఆయన గొంతులో పచ్చి వెలక్కాయపడింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa