ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'భారత్‌తో యుద్ధం జరిగే అవకాశం ఉంది': పాకిస్థాన్ రక్షణ మంత్రి

international |  Suryaa Desk  | Published : Wed, Oct 08, 2025, 09:42 PM

భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో.. దాయాది దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మంగళవారం రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో యుద్ధం వచ్చే అవకాశాలు నిజంగానే ఉన్నాయని.. ఆ ప్రమాదాన్ని తాను కాదనడం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈసారి యుద్ధం వస్తే మాత్రమే తాము అనకూల ఫలితాలు సాధిస్తామని పేర్కొన్నారు. ఇటీవలే భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది చేసిన తీవ్ర హెచ్చరికలకు ప్రతిగా ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.


పాకిస్థాన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ ఈ కామెంట్లు చేశారు. తాను ఉద్రిక్తతలను పెంచాలని కోరుకోవడం లేదని.. కానీ ముప్పు పొంచి ఉన్న మాట నిజం అని అన్నారు. ఆ అవకాశాన్ని తాను ఖండించడం లేదని కూడా క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ భారత్‌తో యుద్ధం జరిగితే.. దేవుడి దయ వల్ల గతంలో కంటే మెరుగైన ఫలితాన్ని సాధిస్తామని చెప్పారు. అక్కడితో ఆగకుండా సమా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్.. భారతదేశ చరిత్రపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "ఔరంగజేబు పాలనలో తప్ప చరిత్రలో భారత్ ఎప్పుడూ ఒక ఐక్య దేశంగా లేదు. పాకిస్థాన్ అల్లా పేరు మీదుగా సృష్టించబడింది. మా దేశంలో మేము వాదించుకుంటాం, పోటీ పడతాం. కానీ భారత్‌తో పోరాటం విషయానికి వస్తే మేము ఏకమవుతాం" అని ఆయన వ్యాఖ్యానించారు.


ఖవాజా ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేయడానికి కొన్ని రోజుల ముందే భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది.. పాకిస్థాన్ అండదండలతో జరుగుతున్న ఉగ్రవాదాన్ని వెంటనే ఆపాలని గట్టిగా హెచ్చరించారు. భారత్ ఈసారి పూర్తిగా సిద్ధంగా ఉందని.. ఆపరేషన్ సింధూర్ 1.0 సమయంలో చూపించిన సంయమనాన్ని ఈసారి చూపించమంటూ వ్యాఖ్యానించారు. పాక్ ఇలాగే సీమాంతర ఉగ్రవాదాన్ని కొనసాగిస్తే.. ఆ దేశం చిత్రపటంలో కూడా కనిపించదంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కునేందుకు సైనికులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. దేవుడు కోరుకుంటే ఆ అవకాశం మనకు త్వరలోనే వస్తుందని జవాన్లను ఉద్దేశించి మాట్లాడారు.


ఇక ఆ తర్వాత నుంచి పాకిస్థాన్ ప్రేలాపనలు చేస్తూ వస్తోంది. ముఖ్యంగా ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇప్పటికే దీనిపై ఓసారి స్పందించారు. సైనిక ఘర్షణకు ప్రయత్నిస్తే యుద్ధ విమానాలు శిథిలాల కింద భారత్ సమాధి అవుతుందని హెచ్చరించారు. మే నెలలో జరిగిన ఘర్షణల్లో ఎదురైన ఓటమి తర్వాత కోల్పోయిన తమ విశ్వసనీయతను తిరిగి పొందడానికే.. భారతదేశ రాజకీయ నాయకులు, సైనికుల అధిపతులు చేస్తున్న విఫల ప్రయత్నాలు ఇవంటూ విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa