ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ పురస్కారాల ప్రకటన కొనసాగుతోంది. ఇప్పటివరకు మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్ రంగాల్లో ఇప్పటివరకు నోబెల్ విజేతలను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు. మరియా కొరినా మచాడో కు ఈ ఏడాదికి సంబంధించిన నోబెల్ శాంతి పురస్కారం వరించింది. మరియా కొరినా మచాడో వెనిజులా పార్లమెంట్ సభ్యురాలు. వెనిజులా ప్రజల కోసం మరియా కొరినా మచాడో చేసిన అవిశ్రాంత కృషి, వారి హక్కుల కోసం చేసిన పోరాటం ఫలితంగానే ఆమెకు ఈ నోబెల్ బహుమతి దక్కినట్లు నార్వేజియన్ నోబెల్ కమిటీ వెల్లడించింది.
వెనిజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో మరియా కొరినా మచాడో చేసిన అవిశ్రాంత కృషి.. దాంతో పారుట నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యానికి న్యాయమైన, శాంతియుత పరివర్తనను సాధించడానికి ఆమె చేసిన పోరాటానికి గాను ఈ అరుదైన గౌరవం లభించింది. ఇక మరియా కొరినా మచాడోను వెనిజులా ఉక్కు మహిళ అని కూడా పిలుచుకుంటారు. ఇక ఆమె వెనిజులా పార్లమెంటులో ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్నారు.
వెనిజులాలో ఒకప్పుడు చీలిపోయిన ప్రతిపక్షంలో కీలక పాత్ర వహించిన మారియా కొరినా మచాడో తిరిగి ఏకీకృతం చేశారని.. నార్వేజియన్ నోబెల్ కమిటీ ఛైర్మన్ జోర్గెన్ వాట్నే ఫ్రైడ్నెస్ వివరించారు. వెనిజులాలో స్వేచ్ఛాయుత ఎన్నికలు, ప్రజా ప్రాతినిధ్య ప్రభుత్వం కోసం డిమాండ్‌లో ప్రతిపక్షాలను ఐక్యం చేయడానికి ఆమె నాయకత్వం వహించారని తెలిపారు. గత ఏడాది కాలంగా.. మరియా కొరినా మచాడో దాక్కుని జీవించవలసి వచ్చిందని.. తన ప్రాణాలకు తీవ్రమైన ముప్పు ఉన్నప్పటికీ.. ఆమె వెనెజులాలోనే ఉండి పోరాటం చేసినట్లు కమిటీ తెలిపింది. ఆమెను నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేయడం.. కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చిందని పేర్కొంది. నియంతలు అధికారాన్ని చేజిక్కించుకున్నప్పుడు.. ధైర్యంగా నిలబడి ప్రతిఘటించే స్వేచ్ఛా రక్షకులను గుర్తించడం చాలా ముఖ్యమని కమిటీ అభిప్రాయపడింది.
వెనిజులా ఐరన్ లేడీగా పిలువబడే మరియా కొరినా మచాడో.. ప్రజాస్వామ్య ఉద్యమానికి నాయకురాలిగా, లాటిన్ అమెరికాలో ప్రజల ధైర్యానికి అద్భుతమైన ఉదాహరణగా నిలిచారు. ఒకప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా, సంపన్న దేశంగా ఉన్న వెనెజులా.. ప్రస్తుతం మానవతా, ఆర్థిక సంక్షోభంతో బాధపడుతున్న క్రూరమైన, నిరంకుశ దేశంగా మారింది. వెనిజులా దేశంలోని అత్యధిక మంది తీవ్రమైన పేదరికంలో మగ్గిపోతుండగా.. పాలనలో ఉన్న కొద్దిమంది మాత్రమే ధనవంతులుగా మారుతున్నారు.
ఇక ప్రభుత్వం ప్రజలపై హింసాత్మక చర్యలు తీసుకోవడంతో.. దాదాపు 80 లక్షల మంది ప్రజలు దేశం విడిచి వెళ్లారు. ఎన్నికల మోసాలు, న్యాయపరమైన కేసులు, జైలు శిక్షల ద్వారా ప్రతిపక్షాన్ని అక్కడి ప్రభుత్వం అణచివేస్తోంది. ప్రజాస్వామ్య అభివృద్ధి కోసం ఏర్పడిన సుమాటే అనే సంస్థ వ్యవస్థాపకురాలిగా.. మరియా కొరినా మచాడో 20 ఏళ్ల క్రితమే స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం నడుం బిగించారు.
స్వీడన్‌కు చెందిన సైంటిస్ట్, ఇంజినీర్, బిజినెస్‌మెన్‌గా ఫేమస్ అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 10వ తేదీన ఈ నోబెల్ బహుమతులు గెలుచుకున్న వారికి పురస్కారాలు అందిస్తారు. ఇక ఆ రోజు జరగనున్న వేడుకల్లో నోబెల్ విజేతలుగా నిలిచిన వారికి బహుమతితో పాటు.. 10 లక్షల డాలర్లు అంటే మన భారత కరెన్సీలో సుమారు రూ.8.8 కోట్ల నగదు అందించనున్నారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ 1896లో మరణించగా.. 1901 నుంచి నోబెల్ ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa