దేశంలో కొన్ని ప్రాంతాల్లో ముస్లిం జనాభా పెరుగుదలకు చొరబాట్లే ప్రధాన కారణమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. చొరబాట్లను కొన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా చూస్తున్నాయని ఆరోపించారు. శుక్రవారం నాడు 'దైనిక్ జాగరణ్' మాజీ సంపాదకులు నరేంద్ర మోహన్ స్మారక ఉపన్యాసంలో 'చొరబాటు, జనాభా మార్పు, ప్రజాస్వామ్యం' అనే అంశంపై మాట్లాడుతూ అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
చొరబాటు అనేది కేవలం రాజకీయ అంశం కాదని, ఇది దేశ భద్రతకు, ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదంగా పరిణమించిన ఒక జాతీయ సమస్య అని అమిత్ షా స్పష్టం చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, అస్సాంలో ముస్లిం జనాభా పదేళ్లలో 29.6 శాతం మేర వృద్ధి చెందిందని అమిత్ షా తెలిపారు. "చొరబాటు లేకుండా ఈ స్థాయిలో వృద్ధి జరగడం అసాధ్యం" అని కేంద్ర హోంమంత్రి నొక్కి చెప్పారు. అలాగే పశ్చిమ బెంగాల్‌లోని అనేక జిల్లాల్లో ముస్లిం జనాభా వృద్ధి రేటు 40 శాతం వరకు ఉందని, సరిహద్దు ప్రాంతాల్లో అయితే అది 70 శాతం వరకు చేరుకుందని షా వెల్లడించారు. గతంలో చొరబాట్లు జరిగాయనేదానికి ఇది అసలైన నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
కొన్ని రాజకీయ పార్టీలు చొరబాటుదారులకు ఆశ్రయం కల్పించి, వారిని ఓటు బ్యాంకుగా పరిగణిస్తున్నందునే ఈ సమస్య మరింత జఠిలమవుతోందని అమిత్ షా ఆరోపించారు. మన దేశంలో గుజరాత్, రాజస్థాన్‌కు కూడా సరిహద్దులు ఉన్నాయన్నారు. మరి ఆ ప్రాంతాల నుండి చొరబాట్లు ఎందుకు జరగడం లేదు అని ఆయన ప్రతిపక్షాలను ప్రశ్నించారు. చొరబాట్లను నిలువరించే బాధ్యత కేంద్రంపై, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌పై ఉందని ప్రతిపక్షాలు వాదిస్తున్నప్పటికీ, కేవలం కేంద్రం ఒక్కటే దీనిని ఆపలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
భౌగోళిక పరిస్థితుల కారణంగా సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాల్లో కంచె వేయడం సాధ్యం కాదని పేర్కొన్న ఆయన, అటువంటి ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వాల సహకారం చాలా అవసరమని అన్నారు. ఒక వ్యక్తి అక్రమంగా దేశంలోకి ప్రవేశించినప్పుడు, స్థానిక జిల్లా యంత్రాంగం వారిని గుర్తించడంలో విఫలమైతే.. చొరబాటును ఎలా ఆపగలం అని ఆయన సూటిగా ప్రశ్నించారు. జార్ఖండ్‌లో ఆదివాసీ సమాజాల జనాభా గణనీయంగా తగ్గిపోవడానికి కూడా బంగ్లాదేశ్ నుంచి జరుగుతున్న చొరబాట్లే కారణమని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి దేశ జనాభా నిర్మాణంలో వస్తున్న ఈ మార్పులు, జాతీయ భద్రతపై దీర్ఘకాలికంగా చూపే ప్రభావంపై అమిత్ షా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa