ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇందిరా గాంధీ చేసిన ఆ తప్పు వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయారు: చిదంబరం షాకింగ్ కామెంట్లు

national |  Suryaa Desk  | Published : Sun, Oct 12, 2025, 03:00 PM

చారిత్రక, సున్నితమైన అంశమైన 'ఆపరేషన్ బ్లూ స్టార్' (1984)పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం (గోల్డెన్ టెంపుల్) నుంచి ఉగ్రవాదులను బయటకు పంపడానికి అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆదేశాల మేరకు చేపట్టిన ఆ సైనిక చర్య ఒక 'తప్పుడు మార్గం' అని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాక ఆ తప్పుడు నిర్ణయం వల్లే ఇందిరా గాంధీ తన ప్రాణాలను బలివ్వాల్సి వచ్చిందని చిదంబరం అన్నారు. జర్నలిస్ట్ హరీందర్ బవేజా రచించిన "దే విల్ షూట్ యు, మేడమ్" అనే పుస్తకంపై జరిగిన చర్చా కార్యక్రమంలో చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు.


స్వర్ణ దేవాలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇందిరా గాంధీ ఎంచుకున్న విధానం ఖచ్చితంగా తప్పుడు మార్గమే అని పి. చిదంబరం అన్నారు. కానీ ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్ణయానికి ఇందిరమ్మను మాత్రమే నిందించలేమని తెలిపారు. ఆ నిర్ణయం కేవలం ఒక్క వ్యక్తిది మాత్రమే కాదని గుర్తు చేశారు. అది సైన్యం, పోలీసులు, నిఘా వ్యవస్థ, పౌర సేవల అధికారుల సమష్టి నిర్ణయం అని చెప్పుకొచ్చారు. ఆ తప్పునకు ఇందిరా గాంధీ తన ప్రాణాలను కోల్పోయారని చెప్పారు. మూడు, నాలుగేళ్ల తర్వాత సైన్యాన్ని దూరంగా ఉంచి కూడా గోల్డెన్ టెంపుల్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవచ్చని సరైన మార్గాన్ని మేమే చూపించామని చిదంబరం స్పష్టం చేశారు.


అసలేమిటీ ఆపరేషన్ బ్లూ స్టార్?


1984లో జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో సిక్కుల పవిత్ర స్థలమైన స్వర్ణ దేవాలయంలో దాక్కున్న మిలిటెంట్లను, వేర్పాటువాదులను నిర్బంధించడానికి భారత సైన్యం చేపట్టిన సైనిక చర్య. పంజాబ్‌లో కొందరు వేర్పాటువాద శక్తులు స్వతంత్ర దేశం 'ఖలిస్థాన్' కావాలంటూ చేపట్టిన ఉద్యమం అప్పట్లో ఉగ్రరూపం దాల్చింది. 1980వ దశకంలో ఈ ఉద్యమం వివాదాస్పద నేత జర్నైల్‌ సింగ్‌ భింద్రన్‌ వాలే నాయకత్వంలో నడిచింది. భింద్రన్‌ వాలే తన కార్యకలాపాలకు గోల్డెన్ టెంపుల్‌ను స్థావరంగా మార్చుకున్నాడు. అక్కడి నుంచే తన అనుచరులతో పోలీసులపై దాడులు చేయించడం, వేర్పాటువాద కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీంతో పంజాబ్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.


ఈ పరిణామాల నేపథ్యంలోనే అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ కఠిన నిర్ణయం తీసుకున్నారు. భారత సైన్యంతో చర్చలు జరిపి స్వర్ణ దేవాలయంలో దాక్కున్న ఖలిస్థాన్ వేర్పాటువాదులను అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికి అనుగుణంగా ఇండియన్ ఆర్మీ 1984, జూన్ 1న సైనిక చర్యను ప్రారంభించింది. భారత సైన్యం మొదటగా వేర్పాటువాది భింద్రన్‌ వాలే సహా ఆలయంలోని మిలిటెంట్లను నిర్బంధించడానికి ప్రయత్నించింది. అయితే మిలిటెంట్లు భారీ ఆయుధాలు, రాకెట్ లాంచర్లతో సైన్యంపై ఎదురు దాడులకు దిగారు. ఊహించని ఈ ప్రతిఘటనతో భారత సైన్యం కూడా ఎదురుదాడులు చేసింది. జూన్ 1వ తేదీన మొదలైన ఈ ఆపరేషన్ జూన్ 8 వరకు కొనసాగింది. ఈ ఆపరేషన్‌లో భింద్రన్‌ వాలేతో పాటు పలువురు ఇతర వేర్పాటువాద నేతలు హతమయ్యారు. ఈ సైనిక చర్యలో 83 మంది భారత సైనికులు అమరులు అయ్యారు. మరో 236 మంది క్షతగాత్రులయ్యారు.


ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగిన నాలుగు నెలల తర్వాత అంటే 1984 అక్టోబర్ 31వ తేదీన ప్రధాని ఇందిరా గాంధీని ఆమె ఇద్దరు సిక్కు బాడీగార్డులు తుపాకీ కాల్పులతో హత్య చేశారు. ఈ హత్యానంతరం దేశవ్యాప్తంగా సిక్కుల వ్యతిరేక అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో వేలాది మంది సిక్కులు ప్రాణాలు కోల్పోవడం దేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలింది. తాజాగా ఈ చారిత్రక అంశంపై బీజేపీ, ఇతర విపక్షాలు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా మరోసారి చర్చకు దారితీసింది. ఆపరేషన్ బ్లూ స్టార్‌ను ఆయన తప్పుగా అభివర్ణించినప్పటికీ.. ఆ నిర్ణయానికి ఇందిరా గాంధీని మాత్రమే నిందించలేమని పేర్కొనడం గమనార్హం.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa