దీపావళి అనగానే దీపాల కాంతులతో వెలిగే అందమైన దృశ్యాలు కళ్లముందు కదలాడుతుంటాయి. దీపావళి రోజున దేశవ్యాప్తంగా సంబురాలు ఘనంగా నిర్వహించుకుంటారు. కానీ ఉత్తరాఖండ్ పిథోరగఢ్ జాల్లానిలోని 66 గ్రామాలు మాత్రం 12 ఏళ్లకు పైగా అంధకారంలో ఉన్నాయి. విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల కాదు.. దీపాలు వెలిగించడానికైనా, లైట్లు ఆన్ చేయడానికైనా ఆ గ్రామాల్లో ఒక్క మనిషి కూడా లేడు. 2011 జనాభా లెక్కల తర్వాత వీటిని అధికారికంగా నిర్జన ప్రదేశాలుగా ప్రకటించారు. ఈ గ్రామాలు ఇప్పుడు ఖాళీగా, నిశ్శబ్దంలో దర్శనమిస్తున్నాయి. ఇళ్లలోని రాతి గోడలు, చెక్క దూలాలు నెమ్మదిగా మట్టిలో కలిసిపోయేందుకు సిద్ధమవుతున్నాయి.
ఉత్తరాఖండ్‌లో మారుమూల కొండ ప్రాంతాల నుంచి ప్రజలు దశాబ్దాలు ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారు. కానీ ఈ వలసలు ఒకప్పుడు సీజన్ ప్రకారం ఉండేవి. ఇప్పుడు శాశ్వతంగా మారాయి. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, వలస కమిషన్ లెక్కల ప్రకారం.. 2011 నుంచి 734 కంటే ఎక్కువ గ్రామాలు పూర్తిగా జనాభాను కోల్పోయాయి. మరో 565 గ్రామాల్లో సగానికి పైగా జనాభా ఖాళీ అయ్యారు. వివిధ సర్వేల ప్రకారం.. 100 కంటే ఎక్కువ గ్రామాలు ఇప్పుడు పేరుకు మాత్రమే ఉన్నాయి.
ఆ గ్రామాల్లో మనుషులు ఎందుకు లేరు..?
ఈ గ్రామాల్లోంచి ఇతర ప్రాంతాలకు తాము వలస వెల్లడానికి ప్రధాన కారణం.. పిల్లలు చదవుకునేందుకు పాఠశాలలు లేకపోవడమేని చాలా మంది చెబుతున్నారు. అంతేకాకుండా మారుమూల ప్రాంతంలో ఏదైనా జరిగినా.. వైద్య సహాయం చేయడానికి డాక్టర్లు అందుబాటులో లేకపోవడం కూడా మరో కారణమని అంటున్నారు. వీటికి తోడు ఉపాధి లేనందు వల్ల ఊళ్లకు ఊళ్లు ఖాళీ అవుతున్నాయి. ఈ పరిస్థితిపై సామాజిక కార్యకర్త ప్రకాష్ పాండే వివరాలు వెల్లడించారు. ప్రజలు గ్రామాలను విడిచి వెళ్లిపోవాలని అనుకోలేదని.. కానీ వారు వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గ్రామాల్లో.. పాఠశాలలు, ఆసుపత్రులు, రోడ్లు, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలు లేకపోతే.. రివర్స్ మైగ్రేషన్ సాధ్యం కాదని చెప్పారు. ఇవన్నీ లేకపోతే ప్రజలు ఈ గ్రామాల్లోకి ఎందుకు తిరిగి వస్తారని ప్రశ్నించారు.
ఈ గ్రామాల్లో మౌలిక సదుపాయాల లేమి ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన నివేదిక ప్రకారం.. పిథోరగఢ్ జిల్లాలో 10,000 మందికి పైగా ప్రజలు.. తమ ఫోన్‌లో సిగ్నల్ రావాలంటే.. దాదాపు 15 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి. వలసలు అరికట్టడానికి ఎకో టూరిజం పెంపొందిచడానికి, క్లస్టర్ ఆధార అభివృద్ధి వంటి పథకాలు చేపట్టినా.. సరైన ఫలితాలు రాలేదు.
ఇతర కారణాలు..
మౌలికసదుపాయాలు మాత్రమే కాకుండా చిరుత వంటి వన్యమృగాల దాడులు.. తరచుగా వచ్చే వరదలు, కొండచరియలు విరిగిపడుతుండటం వల్ల కూడా.. ప్రజలు గ్రామాలు ఖాళీ చేయాల్సి వచ్చింది. బాగేశ్వర్ జిల్లాలోని ఖాతి,వాచం అనే రెండు గ్రామాలు.. కమ్యూనిటీ ఆధారిత పర్యాటకం, స్థానికంగా షాపులు వంటివి నిర్వహించడం వల్ల.. వలసలకు కాస్త అడ్డుకట్ట వేయగలిగాయి. కానీ అనేక గ్రామాలు మాత్రం ఇంకా చీకటిలోనే ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa