ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రెండు రాష్ట్రాల ఐటీ మంత్రులు పెట్టుబడుల విషయమై.. తామంటే తాము గొప్ప అని ఎక్స్‌లో వాగ్యుద్ధం చేస్తున్నారు! విశాఖపట్నంలో దాదాపు రూ. 88,000 కోట్లతో గూగుల్ డేటా సెంటర్, ఏఐ హబ్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం, గూగుల్ మధ్య ఇటీవల చారిత్రాత్మక ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ట్వీట్ల వార్ మొదలైంది. విశాఖలో గూగుల్ పెట్టుబడుల్ని ప్రస్తావిస్తూ మంత్రి లోకేశ్ ఆసక్తికరమైన ట్వీట్ పెట్టారు. 'ఆంధ్రప్రదేశ్ వంటకాలు ఘాటు ఎక్కువగా ఉంటాయని అందరూ అంటారు. మన పెట్టుబడులు కూడా అంతే మరి. ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ఇన్వెస్ట్‌మెంట్లకు కూడా కారం ఎక్కువే. ఇప్పటికే ఈ ఘాటు సెగ పొరుగువారికి తగులుతోంది' అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. తాజాగా ఈ ట్వీట్‌కు కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే కౌంటర్ ఇచ్చారు.
అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్..
ఏపీ మంత్రి లోకేశ్‌కు కౌంటర్ ఇస్తూ ప్రియాంక్ ఖర్గే ట్విట్ చేశారు. 'ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో కాస్తంత ఘాటు ఉన్నా.. దాన్ని ఆస్వాదిస్తారు. కానీ పోషకాహార నిపుణులు ఆహారంలో సమతుల్యత ఉండాలని సిఫార్సు చేస్తున్నారు. అలాగే ఆర్థికవేత్తలు కూడా సమతుల్య బడ్జెట్‌ను మెయింటేన్ చేయాలని చెబుతున్నారు. పొరుగువారి (ఆంధ్రప్రదేశ్‌ను ఉద్దేశించి) మొత్తం అప్పులు.. ఇప్పుడు దాదాపు రూ.10 లక్షల కోట్లకు పెరిగాయి. కేవలం ఒక్క సంవత్సరంలో.. వారు రు. 1.61 లక్షల కోట్లకు పైగా అప్పులు తీసుకున్నారు. స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి, ఆదాయ లోటు మధ్య మరింత వ్యత్యాసం మరింత దిగజారింది. అది 2.65 శాతం నుంచి 3.61 శాతానికి పెరిగింది. ఏం చెప్పినా, చేసినా.. మనం ఎల్లప్పుడూ ఇలాగే ఉంటాము' అని చెప్పారు. అనంతరం 'పొరుగువారి అసూయ.. యజమానికి గర్వం' అంటూ చివర్లో ఓ ఎలక్ట్రానిక్ కంపెనీ క్యాప్షన్ వదిలారు ప్రియాంక్ ఖర్గే. దీంతో ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం మరింత ముదిరినట్లైంది.
అంతకుముందు, అక్టోబర్ 15న ఏపీ ప్రభుత్వంపై ప్రియాంక్ ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. గూగుల్ పెట్టుబడుల గురించి రాష్ట్రం గొప్పలు చెప్పుకుంటోందని.. దానీ వారికి అందిస్తున్న రూ. 22, 000 కోట్ల భారీ ప్రోత్సాహకాలను దాచిపెడుతోందన్నారు. అంతేకాకుండా పూర్తి జీఎస్టీ రీఎంబర్స్‌మెంట్ ఆఫర్ చేసిందని పేర్కొన్నారు. భూమి, వాటర్, విద్యుత్.. అన్నింట్లో రాయితీ ఇస్తోందని అన్నారు.
దీనిపై లోకేశ్ ఘాటుగా స్పందించారు. 'ఒకవేళ వారు (కర్ణాటక ప్రభుత్వం) అసమర్థులైతే, నేను ఏమి చేయగలను? ఆ రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలే.. అక్కడ మౌలిక సదుపాయాలు సరిగా లేవని అంటున్నారు. విద్యుత్ కోతలు ఉన్నాయని చెబుతున్నారు. ముందుగా వారు ఆ సమస్యలను పరిష్కరించాలి' అని హితవు పలికారు లోకేశ్. కాగా, రాష్ట్రాల మధ్య పోటీ మంచిదే.. కానీ అది వ్యక్తిగత స్థాయికి దిగజారొద్దని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఈ విమర్శలు, ప్రతివిమర్శల వల్ల.. ఇరు రాష్ట్రాల్లోని ప్రజలకు ఒక అవగాహన వస్తే.. అదే చాలు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa