ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రంజీ ప్లేయర్ కొడుకు.. క్రికెట్ కెరీర్ నాశనం..!,,సైబర్ మోసం కేసులో అరెస్టై రిషి అరోథే

Crime |  Suryaa Desk  | Published : Fri, Oct 17, 2025, 09:14 PM

'పండిత పుత్ర పరమ శుంఠ' అనే సామెత వినే ఉంటారు. తండ్రి ఎంతటి పండితుడైనా.. కొన్ని సందర్భాల్లో కొడుకు మూర్ఖుడు అవుతాడని దీని అర్థం. ఈ సామెతను నిజం చేసే ఘటన మరొకటి జరిగింది. తండ్రి రంజీ ట్రోఫీలో ఓ వెలుగు వెలిగాడు. కోచ్‌గా అనేక మందిని క్రికెటర్లుగా తీర్చిదిద్దాడు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న తల్లి కూడా.. అనేక మంది పిల్లల భవిష్యత్తుకు బంగారు పునాది వేసింది. అయితే తల్లిదండ్రులు ఇంతటి వారైనా కుమారుడు.. డబ్బులకు కక్కుర్తి పడి అడ్డదారులు తొక్కాడు. టీమిండియా జెర్సీలో చూడాలనుకుంటే.. నేరస్థుడిగా మారి చేతులకు సంకెళ్లు వేసుకున్నాడు. ఈ క్రమంలో ఎన్నిసార్లు చెప్పినా.. తమ మాట పెడచెవిన పెట్టాడని తల్లి కన్నీరుమున్నీరుగా విలపిచండం.. అక్కడున్న వారి హృదయాలను కదిలించింది.


గుజరాత్‌కు చెందిన తుషార్ బాలచంద్ర అరోథే పేరు మోసిన రంజీ క్రికెటర్‌. బరోడా క్రికెట్ టీమ్ తరఫున 100 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. తుషార్ అరోథే.. వివిధ జట్లకు కోచ్‌గా వ్యవహరించారు. ఇప్పటికే ఆ రంగంలో తుషార్ రాణిస్తున్నాడు. అతడి కొడుకు రిషికి ((30)) కూడా చిన్నప్పటి నుంచి క్రికెట్‌లో మెలకువలు నేర్పాడు. దీంతో రిషి బరోడా తరఫున రంజీ, విజయ్ హజారే ట్రోఫీ లిస్ట్‌లో కూడా అరంగేట్రం చేశాడు. రిషిని టీమిండియాలో చూడాలనేది తల్లిదండ్రుల కోరిక. రిషి కూడా క్రికెట్ ఆడుతుండటంతో.. కుమారుడు తమ ఆశలను నెరవేరుస్తాడని అనుకున్నారు. అక్కడే రిషి మెదడులో పురుగు మెదిలింది.


డబ్బులకు కక్కుర్తి పడి..


డబ్బు రుచికి అలవాడు పడిన రిషి.. అడ్డదారిలో డబ్బు సంపాదించడంపై దృష్టి పెట్టాడు. అందుకోసం ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ ఆడాడు. తర్వాత గోవాకు మకాం మార్చి.. బెట్టింగ్‌లు, క్యాసినో నిర్వహించి డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో గోవాలోని సైబర్‌ నేరస్థులతో పరిచయం పెంచుకున్నాడు. వారిచ్చే ఇచి కమిషన్‌కు ఆశపడి.. సైబర్‌ నేరగాళ్లు కొట్టేసిన డబ్బును వారి ఖాతాల్లోకి మల్లించడానికి సహాయం చేసేవాడు. బీటెక్‌ చదివిన రిషికి సాంకేతికతపై కూడా పట్టు ఉండడంతో అడ్డూ అదుపూ లేకుండా పోయింది.


పోలీసులకు చిక్కకుండా సైబర్ నేరస్థులకు సహాయం చేసేందుకు మార్గాలు అన్వేశించాడు. అందులో భాగంగా కొట్టేసిన డబ్బు జమ చేసేందుకు అద్దె (మ్యూల్‌) అకౌంట్లను సమకూర్చటం మొదలుపెట్టాడు. వారితో ఎలాంటి సంబంధాలు లేకుండా జాగ్రత్త పడ్డాడు. అందుకోసం ఫారిన్ ఫోన్‌ నంబర్లతో వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ గ్రూపులు స్టార్ట్ చేసి.. లింకులు పంపి అమాయకులను మోసం చేయడం ప్రారంభించాడు. బ్యాంకు అకౌంట్లలోకి వచ్చిన డబ్బును.. బిట్‌కాయిన్, క్రిప్టో కరెన్సీ రూపంలో మార్చి విదేశాలకు మళ్లించేవాడు. ఇలా రూ.కోటి డబ్బును విదేశాలకు మల్లించినందుకు.. అతడికి రూ.10 లక్షల కమిషన్‌ వచ్చేది.


ఇలా చేయొద్దని రిషిని తల్లిదండ్రులు చాలా సార్లు వారించినా.. వారి మాట వినలేదు. చివరకు హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి.. నకిలీ కంపెనీల్లో పెట్టుబడి పెట్టి మోసయానని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. బాధితుడు సైబర్ నేరస్థులకు పంపించిన డబ్బు.. వడోదరాలోని ఓ అకౌంట్‌కు వెళ్లినట్లు.. అది ఇనాందార్‌ వినాయక రాజేందర్‌ను (25) అనే వ్యక్తి పేరుపై ఉన్నట్లు గుర్తించారు. అనంతరం అతడిని ప్రశ్నించటంతో.. తాను రిషికి నగదు ఇచ్చినట్టు తెలిపాడు. అనంతరం రిషి ఇంటి వద్ద రెండు రోజులు మాటు వేసిన పోలీసులు.. చివరకు అతడిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో అతడి తల్లి కన్నీరు పెట్టడం అందరినీ కదిలించింది. గతంలో కూడా రిషిని గోవాలో పోలీసుల అరెస్ట్ చేశారు. అయిన అతడిలో మార్పు రాలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa