పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌ల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర రూపం దాల్చాయి. శుక్రవారం సాయంత్రం రెండు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ముగియడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలోనే పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ అఫ్గాన్ పాలక తాలిబన్ ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా తమ దేశం చేసిన త్యాగాలను తాలిబన్లు అర్థం చేసుకోలేదని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఈ తాజా ఘర్షణల వెనుక భారత్ పాత్ర ఉందని మరోసారి నిరాధార ఆరోపణలు చేశారు.
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ సామాజిక మాధ్యమాల వేదికగా చేసిన వ్యాఖ్యలు ఈ ఉద్రిక్తతలకు అద్దం పడుతున్నాయి. ‘‘ఇకపై నిరసనలు, శాంతి కోసం పిలుపునివ్వడాలు ఉండవు. కాబుల్‌కు మా ప్రతినిధుల బృందం వెళ్లదు. ఉగ్రవాదానికి మూలం ఎక్కడున్నా, దానికి భారీ మూల్యం చెల్లించక తప్పదు’’ అని ఆయన స్పష్టం చేశారు. అఫ్గాన్ రాజధాని కాబుల్ భారత్‌కు అనుబంధ సంస్థలా వ్యవహరిస్తోందని, రెండు దేశాలు కలిసి పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాయని ఆసిఫ్ ఆరోపించారు. తెహ్రీకీ తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) కూడా ఈ కుట్రలో భాగమని ఆయన పేర్కొన్నారు.
మలబద్ధకంతో బాధపడుతున్నారా, ఇప్పుడు చెప్పేవి తింటే క్షణాల్లో కడుపు మొత్తం ఖాళీ అయి చాలా రిలాక్స్‌గా ఉంటారు
గతంలో తమపై ఆధారపడి, పాకిస్థాన్‌లో తలదాచుకున్న తాలిబన్లు ఇప్పుడు తమను అర్థం చేసుకోకపోవడం బాధాకరమని ఆసిఫ్ అన్నారు. ‘‘అఫ్గాన్‌తో గతంలో మాదిరిగా సంబంధాలు కొనసాగించలేం. మా దేశంలో నివసిస్తున్న అఫ్గాన్ ప్రజలు వారి స్వదేశానికి వెళ్లిపోవాలి. వారికి ఇప్పుడు వారి సొంత ప్రభుత్వం ఉంది. మా వనరులు మా ప్రజల కోసం మాత్రమే. కొన్నేళ్లుగా మేము ఎన్నో త్యాగాలు చేసినప్పటికీ, కాబుల్ నుంచి మాకు సానుకూల స్పందన రాలేదు’’ అని ఖ్వాజా ఆసిఫ్ వాపోయారు. పాకిస్థాన్‌కు సవాల్‌గా మారిన ఉగ్రవాద మూకలు అఫ్గాన్ గడ్డపై నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని ఇస్లామాబాద్ ఆరోపిస్తోంది.
శుక్రవారం రాత్రి అఫ్గాన్ భూభాగంపై పాక్ వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో సుమారు 10 మంది మరణించినట్లు సమాచారం. మృతుల్లో ముగ్గురు యువ క్రికెటర్లు కూడా ఉన్నట్లు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డ్ (ఏసీబీ) వెల్లడించింది. ఈ ఊహించని దాడుల కారణంగా 48 గంటల పాటు కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం వీగిపోయింది. దాడులు, ప్రతి దాడుల నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఏ స్థాయికి చేరతాయోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా పాకిస్థాన్‌లో జరగాల్సిన ముక్కోణపు టీ20 సిరీస్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది.
అఫ్గానిస్థాన్‌కు భారత్ సహకరిస్తోందంటూ పాకిస్థాన్ పదేపదే చేస్తున్న నిరాధార ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. తన అంతర్గత వైఫల్యాలు, సమస్యలకు పొరుగు దేశాలను నిందించడం పాకిస్థాన్‌కు అలవాటుగా మారిందని భారత విదేశాంగ శాఖ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, తమ సమస్యలకు ఇతరులపై నిందలు వేయడం పాక్ విధానమని భారత్ స్పష్టం చేసింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరగడానికి కారణమైన పాక్ వైఖరిని అంతర్జాతీయ సమాజం గమనించాలని భారత్ పిలుపునిచ్చింది. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో సరిహద్దుల్లో హైఅలర్ట్ కొనసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa