ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆసీస్ ప్రధాని సమక్షంలోనే రడ్‌పై అసహనం వ్యక్తం చేసిన ట్రంప్

international |  Suryaa Desk  | Published : Tue, Oct 21, 2025, 11:34 AM

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ సమక్షంలోనే, అమెరికాలో ఆ దేశ రాయబారిగా ఉన్న కెవిన్ రడ్‌పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అసహనాన్ని తీవ్రస్థాయిలో వ్యక్తం చేశారు. "నేను నిన్ను ఇష్టపడను. బహుశా ఎప్పటికీ ఇష్టపడకపోవచ్చు" అని ఆయన ముఖం మీదే చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.సోమవారం వైట్‌హౌస్‌లో జలాంతర్గాముల ఒప్పందంపై చర్చించేందుకు ట్రంప్, ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ సమావేశమయ్యారు. ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో జరుగుతున్న సమయంలో, ఒక విలేకరి కెవిన్ రడ్‌ను ఉద్దేశించి ఒక ప్రశ్న అడిగారు. గతంలో రడ్ చేసిన విమర్శలపై మీరెలా భావిస్తున్నారని ట్రంప్‌ను ప్రశ్నించారు. దీనికి ట్రంప్ స్పందిస్తూ, "ఆయనెక్కడ ఇంకా మీ దగ్గరే పనిచేస్తున్నారా అని అల్బనీస్‌ను అడిగారు.ప్రధాని అల్బనీస్ ఇబ్బందిగా నవ్వుతూ ఎదురుగా కూర్చున్న రడ్‌ను చూపించారు. వెంటనే రడ్ వివరణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ, "అధ్యక్షా, నేను ఈ పదవి చేపట్టక ముందు చేసిన వ్యాఖ్యలవి" అని చెప్పబోయారు. అయితే, ఆయన మాటలకు అడ్డు తగిలిన ట్రంప్, "నువ్వంటే నాకు ఇష్టం లేదు" అని ఘాటుగా బదులిచ్చారు. ఈ అనూహ్య పరిణామంతో అక్కడున్న అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. కొందరు నవ్వడంతో, మరో విలేకరి వెంటనే వేరే ప్రశ్న అడిగి వాతావరణాన్ని తేలికపరిచే ప్రయత్నం చేశారు.కెవిన్ రడ్ గతంలో, ట్రంప్ అధికారంలో లేనప్పుడు, సోషల్ మీడియాలో ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. "చరిత్రలోనే అత్యంత విధ్వంసకర అధ్యక్షుడు" అని, "పశ్చిమ దేశాలకు ద్రోహి" అని రడ్ ఆరోపించారు. 2020 ఎన్నికల ఓటమి తర్వాత ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్‌పై దాడి చేసిన ఘటనను ప్రస్తావిస్తూ అమెరికా ప్రజాస్వామ్యాన్ని ట్రంప్ మంటగలుపుతున్నారని విమర్శించారు. అయితే, ట్రంప్ మళ్లీ అధ్యక్ష ఎన్నికల్లో గెలవగానే రడ్ ఆ పోస్టులను తొలగించారు.ఈ ఘటనపై ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ స్పందిస్తూ, ట్రంప్ వ్యాఖ్యలను తేలిగ్గా తీసుకునే ప్రయత్నం చేశారు. "అక్కడ నవ్వులు వినిపించాయి. ట్రంప్ సరదాగా ఆ మాటలు అన్నారు. మా సమావేశం విజయవంతంగా జరిగింది" అని ఆమె తెలిపారు. జో బైడెన్ హయాంలో చైనా వ్యవహారాల్లో నిపుణుడిగా పేరున్న రడ్‌ను వాషింగ్టన్‌లో రాయబారిగా నియమించారు. అయితే, తన ప్రచార సమయంలోనే రడ్ ఒక "చెడ్డ వ్యక్తి" అని, ఎక్కువ కాలం పదవిలో ఉండరని ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa