పంజాబ్ మాజీ మంత్రి రజియా సుల్తానా, ఆమె భర్త పంజాబ్ మాజీ డీజీపీ మహమ్మద్ ముస్తఫాలపై హత్య కేసు నమోదు కావడం తాజాగా ఆ రాష్ట్రంలో పెను సంచలనం రేపుతోంది. వారి కుమారుడు అఖిల్ అఖ్తర్ ఇటీవల అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించగా.. ఈ వ్యవహారంలో అతడి కుటుంబం కుట్రనే ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి తరుణంలో అఖిల్ అఖ్తర్ పాత వీడియో ఒకటి వైరల్ కావడంతో.. ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. తన భార్యకు, తన తండ్రికి మధ్య వివాహేతర సంబంధం ఉందనే ఆరోపణలు ఈ కేసు విచారణకు సరికొత్త మలుపు తిప్పాయి.
రజియా సుల్తానా, మహమ్మద్ ముస్తఫా దంపతుల కుమారుడు 33 ఏళ్ల అఖిల్ అఖ్తర్.. గురువారం పంచ్‌జ్‌కులలోని తన నివాసంలో అపస్మారక స్థితిలో కనిపించారు. దీంతో అతడి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందతూ మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. అయితే అఖిల్ అఖ్తర్ అధిక మోతాదులో డ్రగ్స్ తీసుకోవడంతోనే చనిపోయినట్లు అతని కుటుంబ సభ్యులు మొదట పేర్కొన్నారు. పోలీసులు కూడా ప్రాథమికంగా అతడు ఏదో ఒక మందు తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చి ఉండవచ్చని తెలిపారు.
ఈ క్రమంలోనే అఖిల్ రికార్డ్ చేసిన పాత వీడియోలు, అతని కుటుంబ స్నేహితుడు ఇచ్చిన ఫిర్యాదు.. ఈ కేసు విచారణను పూర్తిగా మార్చేశాయి. తన భార్యకు, తన తండ్రికి అక్రమ సంబంధం ఉందని తాను తెలుసుకున్నానని.. ఈ వ్యవహారంతో తాను తీవ్రమైన మానసిక వేదనలో ఉన్నానని పేర్కొంటున్నట్లు అఖిల్ అఖ్తర్ ఈ ఏడాది ఆగస్ట్ నెలలో రికార్డ్ చేసిన వీడియో తాజాగా వెలుగులోకి రావడం పెను సంచలనం రేపుతోంది. ఇక తనపై జరుగుతున్న కుట్రలో తన తల్లి రజియా, తన సోదరి కూడా భాగంగా ఉన్నారని ఆ వీడియోలో అఖిల్ అఖ్తర్ వెల్లడించారు. తనను తప్పుడు కేసులో ఇరికించాలని లేదా చంపాలని వారు ప్లాన్ చేస్తున్నారని అఖిల్ అప్పట్లోనే ఆరోపించారు.
అయితే తన భార్య తనను పెళ్లి చేసుకోలేదని.. ఆమె తన తండ్రిని పెళ్లి చేసుకుందని అఖిల్ అఖ్తర్ వెల్లడించారు. పెళ్లికి ముందే తన భార్య తన తండ్రికి తెలుసని అతడు అనుమానం వ్యక్తం చేశారు. తనను ఉద్దేశపూర్వకంగానే మతిభ్రమించిన వ్యక్తిగా.. భ్రమల్లో ఉన్నానని నమ్మించడానికి తన కుటుంబ సభ్యులు ప్రయత్నించారని.. అక్రమంగా తనను రిహాబిలిటేషన్ సెంటర్‌కు కూడా పంపించినట్లు తెలిపారు.
తనను ఎవరైనా కాపాడండి తనకు సహాయం చేయండి అంటూ విజ్ఞప్తి చేస్తూ.. తనకు పుట్టిన కూతురు నిజంగా తన బిడ్డేనా అని కూడా అనేది తనకు తెలియడం లేదని అఖిల్ అఖ్తర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే బయటికి వచ్చిన మరో వీడియోలో అఖిల్ అఖ్తర్ భిన్నమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తనపై వచ్చిన ఆరోపణలన్నీ మానసిక అనారోగ్యం వల్ల చేసినవని.. తన కుటుంబం చాలా మంచిది, గొప్పదని చెప్పడం గమనార్హం. అయితే.. వెంటనే అతని ముఖం కనిపించకుండా పోయి.. తిరిగి కనిపించినప్పుడు ఆకస్మికంగా వారు తనను చంపుతారా.. వారంతా దౌర్భాగ్యులు అని ఆరోపించారు.
ఈ వ్యవహారంపై పోలీస్ డిప్యూటీ కమిషనర్ సృష్టి గుప్తా స్పందించారు. ఈ కేసులో తమకు మొదట్లో ఎలాంటి అనుమానం రాలేదని తెలిపారు. అయితే.. అఖిల్ అఖ్తర్ కుటుంబానికి సన్నిహితుడైన శంసుద్దీన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు.. అదే సమయంలో అఖిల్ అఖ్తర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లు, వీడియోల ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి.. మహమ్మద్ ముస్తఫా, రజియా సుల్తానా, అఖిల్ భార్య, సోదరిపైనా ఉన్న ఆరోపణలను విచారణ జరపడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2017-2022 మధ్య పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో రజియా సుల్తానా క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa