ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా అధ్యక్ష భవనం వద్ద కలకలం.. వైట్‌హౌస్ గేటును ఢీకొట్టిన కారు, డ్రైవర్ అరెస్ట్

international |  Suryaa Desk  | Published : Wed, Oct 22, 2025, 08:45 PM

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష భవనమైన శ్వేత సౌధం వద్ద మరోసారి భద్రతా లోపం ఘటన జరిగింది. వైట్‌హౌస్ ప్రధాన ద్వారం సమీపంలో ఉన్న భద్రతా తనిఖీ కేంద్రం బారికేడ్లను ఒక కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమై కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం రోజు రాత్రి 10.30 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. అయితే బారికేడ్లను ఢీకొట్టిన కారు మేరీల్యాండ్ లైసెన్స్ ప్లేట్ కలిగిన 2010 అకురా టీఎస్‌ఎక్స్ (Acura TSX) మోడల్‌గా గుర్తించారు. కారును ఢీకొట్టడానికి ముందు ఆ కారును రహస్యంగా గమనించినట్లు అధికారులు తెలిపారు.


ట్రంప్ లోప ఉన్న సమయంలోనే ఘటన..


ఈ భద్రతా లోపం జరిగిన సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భవనం లోపలే ఉన్నట్లు సమాచారం. అయితే ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. సీక్రెట్ సర్వీస్ అధికారులు డ్రైవర్‌ను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే డ్రైవర్ వివరాలపై, అతని ఉద్దేశంపై అధికారులు ఇంకా ఎలాంటి స్పష్టతను ఇవ్వలేదు. అతను కావాలనే వైట్‌హౌస్‌ను లక్ష్యంగా చేసుకుని కారును ఢీ కొట్టారా లేక ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో వైట్‌హౌస్‌కు వెళ్లే రహదారి మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. కాగా ప్రస్తుతం వైట్‌హౌస్‌లోని ఈస్ట్ వింగ్‌లో మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి.


పదే పదే భద్రతా ఉల్లంఘనలు


గత కొన్నేళ్లుగా వైట్‌హౌస్ భద్రతా గేట్లను వాహనాలు ఢీకొన్న ఘటనలు తరచూ జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది జనవరి, మే నెలల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. అంతకుముందు 2023 మే నెలలో కూడా ఒక డ్రైవర్ తన ట్రక్కుతో వైట్‌హౌస్ కాంపౌండ్‌పైకి దూసుకెళ్లడానికి ప్రయత్నించాడు. ఈ వరుస ఘటనలన్నీ చూస్తుంటే.. వైట్‌హౌస్ వద్ద భద్రతా లోపాల తీవ్రత అర్థం అవుతోంది. ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన ప్రాంతంగా భావించే వైట్‌హౌస్ వద్ద పదేపదే ఇలాంటి సంఘటనలు జరగడం అమెరికన్ భద్రతా వ్యవస్థ సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa