ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలకృష్ణ తాగి వచ్చి అసెంబ్లీలో మాట్లాడారు.. వైఎస్ జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 23, 2025, 07:05 PM

ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సినిమా రంగంపై జరిగిన చర్చ సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఎపిసోడ్‌పై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్రంగా స్పందించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సినీ ప్రముఖులను అవమానించారంటూ అసెంబ్లీలో మొదలైన చర్చలో.. మెగాస్టార్ చిరంజీవిపై, వైఎస్ జగన్‌‌పై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే.


అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన కామెంట్లు, దీనిపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించకపోవడంతో మీడియా సమావేశంలో వైఎస్ జగన్‌ను ప్రశ్నించగా.. దానికి ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి.. బాలకృష్ణ మాట్లాడింది ఏంటి అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పనిపాట లేని సంభాషణ చేశారని మండిపడ్డారు.


అసెంబ్లీలోకి బాలకృష్ణ తాగి వచ్చి మాట్లాడారని.. తాగి వచ్చిన వ్యక్తిని అసెంబ్లీలోకి ఎలా అనుమతించారని వైఎస్ జగన్ నిలదీశారు. బాలకృష్ణ అలా మాట్లాడేందుకు అనుమతించినందుకు స్పీకర్‌కు బుద్ధి లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ మానసిక స్థితి ఏంటో అక్కడే అర్థమవుతోందని.. అలా మాట్లాడినందుకు సైకలాజికల్‌ ఆరోగ్యం ఎలా ఉందో ఆయనే ప్రశ్నించుకోవాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.


కొన్ని రోజుల క్రితం ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మొదలుపెట్టిన అంశంపై నందమూరి బాలకృష్ణ తీవ్రంగా స్పందించారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ వ్యవహారంలో తన ప్రస్తావన తీసుకురావడంపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి.. అప్పుడే ఒక ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సినిమా వాళ్లకు ఎలాంటి అవమానం జరగలేదని.. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తమను సాదరంగా ఆహ్వనించారని స్పష్టం చేశారు.


లాటరీలో రూ.12.50 కోట్లు గెలిచిన వృద్ధుడు.. డబ్బంతా నగ్న వీడియో కాల్స్‌కే ఖర్చు, విడాకుల కేసు పెట్టిన భార్య


మరోవైపు.. కూటమి ప్రభుత్వ పాలనపైనా జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పెర్ఫార్మెన్స్ మాత్రం వీక్.. వేరే వాళ్లకు దొరకాల్సిన క్రెడిట్ చోరీలో మాత్రం పీక్ అని విమర్శించారు. తమ హయాంలో ఇంటర్నేషనల్ హబ్‌గా విశాఖను తీర్చిదిద్దడంలో భాగంగా అదానీ డేటా సెంటర్‌కు బీజం పడిందని జగన్ తెలిపారు. వైసీపీ, అదానీ, కేంద్రం, సింగపూర్ చేసిన కృషి వల్లే ఇవాళ గూగుల్ విశాఖ వచ్చిందని వెల్లడించారు.. 2022 అక్టోబర్ నుంచి అదానీకి.. గూగుల్‌కు బిజినెస్ రిలేషన్ ఉందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే 2023 మే నెలలో ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.


మరోవైపు.. ఉద్యోగుల విషయంలోనూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు అయిందని.. 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నా ఇప్పటివరకు ఒక్కటీ ఇవ్వలేదని.. ఉద్యోగులు రోడ్డెక్కితే ఒక్కటి ఇస్తా అన్నారని మండిపడ్డారు. డీఏ అరియర్స్ రిటైర్ అయ్యాక ఇస్తామన్నారని.. చరిత్రలో ఎప్పుడు ఇలా జరగలేదని తెలిపారు.


ఇక ఏపీలో నకిలీ మద్యాన్ని వ్యవస్థీకృత పద్ధతిలో అమ్ముతున్నారని వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఏకంగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలే నడుపుతున్నారని మండిపడ్డారు.. గ్రామాల్లో వేలం వేసి బెల్ట్ షాపులు నడుపుతున్నారని.. అక్రమంగా పర్మిట్ రూమ్‌ల ద్వారా విచ్చలవిడిగా కల్తీ మద్యం విక్రయిస్తున్నారని ఆరోపించారు. పెద్దఎత్తున మద్యం, స్పిరిట్ డంప్‌లు దొరికాయని.. సీపీ పర్యవేక్షణలో పోలీసులు పనిచేస్తున్నారని విమర్శించారు. వాటాల్లో తేడా రావడంతో ఈ నకిలీ మద్యం కేసు బయటికి వచ్చిందన్నారు. ప్రతీ 4, 5 బాటిళ్లకు ఒక కల్తీ మద్యం బాటిల్ అమ్ముతున్నారని పేర్కొన్నారు.


నకిలీ మద్యం కేసులో ఉన్నది తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి జయచంద్రారెడ్డి.. మరోవ్యక్తి అతడి పక్కనే ఉన్న జనార్ధనరావు అని.. ఇంకో వ్యక్తి కట్టా సురేంద్ర నాయుడు అని వైఎస్ జగన్ ఆరోపించారు. జనార్ధనరావు తో వీడియో చేయించి ప్రచారం చేస్తున్నారని.. జోగి రమేష్ చాట్ లీక్స్ అంటూ మరికొన్ని వదిలారని మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa