అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడి జీవిత భాగస్వామి, అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్‌పై కోర్టులో దావా నమోదు అయింది. రచయిత, సీనియర్ జర్నలిస్ట్ మైఖేల్ వోల్ఫ్.. ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్‌పై న్యూయార్క్ రాష్ట్ర కోర్టులో దావా వేశారు. తనపై పరువు నష్టం ఆరోపణలు చేస్తూ మెలానియా దాఖలు చేసిన 1 బిలియన్ డాలర్ల లీగల్ నోటీసును సవాలు చేస్తూ.. వోల్ఫ్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
అసలీ గొడవకు కారణం ఏంటంటే?
వోల్ఫ్ ఓ పాడ్‍కాస్ట్ ఎపిసోడ్‌లో మెలానియాపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా "ట్రంప్స్ ఎప్‌స్టీన్ స్కాండల్ కాంట్ స్టాప్ వోంట్ స్టాప్" (ట్రంప్ ఎప్‌స్టీన్ కుంభకోణం ఆగదు, ఆగబోదు) అనే శీర్షికతో ఓ ఎపిసోడ్‌ను ప్రసారం చేశారు. అందులో మెలానియా ట్రంప్‌కు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో సంబంధాలు ఉన్నాయంటూ చర్చించారు. ముఖ్యంగా ఎప్‌స్టీన్ ప్రైవేట్ జెట్‌లో.. ఆమె డొనాల్డ్ ట్రంప్‌తో మొదటి సారిగా లైంగిక సంబంధం పెట్టుకున్నారనే వివాదాస్పద విషయాన్ని కూడా ఆ ఎపిసోడ్‌లో ప్రస్తావించారు. ఈ పాడ్‌కాస్ట్ ప్రసారం అయిన వెంటనే.. మెలానియా తరఫు న్యాయవాది అలెజాండ్రో బ్రైటో రంగంలోకి దిగారు.
ఆ వ్యాఖ్యలు అసత్యమైనవి, పరువు నష్టం కలిగించేవి, అసభ్యకరమైనవి అని పేర్కొంటూ.. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వోల్ఫ్‌కు లీగల్ నోటీస్ పంపారు. అంతేకాకుండా 1 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.8,300 కోట్లు) నష్టపరిహారం కోరుతూ కోర్టులో దావా వేస్తామని హెచ్చరించారు. దీనికి స్పందనగా.. ది డైలీ బీస్ట్ తమ ఎపిసోడ్‌ను ఉపసంహరించుకుంది. అలాగే ఆ కంటెంట్ తమ ప్రమాణాలకు అనుగుణంగా లేదని అంగీకరిస్తూ బహిరంగంగా క్షమాపణ కూడా చెప్పింది.
అయితే లీగల్ నోటీసుకు భయపడి వెనక్కి తగ్గడానికి బదులుగా.. మైఖేల్ వోల్ఫ్ న్యూయార్క్ రాష్ట్ర కోర్టులో మెలానియాపై దావా వేశారు. బలమైన వ్యక్తులు చట్టపరమైన బెదిరింపులను ఉపయోగించి పత్రికా స్వేచ్ఛను, పరిశోధనాత్మక జర్నలిజాన్ని అణచివేయకుండా నిరోధించేందుకు రూపొందించబడిన న్యూయార్క్ రాష్ట్ర 'యాంటీ-SLAPP' (Strategic Lawsuit Against Public Participation) చట్టాలను ఆయన ఆశ్రయించారు. "శ్రీమతి ట్రంప్ తనపై వేసిని దావాను న్యాయవాదులు SLAPP దావా అంటారు. దీని ఉద్దేశం కేవలం నన్ను బెదిరించడం, నోరు మెదపకుండా చేయడమే" అని వోల్ఫ్ వెల్లడించారు.
మెలానియా ట్రంప్ లీగల్ బెదిరింపులు కేవలం ఒక ప్రకటనను అణచివేయడానికి మాత్రమే కాదని.. భవిష్యత్తులో ఎప్‌స్టీన్‌తో ట్రంప్ కుటుంబ సభ్యులకు ఉన్న సంబంధాలను బయట పెట్టకుండా ఉండేందుకు తీసుకున్న చర్య అని దావాలో ఆరోపించారు. ఈ దావాపై వైట్‌హౌస్ ఇంకా స్పందించలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa