ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిహార్‌లో దుమారం రేపిన ఎస్ఐఆర్,,,త్వరలో తమిళనాడులో చేపట్టనున్న ఈసీ

national |  Suryaa Desk  | Published : Fri, Oct 24, 2025, 08:15 PM

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిహార్‌లో ఇటీవల ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహించారు. నకిలీ ఓట్లను తొలగించేందుకు భారత ఎన్నికల సంఘం దీన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం అనేక వివాదాలకు దారి తీసింది. ఓటర్లను తొలగించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రతిపక్షాలు ఓటు చోరీ అని విమర్శలు గుప్పించాయి. ఎస్‌ఐఆర్‌ పేరుతో బిహార్‌లో పెద్ద ఎత్తున ఎన్నికల రిగ్గింగ్‌ జరుగుతోందని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. ఈసీ ఉద్దేశపూర్వకంగా ఓటర్లను తొలగిస్తోందని.. ఈ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. చివరికి ఈ విషయం సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. అయితే ఇలాంటి ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)ను తమిళనాడులోనూ నిర్వహించనుంది ఎన్నికల సంఘం. వారం రోజుల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు.. కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం మద్రాస్‌ హైకోర్టుకు వెల్లడించింది.


చెన్నైలోని టి నగర్‌లో ఉన్న 229 పోలింగ్ బూత్‌లలో పూర్తిగా రీ-వెరిఫిషన్ చేయాలని ఏఐడీఎంకే మాజీ ఎమ్మెల్యే బి సత్యనారాయణన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మణింద్ర మోహన్ శ్రీవాస్తవ, జస్టిస్ జీ అరుల్ మురుగన్ ధర్మాసనం విచారించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం న్యాయవాది నిరంజన్ రాజగోపాల్.. వారం రోజుల్లో తమిళనాడులో ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు కోర్టుకు నివేదించారు. ఎమ్మెల్యే బి సత్యనారాయణన్ ఆందోళనలకు ఎస్ఐఆర్ ప్రక్రియ పరిష్కారం చూపిస్తుందని తెలిపారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో టి నగర్ నుండి పోటీ చేసిన సత్యనారాయణన్.. ఓటర్ల జాబితాను నిర్వహించడంలో వైఫల్యాలు ఉన్నాయని ఆరోపించారు. నిజమైన ఓటర్లను పెద్దఎత్తున తొలగించడం వల్లే 2021 ఎన్నికల్లో 137 ఓట్ల తేడాతో తాను ఓడిపోయానని పేర్కొన్నారు.


ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను దేశవ్యాప్తంగా నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ గతంలో చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్న బిహార్‌లో ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తయింది. దాదాపు 22 ఏళ్ల విరామం తర్వాత అక్కడ ఈ ఓటరు జాబితా సవరణ చేపట్టారు. కాగా తమిళనాడుతో పాటు.. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్‌ శాసనసభలకు 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ రాష్ట్రాల్లోనూ ఈసీ ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టే అవకాశం ఉంది.


ఇక్కడెంత రచ్చ జరుగుతుందో..!


ఇప్పటికే తమిళనాడు నాయకులు ఎస్ఐఆర్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని.. ఓటర్ జాబితాలో మార్పులు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు డీఎంకే మంత్రి దురై మురుగన్ గతంలో ఎస్ఐఆర్ ప్రతిపాదనను వ్యతిరేకించారు. తమిళనాడు.. బీహార్ కాదని, తమిళనాడులో ప్రజలకు అవగాహన ఉంటుందని.. ఇతర ప్రాంతాల్లో లాగా తమను మోసం చేయలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో తమకు దళపతి నాయకత్వం ఉందని.. వారి (బీజేపీని ఉద్దేశించి) ఉపాయాలు తమిళనాడులో చెల్లవని చెప్పారు. దీంతో ఎస్ఐఆర్‌పై తమిళనాడులో ఇంకెంత రచ్చ జరుగుతుందో అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa