2020లో సరిహద్దు గొడవలతో భారత్, చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా రెండు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొంటున్నాయి. ఇటీవలె చైనా విదేశాంగ మంత్రి భారత్‌లో పర్యటించగా.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఎస్‌సీఓ సదస్సులో భాగంగా చైనాలో పర్యటించారు. ఇక సరిహద్దుల్లో మోహరించిన సైన్యాన్ని కూడా రెండు దేశాలు.. వెనక్కి రప్పించాయి. రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు కూడా ప్రారంభం కావడంతో ప్రస్తుతం భారత్, చైనా సంబంధాలు గాడిలో పడుతున్నాయి. ఇలాంటి తరుణంలో చైనా మరోసారి సరిహద్దుల్లో బరితెగిస్తోంది. భారత సరిహద్దుల్లో ఎయిర్ డిఫెన్స్ సైట్‌ను నిర్మిస్తోంది. తాజాగా విడుదలైన ఉపగ్రహ చిత్రాల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
తూర్పు లడఖ్ సరిహద్దు ప్రాంతంలో చైనా మరో కీలకమైన సైనిక నిర్మాణాన్ని పూర్తిచేస్తోంది. 2020 ఘర్షణలు జరిగిన ప్రాంతానికి సుమారు 110 కిలోమీటర్ల దూరంలో.. టిబెట్‌లోని ప్యాంగాంగ్ సరస్సు తూర్పు ఒడ్డున ఒక కొత్త ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్ రూపుదిద్దుకుంటున్నట్లు శాటిలైట్ చిత్రాలు వెల్లడించాయి. ఈ నిర్మాణంలో కమాండ్ అండ్ కంట్రోల్ భవనాలు, బ్యారక్‌లు, ఆయుధాగారాలు, వాహన షెడ్‌లతో పాటు అధునాతన రాడార్ స్థానాలు ఉన్నాయి.
ఈ కొత్త కాంప్లెక్స్‌లో కవర్డ్ మిస్సైల్ లాంచ్ స్థానాలు ఉండటం మరింత ఆసక్తికరంగా మారింది. ఇతర దేశాల నిఘా ఉండకుండా పైకప్పులు ఏర్పాటు చేసి.. అవసరం వచ్చినపుడు వాటిని ఓపెన్ చేసేలా నిర్మిస్తున్నారు. హెచ్‌క్యూ-9 సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ వ్యవస్థలను మోసుకెళ్లగల ట్రాన్స్‌పోర్టర్ ఎరెక్టర్ లాంఛర్ వాహనాలకు రక్షణ, శత్రువుల కన్నుగప్పేందుకు కవర్డ్ మిస్సైల్స్ లాంచ్ కవర్లు ఉపయోగపడతాయని ఇంటెలిజెన్స్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కవర్లు మూసి ఉన్నప్పుడు లాంచర్లు పూర్తిగా రక్షణలో, రహస్యంగా ఉంటాయని.. అవసరం అయినప్పుడు పైకప్పులు తెరుచుకుని మిస్సైల్‌ను ప్రయోగించవచ్చని పేర్కొంటున్నారు.
ఈ రకమైన కాన్ఫిగరేషన్ ట్రాన్స్‌పోర్టర్ ఎరెక్టర్ లాంఛన్ ఉనికిని, దాని స్థానాలను కచ్చితంగా గుర్తించడానికి ఇతర దేశాలకు కష్టం అవుతుంది. అదే సమయంలో వాటిని దాడుల నుంచి కాపాడుతుందని అమెరికాకు చెందిన జియో ఇంటెలిజెన్స్ సంస్థ ఆల్‌సోర్స్ అనాలిసిస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇక ఇలాంటి కాంప్లెక్స్‌లను ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో చైనా నిర్మిస్తున్నట్లు తెలిసింది. వాస్తవ నియంత్రణ రేఖ నుంచి సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న గార్ కౌంటీ వద్ద.. సరిగ్గా భారతదేశం ఇటీవల అప్‌గ్రేడ్ చేసిన న్యొమా ఎయిర్‌ఫీల్డ్‌కు ఎదురుగా.. ఇదే తరహా కాంప్లెక్స్‌ను ఆల్‌సోర్స్ అనాలిసిస్ సైంటిస్ట్‌లు గుర్తించారు.
ఈ గార్ కౌంటీ వద్ద ఉన్న లాంచ్ స్థానాల పైకప్పులు సెప్టెంబర్ 29వ తేదీ నాటి ఉపగ్రహ చిత్రాలలో తెరిచి ఉన్నట్లు కనిపించగా.. లోపల లాంచర్లు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక హెచ్‌క్యూ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లోని వివిధ అంశాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించడానికి ఉద్దేశించిన వైర్డ్ డేటా కనెక్షన్ మౌలిక సదుపాయాలు కూడా ఈ కాంప్లెక్స్ ప్రాంతంలో ఉన్నట్లు విశ్లేషకులు గుర్తించారు. భారత్-టిబెట్ సరిహద్దుల్లో ఇలాంటి రక్షిత లాంచ్ స్థానాలు కొత్తగా కనిపిస్తున్నప్పటికీ.. చైనా వీటిని గతంలో దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద దీవుల్లో నిర్మించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa