ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రష్యా 'బురవెస్త్నిక్' అణుశక్తి క్షిపణి పరీక్ష విజయవంతం

international |  Suryaa Desk  | Published : Sun, Oct 26, 2025, 08:37 PM

ఉక్రెయిన్ యుద్ధం విషయంలో పశ్చిమ దేశాల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. అణుశక్తితో పనిచేసే 'బురవెస్త్నిక్' క్రూయిజ్ క్షిపణిని రష్యా విజయవంతంగా పరీక్షించినట్లు ఆదివారం వెల్లడించారు. ప్రపంచంలోని ఏ రక్షణ వ్యవస్థనైనా ఛేదించగల ఈ అస్త్రం త్వరలో సైనిక మోహరింపునకు సిద్ధమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ క్షిపణి పరీక్ష, గత వారం నిర్వహించిన అణు విన్యాసాలు.. అమెరికా సహా పాశ్చాత్య దేశాలకు రష్యా పంపుతున్న బలమైన సంకేతంగా అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.రాయిటర్స్ కథనం ప్రకారం, అక్టోబర్ 21న ఈ క్షిపణిని పరీక్షించారు. సైనిక దుస్తుల్లో ఉన్న పుతిన్ఉక్రెయిన్ యుద్ధాన్ని పర్యవేక్షిస్తున్న జనరల్స్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రష్యా సైనిక దళాల చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ వాలెరీ గెరాసిమోవ్ మాట్లాడుతూ ఈ క్షిపణి పరీక్ష సమయంలో అణుశక్తితో ఏకధాటిగా 15 గంటల పాటు గాల్లో ప్రయాణించిందని, మొత్తం 14,000 కిలోమీటర్ల దూరాన్ని చేరుకుందని పుతిన్‌కు వివరించారు. ఈ క్షిపణికి దాదాపు అపరిమితమైన పరిధి ఉందని, దాని ప్రయాణ మార్గాన్ని అంచనా వేయడం అసాధ్యమని ఆయన తెలిపారు.నాటో దేశాలు 'SSC-X-9 స్కైఫాల్' అని పిలుస్తున్న ఈ బురవెస్త్నిక్ క్షిపణి గురించి పుతిన్ మాట్లాడుతూ, "ఇది ప్రపంచంలో మరెవరి దగ్గరా లేని ఒక ప్రత్యేకమైన ఆయుధం. ఒకప్పుడు ఇలాంటి క్షిపణి తయారీ అసాధ్యమని మా నిపుణులే చెప్పారు. కానీ ఇప్పుడు కీలకమైన పరీక్షలు పూర్తయ్యాయి" అని అన్నారు. ఈ ఆయుధాన్ని మోహరించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలని ఆయన జనరల్ గెరాసిమోవ్‌ను ఆదేశించారు.2001లో యాంటీ-బాలిస్టిక్ మిస్సైల్ ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగడం, నాటో కూటమిని విస్తరించడం వంటి చర్యలకు ప్రతిస్పందనగా 2018లోనే పుతిన్ ఈ క్షిపణి గురించి తొలిసారి ప్రకటించారు. ఉక్రెయిన్‌కు అమెరికా అత్యాధునిక ఆయుధాలు, నిఘా సమాచారం అందిస్తున్న నేపథ్యంలో, రష్యాపై దాడి చేస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించేందుకే ఈ పరీక్షను సరైన సమయంలో నిర్వహించినట్లు స్పష్టమవుతోంది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa