ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్ పాలనపై పట్టుకోసం,,,అసిమ్ మునీర్ ప్రయత్నాలు

international |  Suryaa Desk  | Published : Mon, Oct 27, 2025, 08:51 PM

పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చేసి, ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ జనరల్ అసిమ్ మునీర్ పగ్గాలు చేపడతారనే ప్రచారం కొద్ది నెలల కిందట జోరుగా సాగింది. అయితే, అలా చేస్తే ప్రజాస్వామ్య పునరుద్దరణ జరగాలని అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొనక తప్పదని అసిమ్ మునీర్‌కు తెలుసు. నవాజ్ షరీఫ్‌ను దింపేసి పాక అధ్యక్షుడిగా ప్రకటించకున్న జనరల్ పర్వేజ్ ముషారఫ్‌ ఏ మేరకు ఒత్తిడిని ఎదుర్కొన్నారో మునీర్‌కు అనుభవమే. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకున్న పాక్ సైన్యాధిపతి.. తన చెప్పుచేతుల్లో ఉండే ప్రధాని, అధ్యక్షుడిని కూర్చోబెట్టి అజమాయిషీ చెలాయిస్తున్నారు.


పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ క్రమంగా తన కుటుంబసభ్యులు, సైనికాధికారులను దేశ పరిపాలనా విభాగంలోకి తీసుకొస్తున్నాడు. దీంతో దేశాన్ని, ప్రజలను, సైన్యాలను నియంత్రించవచ్చు. తన ప్లాన్‌లో భాగంగా మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను ముందు పదవి నుంచి తప్పించి, జైల్లో పెట్టించాడు. తాను ఎదుర్కొన్న అతిపెద్ద ముప్పు ఇమ్రాన్‌ నుంచి ఎదురయ్యింది. అందుకే ఆయనను తప్పించి తనదారికి అడ్డుతొలగించుకున్నాడు. తర్వాత ఆసిఫ్ అలీ జర్దారీని అధ్యక్షుడిగా, షెహబాజ్ షరీఫ్‌ను ప్రధానమంత్రిగా నియమించాడు. ఇద్దరూ ప్రస్తుతం అసిమ్ మునీర్ చేతుల్లో కీలుబొమ్మలే.


రెండోది ఐఎస్ఐ చీఫ్ జనరల్ అసిమ్ మాలిక్‌ను జాతీయ భద్రతా సలహదారు స్థానంలో కూర్చోబెట్టారు. తాజాగా, తన మేనల్లుడు కెప్టెన్ సయ్యద్ అబు రెహ్మాన్ బిన్ ఖాసీమ్‌ను సాయుధ దళాల నుంచి పరిపాలన విభాగానికి బదిలీ చేయించాడు. మేనల్లుడితో పాటు మరో 9 మంది పాక్ ఆర్మీ అధికారులను ఇలాగే పాలనా విభాగానికి పంపాడు. పాకిస్థాన్‌లోని ప్రతి విభాగంలోనూ తన మనుషులే ఉండాలని మునీర్ కోరుకుంటున్నాడని, తద్వారా వాటన్నింటిని నియంత్రించే అవకాశం ఉంటుందనడానికి ఇది స్పష్టమైన సంకేతమని అధికారులు అంటున్నారు.


ఓ అధికారి మాట్లాడుతూ... ఇది మునీర్‌కు వ్యవస్థను నియంత్రించడానికి మరింత శక్తిని ఇస్తుందని, సాంకేతికంగా పాక్‌లో ప్రజాస్వామ్యం ఉందని ప్రపంచానికి చూపిస్తుందని అన్నారు. తన మేనల్లుడిని ప్రధానమంత్రి కార్యాలయం అధికారిగా బదిలీ చేయడం వల్ల షెహబాజ్ షరీఫ్‌ను నిశితంగా పరిశీలించే అవకాశం మునీర్‌ లభిస్తుంది. అలాగే, అంతర్గత వ్యవహారాల శాఖ, హైకమిషన్లు, ఎంబసీల్లో తన అనుచరులను నియమించే ప్లాన్‌లో ఉన్నారు. దీనివల్ల దేశ పాలనా వ్యవస్థపై మునీర్‌ నేరుగా పెత్తనం చెలాయించే అవకాశం కల్పిస్తుంది.


నిఘా వర్గాల సమాచారం ప్రకారం మునీర్ మేనల్లుడు త్వరలోనే అమెరికా లేదా ఇండియాలోని రాయబార కార్యాలయం ప్రధాన అధికారిగా నియమించే చేసే అవకాశం ఉంది. దీని ద్వారా విదేశాల్లో తమ నిఘా కార్యకలాపాలపై పూర్తిస్థాయి నియంత్రణ లభిస్తుంది. అయితే, మునీర్‌కు నిఘా వ్యవస్థపై నియంత్రణ సాధించడమే ప్రధాన లక్ష్యం కాదని, ఎందుకంటే ప్రస్తుత ఐఎస్ఐ చీఫ్ కూడా తోలుబొమ్మే అని విశ్లేషకులు అంటున్నారు.


ఈ నియామకాలు, బదిలీలు అన్నీ మునీర్‌ తన అధికార ప్రతిష్ఠను ప్రభుత్వ నిర్ణయాల నుంచి విదేశీ దౌత్య వ్యూహాలదాకా ప్రతీ రంగంలో పెంచుకునే ప్రయత్నాలే. ఇలా ఆయన సైన్యం, గూఢచారి సంస్థలు, విదేశాంగ శాఖ, పౌర పాలన వంటి ప్రతి విభాగాలపైనా తన ఆధిపత్యాన్ని క్రమంగా మరింత బలోపేతం చేసుకుంటున్నారని అధికారులు అంటున్నారు. ప్రధాని లేదా అధ్యక్ష పదవిలో కొనసాగడం కేవలం రబ్బరు స్టాంపులే. పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం ఇంకా ఉందని చూసించడానికి మాత్రమే అని అధికారులు పేర్కొంటున్నారు.


అయితే, ఈ చర్యలన్నీ తన పదవిపై మునీర్‌కు అభద్రతా భావం వల్లే జరుగుతున్నాయని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో తనకు ఎదురైన పరాభవం బయటపడకుండా షరీఫ్ చేతులు మీదుగా ఫీల్డ్ మార్షల్ హోదాను అందుకోవడం ఇది ఆయన అభద్రతభావానికి నిదర్శమని చెప్పారు.. తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ), బలూచిస్థాన్ నేషలిస్ట్ ఆర్మీ (బీఎల్ఏ), అఫ్గన్‌ తాలిబన్లు నుంచి మునీర్‌ పదేపదే ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తన పరిపాలన పట్ల సైనికులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నందున, సైనిక తిరుగుబాటు విజయవంతం కాదని మునీర్ భయపడుతున్నాడు. చాలా మంది సైనికులు ఇప్పటికే ఆయన ఆదేశాలను ధిక్కరిస్తున్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని గిరిజన ప్రాంతాలలో టీటీపీకీ వ్యతిరేకంగా పోరాడటానికి వారు నిరాకరిస్తున్నారు. సై


నిక జనరల్ ప్రధాన కార్యాలయం, ప్రభుత్వం మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆర్మీ చీఫ్‌గా తన పదవీకాల పొడిగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అసిమ్ మునీర్ 2027 వరకు ఆర్మీ చీఫ్‌గా కొనసాగుతారని ప్రభుత్వం అంటోంది. ఆయన మాత్రం 2030 వరకు తనను కొనసాగించాలని పట్టుబడుతున్నారు. దీనిపై పలువురు ఆర్మీ అధికారులు ముఖ్యంగా తదుపరి చీఫ్ పదవి కోసం ఎదురుచూస్తోన్నవారు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు.


సీనియారిటీ సమస్యలు తలెత్తకుండా మునీర్ ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది సైనిక ఉన్నతాధికారులను మార్చాడు. ఈ పరిణామాలన్నీ మునీర్‌ను అభద్రతా భావానికి గురి చేశాయి. కాబట్టి నిఘా, సైన్యం, ఇప్పుడు పరిపాలనపై నియంత్రణ తీసుకుంటున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa