సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్ సూర్యకాంత్ నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ భూషణ్ ఆర్. గవాయ్ సిఫార్సు మేరకు ఈ నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. 2025 నవంబర్ 24వ తేదీ నుంచి జస్టిస్ సూర్యకాంత్ నియామకం అమల్లోకి వస్తుందని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది.ప్రస్తుత సీజేఐ జస్టిస్ గవాయ్ 2025 నవంబర్ 23న 65 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేయనున్నారు. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిని తదుపరి సీజేఐగా నియమించే సంప్రదాయం ప్రకారం, జస్టిస్ గవాయ్ తన తర్వాత జస్టిస్ సూర్యకాంత్ పేరును సిఫార్సు చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 (2) ప్రకారం రాష్ట్రపతి ఈ నియామకాన్ని ఆమోదించినట్టు కేంద్ర న్యాయ శాఖ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.జస్టిస్ సూర్యకాంత్ భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడతారు. ఆయన దాదాపు 14 నెలల పాటు ఈ పదవిలో కొనసాగి, 2027 ఫిబ్రవరి 9న పదవీ విరమణ చేస్తారు.జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. హిసార్‌లోని ప్రభుత్వ పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి, రోహ్‌తక్‌లోని మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయం నుంచి 1984లో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అదే ఏడాది హిసార్‌లో న్యాయవాద వృత్తిని ప్రారంభించి, మరుసటి ఏడాది చండీగఢ్‌కు మారి పంజాబ్, హర్యానా హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. ఆయన అతి పిన్న వయసులోనే 2000 జులై 7న హర్యానా అడ్వకేట్ జనరల్‌గా నియమితులయ్యారు.2004 జనవరి 9న పంజాబ్, హర్యానా హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆ తర్వాత 2018 అక్టోబర్ 5న హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అక్కడి నుంచి 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జాతీయ న్యాయ సేవల అథారిటీ లో సభ్యుడిగా సేవలందించిన ఆయన, ప్రస్తుతం సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa