భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ప్రారంభమైంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ లౌరా వోల్వార్ట్.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ వర్షం కారణంగా సుమారు రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం చూపే అవకాశం ఉందని.. అందుకే తాము తొలుత బౌలింగ్ చేయాలని అనుకుంటున్నామని దక్షిణాఫ్రికా కెప్టెన్ టాస్ సందర్భంగా చెప్పింది.
అటు టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సైతం.. తాము టాస్ గెలిచినా బౌలింగ్ ఎంచుకునే వాళ్లమని పేర్కొంది. కానీ తొలుత బ్యాటింగ్ చేసి.. భారీ టార్గెట్ ఫిక్స్ చేస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక రెండు జట్లూ కూడా తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండానే బరిలోకి దిగాయి. సెమీ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా జట్టు ఇంగ్లాండ్‌పై గెలవగా.. భారత జట్టు ఆస్ట్రేలియాను ఓడించింది.
కాగా భారత మహిళలకిది మూడో వన్డే ప్రపంచకప్ ఫైనల్. 2005లో తొలిసారి తుదిపోరుకు అర్హత సాధించిన భారత్.. ఆస్ట్రేలియా చేతిలో 98 పరుగుల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్‌లో మొదట ఆసీస్ 4 వికెట్లకు 215 పరుగులు చేయగా.. మిథాలి రాజ్ నేతృత్వంలోని భారత జట్టు 117 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక 2017లో ఆస్ట్రేలియాను సెమీస్‌లో ఓడించి ఫైనల్ చేరింది టీమిండియా. కానీ ఫైనల్‌లో మాత్రంఇంగ్లాండ్ చేతిలో ఓటమి పాలైంది. మిథాలి రాజ్ సారథ్యంలోని భారత జట్టు.. 229 పరుగుల ఛేదనలో భారత జట్టు 219 పరుగులకు ఆలౌటై 10 పరుగుల తేడాతో కప్‌ను చేజార్చుకుంది. ఈసారి ఎలాగైనా టైటిల్ సాధించాలనే పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగింది.
ఫైనల్ మ్యాచ్‌కు తుది జట్లు ఇవే..
భారత్: షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమన్‌జ్యోత్ కౌర్, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుక సింగ్ ఠాకూర్.
దక్షిణాఫ్రికా: లౌరా వోల్వార్ట్ (కెప్టెన్), తంజిమ్ బ్రిట్స్, అనెకె బోష్, సున్ లూస్, మారిజాన్నే కాప్, సినాలో జఫ్టా (వికెట్ కీపర్), అన్నేరీ డెర్క్‌సెన్, చ్లో ట్రయాన్, నడైన్ డే క్లర్క్, అయబోంగా ఖాక, ఎలబా
గూగుల్ ట్రెండ్స్‌లో india women vs south africa women :
భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతోన్న మహిళల వరల్డ్ కప్ ఫైనల్ పట్ల అభిమానాల్లో తీవ్రమైన ఆసక్తి నెలకొంది. లీగ్ దశలో భారత అమ్మాయిలు తడబడినప్పటికీ.. కీలకమైన సెమీఫైనల్లో బలమైన ఆస్ట్రేలియాపై రికార్డు లక్ష్యాన్ని చేధించడంతో.. ఫైనల్ పట్ల అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఫైనల్‌కు ముందు వర్షం కురవడంతో.. ఉత్కంఠ పెరిగింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన అప్డేట్స్ కోసం నెటిజన్లు గూగుల్‌లో వెతికారు. దీంతో 5 మిలియన్లకుపైగా సెర్చ్ వాల్యూమ్‌తో india women vs south africa women కీవర్డ్ గూగుల్ ట్రెండ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa