తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అడుగులు వేస్తున్న సినీ నటుడు, తమిళగ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్.. కరూర్ తొక్కిసలాట ఘటనపై స్పందిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభలు, సమావేశాలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో మరోసారి తొక్కిసలాట జరగకుండా ఉండేందుకు ఓ మంచి పని చేయబోతున్నారు. ముఖ్యంగా రద్దీ నిర్వహణ, ప్రజా భద్రతను పటిష్టం చేయడానికి ఒక ప్రత్యేక వాలంటీర్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందానికి 'తొండర్ అని' (Thondar Ani) అని పేరు పెట్టారు.
సెప్టెంబర్ 27వ తేదీన కరూర్‌లో టీవీకే నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీ రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ కార్యక్రమానికి అనూహ్యంగా భారీ సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో.. నియంత్రణ లేకపోవడం వల్ల తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 41 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోగా.. సుమారు 60 మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా ప్రజల భద్రత, రాజకీయ సభల నిర్వహణపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తింది.
అయితే 2026 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని కొత్త పార్టీని స్థాపించిన విజయ్.. రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం మొదలు పెట్టారు. ఆయన కార్యక్రమాలకు వస్తున్న రికార్డు స్థాయి జనసమూహం, పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణను స్పష్టం చేస్తున్నప్పటికీ.. కరూర్ ఘటన తీవ్ర హెచ్చరికగా మారింది. ఇకపై ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు, ప్రజా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని విజయ్ నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగానే 'తొండర్ అని' వాలంటీర్ల బృందాన్ని ఏర్పాటు చేశారు.
అసలేమిటీ 'తొండర్ అని'?
ఈ తొండర్ అని వాలంటీర్ల బృందంలో ఉన్న సభ్యులకు ముందుగా శిక్షణను ఇస్తారు. వీరు కేవలం క్రౌడ్ కంట్రోల్‌కే కాకుండా.. అత్యవసర పరిస్థితుల్లో పోలీసు, వైద్య బృందాలతో సమర్థవంతంగా సమన్వయం చేసుకునేలా శిక్షణ పొందుతారు. ఈ నిర్ణయం ద్వారా పార్టీ కార్యక్రమాల్లో క్రమశిక్షణ, భద్రత, బాధ్యతాయుతమైన నిర్వహణను నిర్ధారించడానికి టీవీకే ఒక ముందడుగు వేసినట్లయింది. పార్టీ నాయకత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం, ఎన్నికలకు ముందు తమ సంస్థాగత నిర్మాణాన్ని ప్రొఫెషనల్‌గా తీర్చిదిద్దే విజయ్ లక్ష్యాన్ని ప్రతిబింబిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa