ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిహార్‌ ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్.. రాహుల్ గాంధీపై విమర్శలు

national |  Suryaa Desk  | Published : Sun, Nov 09, 2025, 07:30 PM

ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బిహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం చేశారు. ఈ మేరకు కూటమి అభ్యర్థులకు మద్ధతుగా పాట్నాలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి ప్రస్తావించారు. బీహార్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే.. మరోసారి ఎన్డీఏను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు కీలకమన్న లోకేష్.. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు.


బీహార్‌లో మోదీ, నీతీశ్ నాయకత్వంలా.. ఏపీలో నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయకత్వం ఉందని నారా లోకేష్ అన్నారు. విజన్, సమర్థతతో వారిద్దరూ పరిపాలన చేస్తున్నారని చెప్పారు. ప్రతి కుటుంబంలో ఓ వ్యాపారవేత్త నినాదంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. కానీ బిహార్‌లో ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని.. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నారన్నారు. రాజకీయ పార్టీలను జాగ్రత్తగా చూసి ఎన్నికోవాలని బిహార్ ప్రజలకు పిలుపునిచ్చారు.


రాహుల్‌ గాంధీకి క్లారిటీ ఉందా..


ఈ సందర్భంగా నారా లోకేష్.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. ఓవైపు ఆయన ఓట్ చోరీ అని ఆరోపణలు చేస్తునే.. మరోవైపు, ఓటర్ లిస్టులో అవకతవకలను సరి చేయడానికి చేపట్టిన ఎస్ఐఆర్‌ను వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఆయన ఒకే వాదనకు కట్టుబడి ఉండాలని.. ఒకేసారి రెండు వాదనలు చేయడం సాధ్యం కాదని హితవు పలికారు. ప్రతి రాజకీయ పార్టీ ఓటర్ లిస్ట్‌ను జాగ్రత్తగా గమనిస్తుందని.. కానీ దాని ప్రాముఖ్యత రాహుల్ గాంధీకి ఇప్పుడు తెలిసిరావడం ఆశ్చర్యంగా ఉందని ఎద్దేవా చేశారు.


ఈ క్రమంలో స్వచ్ఛమైన, అవినీతిరహిత పాలన కోసం బీహార్‌లో ఎన్డీఏను గెలిపించాలని మంత్రి నారా లోకేష్ బిహార్ ప్రజలను కోరారు. అంతేకాకుండా ఎన్డీఏ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వాలకు చేకూరుతున్న లాభాన్ని వివరించారు. ఏన్డీఏను గెలిపిస్తే.. కేంద్ర బడ్జెట్‌లో భారీగా నిధులు పొందవచ్చని చెప్పారు. మౌలిక సదుపాయాలు, విద్యాసంస్థలకు కేంద్రం సహకరిస్తోందని చెప్పారు. వివిధ పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా కేంద్రం మద్దతు ఇస్తుందని తెలిపారు. శాంతిభద్రతలు అదుపులో ఉంటే.. పెద్దఎత్తున అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఏపీలో మార్పునకు ఓటేశారని.. అందుకే ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం 94 శాతం స్టైక్ రేట్‌తో గెలిచిందని చెప్పారు. డబుల్ ఇంజిన సర్కార్ వల్ల వేగంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa