ప్రస్తుతం టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది. రోజువారీ ఉరుకుల పరుగుల జీవితంలో.. ఏదైనా సరే ఎంత వీలైతే అంత తొందరగా కావాలని జనం కోరుకుంటున్నారు. కాలంతో పోటీ పడి అన్ని పనులు పూర్తి చేస్తున్నారు. ఇక ప్రయాణాలు.. వేగంగా పూర్తయ్యేందుకు రైళ్లు, విమానాలను ఆశ్రయిస్తున్నారు. పరుగులు పెడుతున్న పోటీ ప్రపంచంలో నిలబడాలంటే.. మనం కూడా ఆ మాత్రం పరుగులు తీయాల్సిన అవసరం ఉంది. కానీ అన్నిసార్లు వేగం మాత్రమే పనిచేయదు. కొన్నిసార్లు నెమ్మదిగా జరిగే పనులు కూడా ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత నెమ్మదైన, సుందరమైన రైలు ప్రయాణాల గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఈ రైలు ప్రయాణాలు కొన్నిసార్లు కొన్ని కిలోమీటర్లు ప్రయాణించడానికి కూడా గంటల సమయం తీసుకున్నా.. అవి అందించే ప్రకృతి అందాలు మాత్రం అమూల్యమైనవి, వెలకట్టలేనివిగా జీవితాంతం గుర్తుండిపోతాయి.
ప్రపంచంలోనే అత్యంత నెమ్మదిగా నడిచే 10 రైళ్ల జాబితాను తీసుకుంటే అందులో భారత్ నుంచే అధికంగా ఉన్నాయి. తొలి 5 రైళ్లలో భారత్‌లో తిరిగే 4 రైళ్లు ఉండటం విశేషం. మన దేశంలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రైళ్ల చొప్పున ఉన్నాయి.
గ్లేసియర్ ఎక్స్‌ప్రెస్, స్విట్జర్లాండ్
ప్రపంచంలోనే అత్యంత నెమ్మదిగా నడిచే రైళ్ల జాబితాలో అగ్రస్థానంలో ఈ గ్లేసియర్ ఎక్స్‌ప్రెస్ రైలు నిలిచింది. ఇది స్విట్జర్లాండ్ దేశంలో ప్రయాణిస్తుంది. ఈ గ్లేసియర్ ఎక్స్‌ప్రెస్ రైలు.. స్విస్ ఆల్ప్స్ గుండా 91 సొరంగాలు, 291 వంతెనలను దాటుతూ ప్రయాణిస్తుంది. ఈ గ్లేసియర్ ఎక్స్‌ప్రెస్ సగటు వేగం గంటకు 37 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రైలు 291 కిలోమీటర్ల దూరాన్ని 8 గంటల్లో కవర్ చేస్తుంది. ఈ ప్రయాణంలో ప్రయాణికులు స్విస్ ఆల్ప్స్‌లోని అద్భుతమైన దృశ్యాలను చూసేందుకు తగినంత సమయం లభిస్తుంది.
నీలగిరి మౌంటెన్ రైల్వే, భారత్
మన దేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఈ నీలగిరి మౌంటెన్ రైల్వే పరుగులు తీస్తుంది. నీలగిరి ప్రాంతంలో నిటారు పర్వతాలపై ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది. దట్టమైన అడవులు, టీ తోటలను వీక్షిస్తూ.. సాగే ఈ సుందరమైన రైలు ప్రయాణం ప్రయాణికులను కట్టిపడేస్తుంది. ఇక ఈ నీలగిరి మౌంటెన్ రైలు నిటారుగా ఉన్న ప్రాంతాల్లో గంటకు కేవలం 9 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించడం గమనార్హం.
డార్జిలింగ్ రైల్వే, భారత్
మన దేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తూర్పు హిమాలయాల గుండా వంపులు తిరిగే ట్రాక్‌లు, మంచుతో కప్పబడిన శిఖరాల నుంచి ఈ డార్జిలింగ్ రైల్వే ప్రయాణాలు సాగిస్తూ ఉంటుంది. ఈ మార్గంలో రైల్వే ట్రాక్ నిటారుగా ఉన్న కారణంగా రైళ్లు నెమ్మదిగా ప్రయాణం చేస్తాయి.
మెట్టుపాళయం-ఊటీ ప్యాసింజర్ , భారత్
తమిళనాడు రాష్ట్రంలో దక్షిణ భారతదేశంలోని సుందరమైన కొండ ప్రాంతాల గుండా మెల్లగా ఈ మెట్టుపాళయం-ఊటీ ప్యాసింజర్ రైలు ప్రయాణం చేస్తుంది. ఈ మెట్టుపాళయం-ఊటీ ప్యాసింజర్ రైలు.. కొండ ప్రాంతాల్లో గంటకు 9 కిలోమీటర్ల సగటు వేగంతో ప్రయాణం చేస్తుంది.
హౌరా-అమృత్‌సర్ ఎక్స్‌ప్రెస్ , భారత్
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రయాణం చేసే ఈ హౌరా-అమృత్‌సర్ ఎక్స్‌ప్రెస్ రైలు.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య నెమ్మదిగా ప్రయాణిస్తుంది. ఈ రైలు ప్రయాణంలో భాగంగా మార్గమధ్యలో విభిన్న భూభాగాలను ప్రయాణికులు చూసే అవకాశం ఉంటుంది. ఈ మార్గంలో కొన్ని ప్రాంతాల్లో.. ఈ హౌరా-అమృత్‌సర్ ఎక్స్‌ప్రెస్ రైలు.. గంటకు 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
టీ అనౌ టు మనపౌరి , న్యూజిలాండ్
న్యూజిలాండ్‌లోని సౌత్ ఐలాండ్‌లోని అద్భుతమైన అరణ్య ప్రాంతాల గుండా పర్యాటకులకు అనుగుణంగా ఈ టీ అనౌ టు మనపౌరి ప్రయాణిస్తుంది. పర్యాటక అవసరాల కోసం ఈ టీ అనౌ టు మనపౌరి రైలు నెమ్మదిగా పరుగులు తీస్తుంది.
వెస్ట్ హైలాండ్ లైన్ , స్కాట్లాండ్
స్కాట్లాండ్ దేశంలో గ్లాస్గో నుంచి మల్లైగ్ వరకు హైలాండ్ ప్రాంతాలు, సరస్సులు, కోటల గుండా ఈ వెస్ట్ హైలాండ్ లైన్ ప్రయాణిస్తుంది. ఈ సుందరమైన మార్గంలో రైలు నెమ్మదిగా సాగుతూ ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది.
ఇంకా రైల్ , పెరూ
పెరూ దేశంలోని ఆండీస్ పర్వత శ్రేణులు, అమెజాన్ వర్షారణ్యం వైపు నిటారుగా ఉండే మార్గంలో ఈ ఇంకా రైల్ ప్రయాణిస్తుంది. నిటారు మార్గం కారణంగా రైలు నెమ్మదిగా పరుగులు తీస్తుంది.
కురుండా సీనిక్ రైల్వే, ఆస్ట్రేలియా
క్వీన్స్‌లాండ్‌లోని ఉష్ణమండల వర్షారణ్యాలు, వాటర్‌ఫాల్స్ గుండా పర్యాటకుల సౌలభ్యం కోసం ఈ కురుండా సీనిక్ రైల్వే నెమ్మదిగా ప్రయాణిస్తుంది.
స్నోడన్ మౌంటెన్ రైల్వే , వేల్స్
వేల్స్ దేశంలోని ఎత్తైన శిఖరం స్నోడన్‌పైకి ప్రయాణించే ఒక రైల్వే. పర్వతారోహణ కోసం ఈ ఎత్తైన మార్గంలో రైలు నెమ్మదిగా ప్రయాణిస్తూ ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa