ఆంధ్రప్రదేశ్‌లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను ఎట్టకేలకు పట్టుకున్నారు రైల్వే పోలీసులు. దేశవ్యాప్తంగా దొంగతనాలు.. ముఖ్యంగా దక్షిణాదిలో ఎక్కువ చోరీలకు పాల్పడ్డ సంజయ్ రాయ్‌ను (34) అరెస్ట్ చేశారు. అస్సాం కేంద్రంగా దొంగతనాలకు పాల్పడుతున్న సంజయ్ రాయ్.. విజయవాడకు తరచూ వచ్చి దొంగతనాలకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు. అనంతరం వ్యాపారవేత్తలా విమానాల్లో అస్సాంకు వెళ్లేవాడని తెలిపారు. అయితే ఇటీవల జరిగిన ఓ దొంగతనంపై ఫిర్యాదు అందగా.. లోతుగా కూపీ లాగిన పోలీసులు ఎట్టకేలకు సంజయ్ రాయ్‌ను పట్టుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాంలోని నాగావ్ జిల్లా చంగ్మాజీ రోడ్‌కు చెందిన సంజయ్ రాయ్(34) బాల్యంలో కూలీ పనులు చేసుకునేవాడు. అనంతరం చిన్ననాటి స్నేహితులతో కలిసి రైల్వే స్టేషన్లలో చోరీలు చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో గౌహతి రైల్వే స్టేషన్లో ఇనుప ముక్కలు దొంగతనం చేసి సెంట్రల్ జైలుకు వెళ్లాడు. బెయిలుపై వచ్చిన తర్వాత బెంగళూరుకు వెళ్లి కూలీ పనులు చేసుకుందామనుకున్నాడు. ఈ మేరకు రైలులో ప్రయాణిస్తుండగా.. ఓ మహిళ మెడలో బంగారం చూసి.. మళ్లీ చోరీ చేయాలనిపించింది. దీంతో ఆమె మెడలో బంగారు చైన్, నెక్లెస్ దొంగిలించాడు. దాన్ని అమ్మి సొమ్ము చేసుకున్నాడు.
జైలుకెళ్లినా మారని తీరు..
అలా అడ్డదారిలో డబ్బుల కోసం మళ్లీ దొంగతనాలు ప్రారంభించాడు. దేశవ్యాప్తంగా సంజయ్ రాయ్ 40 దొంగతనాలు చేశాడు. అందులో తమిళనాడులో 16, ఆంధ్రప్రదేశ్‌లో 12, తెలంగాణలో 9, కర్ణాటకలో 3 చోరీలు చేశాడు. సంజయ్ సహా ఇలా చోరీలకు పాల్పడే వారు ముఠాగా ఏర్పడ్డారు. అందులో దీప్ జ్యోతి, సతెందర్ కుమార్, సతీష్ గుజార్, రవి కుమార్, లోకేందర్ పర్మర్, వికాస్ కుమార్, పల్సర్ లక్కీ, అమృత్ ఐన్, నయన్ జ్యోతి, అబ్దుల్ హసీబ్ ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో చోరీలు..
అస్సాం నుంచి విమానంలో విజయవాడకు వచ్చేవాడు సంజయ్ రాయ్. అనంతరం రైలులో ప్రయాణిస్తున్న మహిళలను టార్గెట్‌గా చేసుకునేవాడు. స్టేషన్ల వద్ద రైలు నెమ్మదిగా వెళ్తున్న సమయంలో మహిళల మెడల్లో చైన్లు లాగేసి.. వారు రియాక్ట్ అయ్యేలోపే దూకి పారిపోయేవాడు. అనంతరం మళ్లీ విమానంలో అస్సాం వెళ్లిపోయేవాడు.
ఇలా పట్టుకున్నారు..
ఇటీవల విజయవాడ నుంచి తెనాలి వెళుతున్న రైలులో ఓ మహిళ మెడలో చైన్ కొట్టేశాడు సంజయ్ రాయ్. దీనిపై మహిళ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన గుంటూరు-విజయవాడ రైల్వే పోలీసులు.. సీసీ ఫుటేజీలు పరిశీలించారు. వాటిని మహిళకు చూపించడంతో ఆమె దొంగను గుర్తుపట్టారు. ఆ వీడియోను పోలీసులు అన్ని రాష్ట్రాల్లోని క్రైమ్ గ్రూపుల్లో పోస్టు చేయడంతో.. మహారాష్ట్రకు చెందిన ఒక పోలీసు దొంగను గుర్తించారు. ఆయన ఇచ్చిన సమాచారంతో దొంగను సంజయ్ రాయ్‌గా పోలీసులు నిర్ధరించుకున్నారు. గతంలో అస్సాంలో అరెస్టైనప్పటి వివరాలతోపాటు ఆధార్ కార్డు వివరాలు సేకరించి నిఘా పెట్టారు. ఎప్పటిలాగానే సంజయ్ విమాన టికెట్ బుక్ చేసుకోగానే రైల్వే పోలీసులకు సమాచారం వచ్చింది. గన్నవరం విమానాశ్రయంలో దిగి విజయవాడ రైల్వే స్టేషన్‌కు వచ్చి మరో చోరీకి ప్రయత్నిస్తున్నట్లు తెలియడంతో.. ఏలూరు-రాజమండ్రి మధ్యలో రైల్వే పోలీసులు సంజయ్ రాయ్‌ను పట్టుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa