సొంత ఇల్లు, భూమి కొనుగోలు చేయడం ప్రతి ఒక్కరి ఆర్థిక లక్ష్యం. అయితే, ఇష్టపడి కొనుగోలు చేసిన భూమి లేదా ప్లాటు ఆదాయపు పన్ను శాఖ నజర్‌లోకి వెళ్లవచ్చు. దీంతో ట్యాక్స్ నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది. అలా వచ్చే నోటీసు కారణంగా మీ డ్రీమ్ ప్లాట్ పీడకలగా మారే ప్రమాదం ఉంది. పన్ను చెల్లింపుదారు అనుకోకుండా చేసే కొన్ని పొరపాట్లు వల్ల ఈ సమస్య తలెత్తుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూమి విలువ లిమిట్ దాటి ఉన్నప్పుడు నోటీసులు వస్తాయి. మరి ట్యాక్స్ లిమిట్ ఎంత? ఐటీ శాఖ నజర్లో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనే వివరాలు తెలుసుకుందాం.
భూమి కొనుగోలుపై ఐటీ నోటీసు రావడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నుల్లో ప్రకటించిన ఆదాయానికి, భూమి కొనుగోలు విలువకు మధ్య వ్యత్యాసం ఉండటం అనేది ప్రధాన కారణంగా చెప్పవచ్చు. రిజిస్ట్రార్ కార్యాలయం రూ. 30 లక్షల కంటే ఎక్కువ విలువైన భూమి కొనుగోలు వివరాలను ఆదాయపు పన్ను శాఖకు నివేదించడం తప్పనిసరి. ఈ సమాచారం, మీ ఐటీ రిటర్నులతో సరిపోలకపోతేనే ఐటీ శాఖ ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని వివరణ కోరుతూ నోటీసు పంపుతుంది.
మీరు భూమి కొనుగోలు చేసేందుకు వినియోగించిన డబ్బు పూర్తిగా చట్టబద్ధంగా సంపాదించినదే అయినా ఐటీ శాఖకు ఆటోమేటిక్‌గా పూర్తి వివరాలు అందవు. దీంతో సమస్య ఏర్పడుతుంది. అందులో ఐటీఆర్ దాఖలు చేయకముందు కూడబెట్టిన డబ్బు, తల్లిదండ్రులు లేదా బంధువుల నుంచి అందుకున్న ఆర్థిక సాయం, ఇతర ఆస్తి అమ్మకం లేదా వారసత్వం ద్వారా వచ్చిన నిధులు, స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల నుంచి తీసుకున్న వ్యక్తిగత రుణాలు ఇందులోకి వస్తాయి. వాటికి సంబంధించిన వివరాలు డాక్యుమెంట్లను భద్రంగా పెట్టుకోవాలి. లేదంటే ఐటీ శాఖ చట్టపరమైన చర్యలు తీసుకునే ప్రమాదం ఉంటుంది.
పన్ను చిక్కులు లేకుండా తప్పించుకునేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. కొనుగోలుకు సంబంధించిన ప్రతీ పెద్ద లావాదేవీని బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ల ద్వారా మాత్రమే నిర్వహించాలి. నగదు చెల్లింపులను పూర్తిగా నివారించాలి. మీరు ఖర్చు పెట్టిన డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందో స్పష్టంగా వివరించే బ్యాంక్ స్టేట్‌మెంట్లు, లోన్ డాక్యుమెంట్లు దగ్గర పెట్టుకోవాలి. బహుమతులు లేదా రుణాలు అందుకున్నట్లయితే గిఫ్ట్ డీడ్ లేదా రుణ ఒప్పందాలను లిఖితపూర్వకంగా రూపొందించి వాటిని నోటరీ చేయించాలి. పాత ఆస్తులు లేదా బంగారం అమ్మగా వచ్చిన డబ్బును కూడా స్పష్టమైన రుజువులతో భద్రపరచాలి.
భూమి కొనుగోలుకు ముందు మీరు గిఫ్టులు లేదా ఇతర ఆదాయాలు పొందినట్లయితే, చట్టబద్ధమైన రికార్డు కోసం అప్‌డేటెడ్ ఐటీఆర్‌ను దాఖలు చేసి ఆ నిధుల మూలాన్ని ప్రకటించాలి. మీ ఆదాయ నిర్మాణం సంక్లిష్టంగా ఉన్నా లేదా పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నా కొనుగోలుకు ముందే చార్టర్డ్ అకౌంటెంట్ ను సంప్రదించి మీ ఆదాయం, ఖర్చులకు పొంతన ఉండేలా చూసుకోవాలి. పన్ను నోటీసు వచ్చినప్పుడు వెంటనే స్పందించాలి. అవసరమైన అన్ని పత్రాలను సమర్పించాలి. దీంతో సమస్య త్వరగా పరిష్కరించుకోవచ్చు. సరైన డాక్యుమెంటేషన్‌ను నిర్వహించడం కేవలం నోటీసులను నివారించడానికి మాత్రమే కాదు. దీర్ఘకాలికంగా ఆర్థిక ప్రశాంతతకు దోహదపడుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa