భారత్ గర్భనిరోధక మాత్రల వినియోగంలో అమెరికా, చైనా దేశాల తర్వాత మూడో స్థానంలో నిలిచింది. ప్రత్యేకించి ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ (ECP) అమ్మకాలు ఆకాశాన్నంటుతున్నాయి. మోర్డర్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీ నివేదిక ప్రకారం, దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 3.5 కోట్ల ఎమర్జెన్సీ మాత్రలు అమ్ముడవుతున్నాయి. గత పదేళ్లలో ఈ విక్రయాలు 12 శాతం మేర పెరిగాయని నివేదిక వెల్లడించింది. ఈ మాత్రలు సులభంగా ఓవర్ ది కౌంటర్‌లో లభించడం, యువతలో జాగ్రత్తలు తక్కువ కావడం వంటి కారణాలు ఈ పెరుగుదలకు ముఖ్య కారణాలుగా కనిపిస్తున్నాయి.
ఎమర్జెన్సీ మాత్రలు అత్యవసర సందర్భాల్లో మాత్రమే వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. కానీ చాలా మంది మహిళలు ఇవి రెగ్యులర్ గర్భనిరోధకంగా ఉపయోగిస్తున్నారు. గైనకాలజిస్టులు హెచ్చరిస్తున్నట్లు, ఈ మాత్రలను అధికంగా వాడితే హార్మోన్ల అసమతుల్యత, అండాశయ సమస్యలు (పీసీఓఎస్), బరువు పెరుగుదల, మూడ్ స్వింగ్స్ వంటి దుష్ప్రభావాలు తలెత్తుతాయి. అంతేకాదు, ఇవి లైంగిక వ్యాధుల నుంచి రక్షణ కల్పించవు. దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఇవి ప్రమాదకరమని వైద్య నిపుణులు ఒక్కస్వరంగా చెబుతున్నారు. రెగ్యులర్ గర్భనిరోధక మాత్రలు లేదా ఇతర పద్ధతులు సురక్షితమని సలహా ఇస్తున్నారు.
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఎమర్జెన్సీ మాత్రల అమ్మకాలు పెరుగుతున్న నేపథ్యంలో కండోమ్‌ల వాడకం గణనీయంగా తగ్గిపోతోంది. పలు నివేదికల ప్రకారం, గత ఐదేళ్లలో భారత్‌లో కండోమ్ అమ్మకాలు 17 శాతం మేర తగ్గాయి. కండోమ్‌లు గర్భధారణను మాత్రమే కాకుండా హెచ్‌ఐవీ, ఇతర లైంగిక వ్యాధుల నుంచి కూడా రక్షణ కల్పిస్తాయి. కానీ యువతలో వీటి వైపు ఆకర్షణ తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ఇది సురక్షిత లైంగిక జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ధోరణులు దేశంలో కుటుంబ నియమిత సాధనాలపై కొత్త చర్చను రేకెత్తిస్తున్నాయి. ఓవర్ ది కౌంటర్ అందుబాటు సౌలభ్యం ఉన్నా, సరైన అవగాహన లేకపోవడం ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. ప్రభుత్వం, వైద్య సంఘాలు యువతకు సురక్షిత గర్భనిరోధక పద్ధతులపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఈ ఆర్భాటం భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సంక్షోభానికి దారి తీస్తుంది. సమాచారం, జాగ్రత్తలతోనే సురక్షిత భవిష్యత్తు సాధ్యమని గుర్తుంచుకోవాలి!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa