ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంజాబ్, హర్యానాలకు ఉమ్మడి రాజధాని.. అసలు చండీగఢ్ ఎలా ఏర్పాటైంది?

national |  Suryaa Desk  | Published : Sun, Nov 23, 2025, 08:12 PM

భారతదేశ పటంలో చండీగఢ్‌కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. చండీగఢ్ అంటే కేవలం ఒక నగరం మాత్రమే కాదు.. రెండు రాష్ట్రాల రాజకీయ, పరిపాలనా కేంద్రంగా కూడా కొనసాగుతోంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతున్న చండీగఢ్.. ఇప్పుడు దేశం మొత్తం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారత్ నుంచి పాక్ విడిపోయిన సమయంలో.. పంజాబ్ రాష్ట్రానికి రాజధానిగా మారిన చండీగఢ్ .. ఆ తర్వాత భాషాపరంగా పంజాబ్ నుంచి హర్యానా విడిపోవడంతో ఉమ్మడి రాజధానిగా ఏర్పడింది. అప్పటి నుంచి రెండు రాష్ట్రాలకు చండీగఢ్ రాజధానిగా ఉంటోంది. అయితే ఈ చండీగఢ్‌కు పంజాబ్ గవర్నర్ అడ్మినిస్ట్రేటర్‌గా కొనసాగుతున్నారు.


లాహోర్ కోల్పోవడంతో ఆవిర్భావించిన కొత్త నగరం


1947 ఆగస్ట్ 14వ తేదీన దేశ విభజన జరిగినప్పుడు.. పంజాబ్ రాష్ట్రం రెండు ముక్కలైంది. పశ్చిమ పంజాబ్ పాకిస్తాన్‌కు.. తూర్పు పంజాబ్ భారతదేశానికి వచ్చింది. ఆ సమయంలో పంజాబ్ రాజధానిగా ఉన్న చారిత్రక నగరమైన లాహోర్ పాకిస్తాన్‌కు వెళ్లింది. దీంతో భారతకు వచ్చిన పంజాబ్‌ రాష్ట్రానికి.. ఒక కొత్త, ఆధునిక రాజధాని అవసరం అయింది. అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ లీ కార్బుసియర్ నేతృత్వంలో ప్రణాళికాబద్ధంగా చండీగఢ్ నగరాన్ని నిర్మించారు.


1966లో రాష్ట్రాల పునర్విభజన


1950, 1960వ దశకాల్లో పంజాబ్‌లో పంజాబీ సుబా ఉద్యమం ఊపందుకుంది. సిక్కులు ఎక్కువగా ఉండే పంజాబీ మాట్లాడే ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీనికి ప్రతిగా.. హిందీ మాట్లాడే ప్రాంతాల ప్రజలు తమకు వేరే రాష్ట్రం కావాలని కోరారు. ఫలితంగా 1966 పంజాబ్ పునర్విభజన చట్టం ద్వారా పంజాబ్ రాష్ట్రాన్ని విభజించారు. పంజాబీ మాట్లాడే ప్రాంతాలతో పంజాబ్.. హిందీ మాట్లాడే ప్రాంతాలతో హర్యానా.. కొండ ప్రాంతాలను హిమాచల్ ప్రదేశ్‌లో విలీనం చేశారు.


చండీగఢ్ కోసం పట్టు


రాష్ట్రాలు విడిపోయినప్పుడు చండీగఢ్ రూపంలో అసలు సమస్య ముందుకు వచ్చింది. తమ కోసం, తమ రాజధానిగా చండీగఢ్‌ను నిర్మించారు కాబట్టి అది తమకే దక్కాలని పంజాబ్ పట్టుబట్టింది. హిందీ మాట్లాడే ప్రాంతాలైన అంబాలా డివిజన్‌కు దగ్గరగా చండీగఢ్ ఉందని.. పైగా కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి అభివృద్ధి చెందిన ఆ నగరం అవసరమని హర్యానా వాదించింది. అప్పటి షా కమిషన్ చండీగఢ్ చుట్టుపక్కల హిందీ మాట్లాడే వారు ఎక్కువగా ఉన్నారని పేర్కొంటూ.. దీన్ని హర్యానాకు ఇవ్వాలని సిఫార్సు చేసింది. కానీ దీనిపై పంజాబ్‌లో తీవ్ర ఆందోళనలు చెలరేగాయి.


కేంద్రం మధ్యేమార్గం


పంజాబ్, హర్యానా రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఒక మధ్యేమార్గాన్ని ఎంచుకుంది. చండీగఢ్ నగరాన్ని ఏ ఒక్క రాష్ట్రానికీ ఇవ్వకుండా.. దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. దీంతో చండీగఢ్ నేరుగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. అదే సమయంలో పంజాబ్, హర్యానా రాష్ట్రాలు రెండూ తమ సచివాలయాలు, అసెంబ్లీలను చండీగఢ్ నుంచే నడుపుతాయి. ఆస్తి పంపకాలలో నిష్పత్తిని పంజాబ్‌కు 60 శాతం.. హర్యానాకు 40 శాతంగా నిర్ణయించారు.


రాజీవ్ - లోంగోవాల్ ఒప్పందం (1985)


1985లో అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ, అకాలీ దళ్ నాయకుడు హర్‌చంద్ సింగ్ లోంగోవాల్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం 1986 జనవరి 26వ తేదీన చండీగఢ్‌ను పూర్తిగా పంజాబ్‌కు అప్పగించాలి. దానికి బదులుగా పంజాబ్‌లోని కొన్ని హిందీ మాట్లాడే గ్రామాలు హర్యానాకు ఇవ్వాలి. అయితే ఏ గ్రామాలు బదిలీ చేయాలనే విషయంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆ ఒప్పందం ఇప్పటికీ అమలు కాలేదు.


అలా ఒక తాత్కాలిక పరిష్కారంగా మొదలైన ఉమ్మడి రాజధాని చండీగఢ్ ఏర్పాటు.. దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్‌గా పంజాబ్ గవర్నరే వ్యవహరిస్తూ ఉన్నారు. నగరం మాత్రం కేంద్రం గుప్పిట్లో రెండు రాష్ట్రాల పరిపాలనలో ఉంటూ భారతదేశ సమాఖ్య వ్యవస్థలో ఒక విలక్షణమైన ఉదాహరణగా నిలిచింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa