ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చలికాలంలో రాత్రి మాటి మాటికీ యూరిన్‌కి వెళ్తున్నారా

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Nov 25, 2025, 10:56 PM

చలికాలం చాలా మందికి ఇష్టం. ఈ సీజన్ ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే, శీతాకాలం కొన్ని ఆరోగ్య సమస్యల్ని తీసుకువస్తుంది. ఈ సీజన్‌లో చలిగాలుల కారణంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అయితే, ఇంకో సమస్య ఉంది. అది చాలా మందిని వేధిస్తుంది. రాత్రి పూట సరిగ్గా నిద్ర కూడా పోనివ్వదు.


ఆ సమస్య ఏంటో కాదు తరచుగా మూత్ర విసర్జన. రాత్రి సమయంలో పెరిగిన చలికి చాలా మంది అదే పనిగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. రాత్రి సమయాల్లో మూడు నుంచి నాలుగు సార్ల మేల్కోవడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. దీంతో అలసట, చిరాకు, మరుసటి రోజు ఏకాగ్రత లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి.


శీతాకాలంలో తరచుగా మూత్ర విసర్జన చేయడం కేవలం చలి వల్ల మాత్రమే కాదు, శరీరంలో సంభవించే ఇతర మార్పుల వల్ల కూడా జరుగుతుంది. అయితే, ఈ సమస్య నుంచి పరిష్కారం పొందడానికి ఏం చేయాలో డాక్టర్ మధుసూధన్ పటోడియా చెప్పారు. ఆయన చెప్పిన చిట్కాలు ఫాలో అయితే చలికాలంలో మీ నిద్రకు భంగం కలగదు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు చుద్దాం.


 చలికాలంలో ఎక్కువగా మూత్ర విసర్జన ఎందుకు?


​చలికాలంలో శరీరం తనను తాను వెచ్చగా ఉంచుకోవడానికి ఒక ప్రత్యేక పద్ధతిలో పనిచేస్తుంది. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు, శరీరం అంతర్గత ఉష్ణోగ్రతను నిర్వహించడానికి చర్మం యొక్క బయటి ఉపరితలంపై రక్త ప్రసరణను కొద్దిగా తగ్గిస్తుంది. ఇది మూత్రపిండాలకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. మూత్రపిండాలకు ఎక్కువ రక్తం ప్రవహించినప్పుడు, ఎక్కువ మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి.


ఫలితంగా, మనం తరచుగా మూత్ర విసర్జన చేస్తాము. అదనంగా, శీతాకాలంలో మనకు తక్కువ చెమట పడుతుంది. వేసవిలో శరీరం చెమట ద్వారా చాలా నీటిని విసర్జిస్తుంది. కానీ శీతాకాలంలో చెమట చాలా తక్కువగా పడుతుంది. అందువల్ల, శరీరం మూత్రం ద్వారా అదనపు నీటిని విసర్జిస్తుంది. అందుకే రాత్రి సమయంలో మూత్ర విసర్జన చేయాలనే ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని చిట్కాల ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని డాక్టర్ అంటున్నారు.


గోరు వెచ్చని నీరు తాగండి


శీతాకాలంలో చాలా మంది చల్లని నీటిని తాగుతారు. అయితే, చల్లటి నీరు తాగకూడదని ఇది శరీర ఉష్ణోగ్రతను మరింత తగ్గిస్తుందని డాక్టర్ చెప్పారు. ఎల్లప్పుడూ గోరువెచ్చని నీరు తాగాలని డాక్టర్ సూచిస్తున్నారు. అంతేకాకుండా నిద్రవేళకు రెండు గంటల ముందు నీటి మొత్తాన్ని తీసుకోవడం తగ్గించండి. ఇది రాత్రిపూట ఉత్పత్తి అయ్యే మూత్రం మొత్తాన్ని తగ్గిస్తుంది.


శరీరాన్ని వెచ్చగా ఉంచుకోండి


చాలా మంది శీతాకాలంలో వెచ్చగా ఉంచుకోవడానికి టీ, కాఫీ వంటివి తాగుతుంటారు. అయితే, ఎక్కువ టీ లేదా కాఫీ తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. వీటి బదులు సాయంత్రం అల్లం హెర్బల్ టీ, గోరువెచ్చని నీరు లేదా సూప్ తాగండి. ఇది మీ శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో సాయపడుతుంది. గోరువెచ్చని పసుపు పాలు తాగినా మంచి ఫలితం ఉంటుందని డాక్టర్ చెబుతున్నారు.


ఈ విషయాలు కూడా ముఖ్యం


పడుకునే ముందు సున్నితమైన పాదాల మసాజ్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరాన్ని వేడి చేస్తుంది. తరచుగా వచ్చే మూత్రవిసర్జనను తగ్గిస్తుంది. అంతేకాకుండా చెవులు, చేతులు, కాళ్లను కప్పి ఉంచండి. ఒత్తిడి కొన్నిసార్లు మూత్రవిసర్జనను నియంత్రించే మీ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. వీలైనంత వరకు మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ధ్యానం లేదా ప్రాణాయామం చేయండి.


పాటించాల్సిన జాగ్రత్తలు


చాలా మంది చలికాలంలో నీరు తక్కువ తాగుతుంటారు. అయితే, ఇది కరెక్ట్ పద్ధతి కాదంటున్నారు నిపుణులు. వాతావరణం ఎలా ఉన్నా సరే శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం చాలా అవసరం. అంతేకాకండా కెఫీన్ ఉన్న డ్రింక్స్ పరిమితం చేయండి. అంతేకాకుండా చెవులు శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.


వాటిని కవర్ చేయడానికి మంకీ క్యాప్ లేదా స్కార్ఫ్ ధరించండి. చెవుల్ని అలాగే వదిలేయకండి. పగలు సమయాల్లో ఎండలో కాసేపు అయినా కూర్చోండి. ఇది శరీరాన్ని వేడి చేస్తుంది. ఈ దశల్ని ఫాలో అవ్వడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa