ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నలుదిశలా తిరుమల ఆధ్యాత్మిక వైభవాన్ని చాటాలని సీఎం చంద్రబాబు ఆదేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 27, 2025, 09:44 PM

ప్రపంచం నలుచెరగులా తిరుమల శ్రీవారి ఆధ్యాత్మిక వైభవాన్ని చాటేలా కార్యక్రమాలు చేపట్టాలని, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్యాత్మికత, అన్నదానం, విద్య, వైద్యానికి చిరునామాగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. గురువారం సచివాలయంలో దేవాదాయశాఖ, టీటీడీపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తిరుమల ఆలయంలో పాటిస్తున్న అత్యుత్తమ విధానాలను రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లోనూ అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రసాదాల తయారీ, క్యూలైన్ల నిర్వహణ వంటి అంశాల్లో తిరుమల ప్రమాణాలను అనుసరించాలని సూచించారు. ప్రసాదాల తయారీకి సేంద్రియ ఉత్పత్తులను మాత్రమే వినియోగించాలని, భక్తుల నిర్వహణలో ఆధునిక సాంకేతికతను వాడుకోవాలని ఆదేశించారు. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే ప్రధాన లక్ష్యం కావాలని, టీటీడీ భక్తుల పోర్టల్‌ను ఆర్టీజీఎస్‌తో అనుసంధానించాలని దిశానిర్దేశం చేశారు.తిరుపతిలోని స్విమ్స్, రుయా, బర్డ్ ఆస్పత్రులను అనుసంధానం చేసి, వాటిని ఒక మోడల్‌గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పుట్టపర్తి శ్రీ సత్యసాయి ఆస్పత్రుల తరహాలో అత్యుత్తమ నిర్వహణ ప్రమాణాలతో వీటిని తీర్చిదిద్దాలని సూచించారు. దేశంలోని ప్రముఖ వైద్య నిపుణులను 'శ్రీవారి సేవకులు'గా ఆహ్వానించి, వారి సేవలను ఈ ఆసుపత్రుల ద్వారా భక్తులకు, ప్రజలకు అందించేలా అవకాశం కల్పించాలన్నారు. మందులను నేరుగా తయారీదారుల నుంచే కొనుగోలు చేయాలని, అత్యవసర సమయాల్లో క్యూలైన్లలోని భక్తులను తక్షణమే ఆసుపత్రులకు తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుమలలో దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలన్నారు. భక్తులకు సులభంగా సమాచారం అందించేందుకు అన్ని సేవలను వాట్సప్ గవర్నెన్స్‌ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు.రాబోయే వైకుంఠ ఏకాదశికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సీఎం టీటీడీ అధికారులను ఆదేశించారు. భక్తులు అన్ని భాషల్లోనూ దర్శనానికి రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యం కల్పించాలని, వీలైనంత ఎక్కువ మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని దేవాలయాల్లో నిత్యాన్నదానం జరిగేలా చూడాలన్నారు. తిరుమల కొండలపై జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, దివ్య ఔషధవనం ఏర్పాటుతో పాటు వివిధ రకాల పుష్పజాతుల మొక్కలను నాటాలని పేర్కొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా నిర్మించ తలపెట్టిన 5,000 దేవాలయాల డిజైన్లను మార్చి, వాటిలో ఆధ్యాత్మికత, ప్రశాంతత ఉట్టిపడేలా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ నిర్మాణాలను టీటీడీ పాలకమండలి సభ్యులతో కూడిన కమిటీ పర్యవేక్షించాలని సూచించారు. కొత్త ఆలయాలతో పాటు రాష్ట్రంలోని పురాతన దేవాలయాల జీర్ణోద్ధరణకు పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ ఆలయాల నిర్మాణం జరుగుతోందని అధికారులు సీఎంకు వివరించారు. అసోంలో టీటీడీ ఆలయ నిర్మాణానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి 10 ఎకరాలు కేటాయించారని తెలుపగా, మరింత స్థలం కోసం తాను స్వయంగా మాట్లాడతానని సీఎం బదులిచ్చారు. దేశ, విదేశాల్లో నిర్మించే ప్రతి ఆలయం తిరుమల ప్రధాన ఆలయంతో అనుసంధానమై ఉండాలన్నారు. శ్రీవారి ఆస్తులు, ధనానికి పూర్తి జవాబుదారీతనం ఉండాలని, ఎక్కడా దుర్వినియోగానికి తావివ్వకుండా పారదర్శకంగా వ్యవహరించాలని గట్టిగా సూచించారు. ఒంటిమిట్ట రామాలయానికి భక్తుల సంఖ్య పెరిగేలా విస్తృత ప్రచారం చేపట్టాలని ఆదేశించారు.సామాన్య భక్తులకు దర్శన సమయం తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రస్తుతం నిమిషానికి 8 మంది దర్శనం చేసుకుంటున్నారని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. దర్శన టికెట్, కాటేజీ బుకింగ్‌ను ఒకేసారి అందించడం ద్వారా దళారుల బెడదను అరికట్టామన్నారు. లడ్డూ నాణ్యత పెంచడంతో పాటు అన్నప్రసాదంలో వడ కూడా అందిస్తున్నామని, వంటశాలను ఆటోమేషన్ చేసి రోజుకు 2.75 లక్షల మందికి అన్నప్రసాదం అందించేలా ప్రణాళిక చేస్తున్నామని వివరించారు.ఈ సమీక్షా సమావేశంలో దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో వెంకయ్య చౌదరి, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa