చైనా-జపాన్ మధ్య సెన్‌కాకు (డియాయూ) ద్వీపాల వివాదం మళ్లీ ముదిరిపోతున్న నేపథ్యంలో బీజింగ్ ఫ్రాన్స్‌ను తన వైపు తిప్పుకునే ప్రయత్నం ముమ్మరం చేసింది. ఈ విషయంలో పారిస్ నుంచి స్పష్టమైన మద్దతు లభిస్తే తూర్పు ఆసియాలో తమ స్థానాన్ని బలోపేతం చేసుకోవచ్చని చైనా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే చైనా దౌత్య మంత్రి వాంగ్ ఇ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ దౌత్య సలహాదారు ఎమ్మాన్యుయేల్ బోన్‌తో ఫోన్‌లో మాట్లాడారు.
వాంగ్ ఇ ఈ సంభాషణలో రెండు దేశాల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఫ్రాన్స్ చైనాకు మద్దతుగా నిలవాలని స్పష్టంగా కోరారు. ముఖ్యంగా ‘వన్ చైనా’ విధానాన్ని ఫ్రాన్స్ ఎప్పటినుంచో అనుసరిస్తోందని, తైవాన్ అంశంలోనూ బీజింగ్‌కు అనుకూలంగానే ఉంటుందని ఆశిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. ఈ మద్దతు దక్షిణ చైనా సముద్రం నుంచి తూర్పు చైనా సముద్రం వరకు విస్తరించే ప్రాంతీయ ఉద్రిక్తతల్లో చైనాకు బలం చేకూరుస్తుందన్నది బీజింగ్ అంచనా.
వచ్చే వారం ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చైనాకు అధికారిక పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా ఆర్థిక, వాణిజ్య ఒప్పందాలతోపాటు వ్యూహాత్మక అంశాలపై కీలక చర్చలు జరగనున్నాయి. యూరోపియన్ యూనియన్‌లో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉన్న ఫ్రాన్స్‌ను తన పక్షాన నిలపడం ద్వారా అమెరికా-జపాన్-ఆస్ట్రేలియా కూటమికి ఎదురుగా బీజింగ్ బలమైన సంకేతం పంపాలని చూస్తోంది.
ఈ పరిణామం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో శక్తి సమతుల్యతపై కొత్త చర్చను రేకెత్తిస్తోంది. ఫ్రాన్స్ ఇప్పటివరకు ఇండో-పసిఫిక్ వ్యూహంలో అమెరికాతో సన్నిహితంగా కనిపించినా, చైనాతో ఆర్థిక సంబంధాలను కాపాడుకుంటూ సమతుల్య విధానం అవలంబిస్తోంది. మాక్రాన్ పర్యటన ఫలితాలు ఈ సమతుల్యత ఎటువైపు మొగ్గు చూపుతుందో నిర్ణయించే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa