ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజోలు నియోజకవర్గంలో చేపట్టిన పర్యటన సందర్భంగా ఒక అపరిచిత వ్యక్తి అనుమానాస్పదంగా కదలాడటంతో డిప్యూటీ సీఎం కార్యాలయం తీవ్ర అప్రమతమైంది. శంకరగుప్తం డ్రెయిన్ వల్ల దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిశీలిస్తున్న సమయంలోనే ఈ వ్యక్తి పవన్ సమీపంలోనే కనిపించడం మొదలైంది. అధికారులతో చర్చలు జరుపుతున్నప్పుడు, ఆ తర్వాతి కార్యక్రమాల్లో కూడా ఆ వ్యక్తి ఎప్పుడూ దగ్గరలోనే ఉండటం భద్రతా సిబ్బందికి అనుమానం కలిగించింది.
పవన్ కళ్యాణ్‌ను ఎప్పటికప్పుడు దగ్గరగా గమనిస్తూ, ఆయన కదలికలకు అనుగుణంగా సంచరించిన ఆ వ్యక్తి గురించి డిప్యూటీ సీఎం కార్యాలయం వెంటనే సమాచారం సేకరించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం ఆ వ్యక్తి రాజోలు నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్యకర్త అని తేలింది. ఈ విషయం తెలిసిన వెంటనే భద్రతా బృందం అప్రమతమై, ఆ వ్యక్తి కదలికలను గమనించడం మొదలుపెట్టింది.
ఈ ఘటనను డిప్యూటీ సీఎం కార్యాలయం అత్యంత కీలకంగా భావించి, కోనసీమ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డికి అధికారికంగా సమాచారం అందించింది. పవన్ కళ్యాణ్ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవడం లేదని, ఆ వ్యక్తి నేపథ్యాన్ని పూర్తిగా పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం ఆ వైసీపీ కార్యకర్తపై పోలీసులు దృష్టి సారించారు. రాజోలు పర్యటనలో జరిగిన ఈ అనుమానాస్పద ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ఇప్పటికే ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ భద్రతపై ఇలాంటి అప్రమత్తత రాజకీయ పరిణామాలపై కొత్త చర్చను రేకెత్తిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa