వైట్‌హౌస్ వద్ద నేషనల్ గార్డ్స్‌పై అఫ్గన్ జాతీయుడు కాల్పులు ఘటనపై తీవ్రంగా స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. మూడో ప్రపంచ దేశాల నుంచి వలసలను శాశ్వతంగా నిలిపివేయనున్నట్టు ప్రకటించారు. సాంకేతికంగా అమెరికా ఎంతో పురోగతి సాధించినా వలస విధానాలు ఆ అభివృద్ధిని దెబ్బతీసిందని ఆయన ఆరోపించారు. మూడో ప్రపంచ దేశాల నుంచి వలసలను నిలిపివేయడమే దీనికి పరిష్కారమని, అప్పుడే అమెరికా వ్యవస్థ పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. అంతేకాదు, జో బైడెన్ హయాంలో అనుమతించిన లక్షలాది వలసలను రద్దు చేయాలనుకుంటున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అలాగే, అమెరికాను ప్రేమించలేని వారిని కూడా వెళ్లగొట్టాలని ఆయన ప్రకటించారు. పాశ్చాత్య నాగరికతలో ఇమడలేని ఏ విదేశీ పౌరుడినైనా దేశం నుంచి బహిష్కరిస్తామని స్పష్టం చేశారు.
అయితే, ట్రంప్ నోట వచ్చిన మూడో ప్రపంచ దేశాలు గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇంతకీ ఈ పదం ఎలా వచ్చింది? అలా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఆ దేశాలు ఏంటి? అనేది చర్చనీయాంశంగా మారింది. దీని గురించి తెలుసుకోవాలంటే.. 1960 దశకంలోకి వెళ్లాలి. అది అమెరికా, సోవియట్ రష్యా మధ్య ప్రచ్చన్న యుద్ధం జరుగుతోన్న సమయం. అప్పుడే మొదటి, రెండో, మూడో ప్రపంచ దేశాలు అనే భావన వచ్చింది. ఆ సమయంలో ప్రపంచం అమెరికా పక్షాన ఉన్న పాశ్చాత్య కూటమి, సోవియట్ పక్షాన ఉన్న కమ్యూనిస్ట్ కూటమితో పాటు తటస్థంగా ఉన్న దేశాలు సహా మిగిలివాటిని మూడో ప్రపంచ దేశాలుగా విడిపోయింది. సాధారణంగా పేద లేదా ‘అభివృద్ధి చెందని’ దేశాలను సూచించడానికి ఉపయోగించే మూడో ప్రపంచం అనే ఈ పదం మరుగునపడిపోయిందిగా భావిస్తున్నారు.
చారిత్రకంగా మొదటి ప్రపంచ దేశాలుగా (అభివృద్ధి చెందినవి) అమెరికా కూటమిలోని ప్రజాస్వామ్య, పారిశ్రామిక దేశాలు.. రెండో ప్రపంచం దేశాలు కార్మికుల, కర్షకుల నేతృత్వంలోని కమ్యూనిస్ట్-సోషలిస్ట్ దేశాలు. మూడో ప్రపంచం ఏ కూటమికి చెందని తటస్థ మెజారిటీ దేశాలను సూచిస్తుంది. మొదటి ప్రపంచ దేశాల్లో ఉత్తర అమెరికా, పశ్చిమ ఐరోపా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా సహా పలు దేశాలు ఉన్నాయి. అయితే, పశ్చిమ దేశాలతో ఉన్న సంబంధాల కారణంగా కొన్ని ఆఫ్రికా ప్రాంతాలు కూడా ఇందులో చేరాయి. ఉదాహరణకు స్పెయిన్ ఆధీనంలోని వెస్ట్రన్ సహారా, దక్షిణాఫ్రికా, అలాగే సౌత్ వెస్ట్ ఆఫ్రికా (నమీబియా). అంగోలా, మొజాంబిక్‌లు సైతం 1975లో కమ్యూనిస్టు దేశాలుగా మారే వరకు పోర్చుగీస్ పాలనలోనే ఉండేవి. స్విట్జర్లాండ్, స్వీడన్, ఆస్ట్రియా, ఐర్లాండ్, ఫిన్లాండ్ వంటి తటస్థ దేశాలను కూడా ఫస్ట్ వరల్డ్‌లో భాగంగానే పరిగణించారు.
సెకెండ్ వరల్డ్‌లో సోవియట్ రిపబ్లిక్స్, పొలెండ్, జర్మనీ, జొకోస్లేవికియా, బాల్కిన్స్ సహా తూర్పు ఐరోపా దేశాలు.. ఆసియాలో చైనా, మంగోలియా, ఉత్తర కొరియా, వియత్నాం, లావోస్, కాంబోడియా వంటి కమ్యూనిస్ట్ దేశాలను పరిగణించారు. థర్డ్ వరల్డ్ కూటమిలో ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికాల్లో అభివృద్ధి చెందని మెజార్టీ వ్యవసాయ ఆధారిత దేశాలు ఇందులో ఉన్నాయి.
కాగా, అఫ్గనిస్థాన్, ఇతర 18 దేశాలకు చెందిన ప్రతి ఒక్క శాశ్వత నివాసితులు లేదా గ్రీన్‌కార్డుదారుల ఇమ్మిగ్రేషన్ హోదాను సమీక్షించనున్నట్టు ట్రంప్ యంత్రాంగం నవంబరు 28న ప్రకటించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనలతో ఆందోళన కలిగించే ప్రతీ దేశానికి చెందిన వ్యక్తుల గ్రీన్‌కార్డును సమీక్షించాలని ఆదేశించినట్టు అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో ఎక్స్ (ట్విట్టర్)లో వెల్లడించారు. ఎడ్లో ఏ దేశాల గురించి మాట్లాడుతున్నారని యూఎస్సీఐఎస్ ప్రతినిధిని ప్రశ్నించగా.. జూన్ 25న అధ్యక్షుడు వెలువరించిన కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో ఈ జాబితా ఉందని, 19 దేశాలను ‘ఆందోళనకర’స్థాయిగా వర్గీకరించామని అన్నారు.
ట్రంప్ ఉత్తర్వుల్లో అఫ్గనిస్థాన్ సహా 12 దేశాలకు చెందిన పౌరులకు అమెరికాలో ప్రవేశం నిషేధించారు. అఫ్గన్, మాయన్మార్, చాద్, కాంగో-బ్రెజ్విల్లే, ఈక్విటోరియల్ గునియా, ఎరిత్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ ఈ జాబితాలో ఉన్నారు. వీటితో పాటు బురిండీ, క్యూబా, లావోస్, సియెర్రా లినీ, తుర్కిమెనిస్థాన్, వెనుజులా పర్యాటకులను కూడా అమెరికాలోకి రాకుండా నిషేధం విధించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa