నవంబరు 26న బుధవారం అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ వద్ద కాల్పుల ఘటన నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. దేశంలోకి వచ్చే వలసలను శాశ్వతంగా నిలిపివేస్తానని, ముఖ్యంగా మూడో ప్రపంచ దేశాల నుంచి వచ్చే పౌరులను అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. వైట్‌హౌస్ సమీపంలో జరిగిన కాల్పుల ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ పెట్టారు. అమెరికా అధ్యక్షుడి చర్య ప్రభావం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిపై పడనుంది.
అమెరికా సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందినా, వలస విధానాలు ఆ పురోగతిని దెబ్బతీస్తున్నాయని, ప్రజల జీవన ప్రమాణాలను తగ్గించాయని ట్రంప్ పేర్కొన్నారు. ‘‘నేను మూడో ప్రపంచ దేశాల నుంచి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తాను.. అమెరికా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకోవడానికి, బైడెన్ హయాంలో అక్రమంగా వచ్చినవారిని వెళ్లగొట్టడానికి, అమెరికాకు ప్రయోజనం చేకూర్చని వారిని, మన దేశాన్ని ప్రేమించలేని వారిని బహిష్కరించి, విదేశీయులకు ప్రభుత్వ ప్రయోజనాలు, సబ్సిడీలను నిలిపివేయడం.. దేశ శాంతికి భంగం కలిగించే వారిని పౌరసత్వం నుంచి తొలగించడానికి, ప్రజా భారం, భద్రతాపరమైన ముప్పుగా మారిన లేదా పాశ్చాత్య నాగరికతతో సరిపోలని విదేశీయులను బహిష్కరణకు ఈ చర్యలు తీసుకుంటాను’’ అని ఆయన పేర్కొన్నారు.
‘‘చట్టవిరుద్ధమైన, అవాంఛనీయ జనాభాను గణనీయంగా తగ్గించడమే ఈ లక్ష్యాల సాధనలో ప్రధాన ఉద్దేశం.. దీనికి ‘రివర్స్ మైగ్రేషన్’ మాత్రమే పరిష్కారం. ద్వేషించేవారు, దొంగతనం చేసేవారు, హత్యలు చేసేవారు, అమెరికాకు వ్యతిరేకంగా నిలబడేవారు ఇక్కడ ఎక్కువ కాలం ఉండరు!’’ అని ట్రంప్ తన పోస్ట్‌లో తెలిపారు.
నవంబరు 26న వైట్‌హౌస్ సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డ్ సిబ్బందిపై కాల్పులు జరిగిన ఘటన కలకలం రేపింది. ఈ కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. గాయపడిన ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో అనుమానితుడిగా అఫ్గనిస్థాన్‌కు చెందిన 29 ఏళ్ల రహమనుల్లా లకన్వాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా ట్రంప్ యంత్రాంగం వలసల విషయంలో కఠిన వైఖరి అవలంబించింది. అనుమానితుడ్ని అఫ్గన్ జాతీయుడిగా గుర్తించిన వెంటనే ఆ దేశ పౌరులకు అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సేవలకు సంబంధించిన దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను నిరవధికంగా నిలిపివేశాయి. ‘మన దేశం, అమెరికా ప్రజల భద్రత, రక్షణే మా ఏకైక లక్ష్యం’ అని ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు.
కాగా, ఈ ప్రకటనకు ముందు ట్రంప్ 2021లో అఫ్గన్ నుంచి ప్రజలను తరలించిన సైనిక విమానం ఫోటోను షేర్ చేశారు. ‘ఇది భయంకరమైన తరలింపులో భాగం. లక్షలాది మంది ఎటువంటి తనిఖీలు లేకుండా మన దేశంలోకి వచ్చారు. మేము దీనిని సరిదిద్దుతాం.. జో బైడెన్, అతడి అనుచరులు మన దేశానికి చేసిన దానిని మేము ఎప్పటికీ మర్చిపోం’ అని ఆయన పోస్ట్ చేశారు.
అమెరికాలో 53 మిలియన్ల విదేశీయులు ఉన్నారని, వారిలో చాలామంది పాలన అస్తవ్యస్తమైన దేశాల నుంచి లేదా జైళ్లు, మానసిక చికిత్సా కేంద్రాలు, గ్యాంగ్‌లు లేదా డ్రగ్ కార్టెల్స్ నుంచి వచ్చారని ట్రంప్ ఆరోపించారు. ‘వాళ్లు, వారి పిల్లలు అమెరికా పౌరులు చెల్లించే పన్నులతోనే జీవిస్తున్నారు.. 30,000 డాలర్లు సంపాదించే గ్రీన్ కార్డ్ హోల్డర్ కుటుంబం ఏడాదికి సుమారు 50,000 డాలర్ల ప్రయోజనాలు పొందుతుంది’ అని ట్రంప్ వివరించారు.
‘‘రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ శరణార్థుల భారం అమెరికాలో సామాజిక అస్తవ్యస్తతకు ప్రధాన కారణం. (విఫలమైన పాఠశాలలు, అధిక నేరాలు, రద్దీగా ఉండే ఆసుపత్రులు, గృహాల కొరత మొదలైనవి). ఉదాహరణకు, సోమాలియా నుంచి వచ్చిన లక్షలాది మంది శరణార్థులు మిన్నెసోటాను పూర్తిగా ఆక్రమించుకుంటున్నారు’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa