కర్ణాటక ముఖ్యమంత్రి పదవి విషయంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న సంక్షోభానికి తెరదించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దిగింది. ముందుగా ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలని, ఆ తర్వాతే ఢిల్లీకి రావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో.. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు బెంగళూరులో సమావేశమయ్యారు. సీఎం అధికారిక నివాసం ‘కావేరి’లో ఏర్పాటు చేసిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌కు డీకే శివకుమార్ హాజరయ్యారు. ఈ భేటీకి ముందు విలేకరులతో మాట్లాడిన డీకే శివకుమార్, "నేను సీఎం నివాసానికి వెళ్తున్నాను. సమావేశం తర్వాత మాట్లాడతాను" అని అన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకే ఈ సమావేశం జరుగుతోందని సీఎం సిద్ధరామయ్య స్వయంగా వెల్లడించారు. "ముందు మమ్మల్ని చర్చించుకోమని హైకమాండ్ చెప్పింది. ఆ తర్వాతే ఢిల్లీకి పిలిచారు. అందుకే డీకే శివకుమార్‌ను బ్రేక్‌ఫాస్ట్‌కు ఆహ్వానించాను. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాను" అని ఆయన స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa