ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహాయుతిలో లుకలుకలు.. సంకీర్ణ ధర్మం పాటించాలంటూ షిండే సంచలన వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Mon, Dec 01, 2025, 08:50 PM

మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల వేళ అధికార మహాయుతి కూటమి సర్కారులో విబేధాలు భగ్గమన్నాయి. తమ పార్టీ నేతలను ప్రలోభాలకు గురిచేయకూడదనే బీజేపీ, శివసేన (షిండే) మధ్య ఒప్పందం ఉల్లంఘనతో కూటమిలో ఉద్రిక్తతలు పెరిగాయి. ముంబయి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే‌లు మాత్రం విభేదాలపై జరుగుతోన్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. కానీ, ఒకరినొకరు కలుసుకోకపోవడం, శివసేన మంత్రులు క్యాబినెట్ సమావేశానికి గైర్హాజరు కావడం వంటి సంఘటనలు అంతర్గత విభేదాలను సూచిస్తున్నాయి. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కూడా బీజేపీ తీరుపై విమర్శలు గుప్పించింది.


గత వారం ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇద్దరూ ఒకే హోటల్‌లో ఉన్నా ఎందుకు కలుసుకోలేదన్న ప్రశ్నకు ఫడ్నవీస్ నవ్వుతూ.. ‘ఆయన (షిండే) వెళ్లిపోయాక నేను రాత్రి ఆలస్యంగా వచ్చాను.. నా సమావేశాలు ఆయన కంటే ముందుగా ఉంటాయి కాబట్టి కలవలేదు. కానీ కలుస్తాం. ఇందులో పెద్ద విషయం ఏముంది? మేమిద్దరం ప్రచారంతో బిజీగా ఉన్నాం కానీ రోజూ ఫోన్‌లో మాట్లాడుకుంటాం...’ అని బదులిచ్చారు.


అటు షిండే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇలాంటి వార్తలను వింటున్నానని, వాటిని సీరియస్‌గా తీసుకోనని, పనిపై దృష్టి పెడతానని అన్నారు. ‘‘ఈ కూటమి నిన్నో, మొన్నో ఏర్పడింది కాదు. ఇది ఉమ్మడి సిద్ధాంతం.. సాధారణ సూత్రాలతో రూపుదిద్దుకుంది’ అని బాల ఠాక్రే, అటల్ బిహారీ వాజ్‌పేయి, అద్వాణీలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. కానీ, ‘మేము సంకీర్ణ ధర్మాన్ని పూర్తిగా పాటిస్తాం... కూటమిలోని భాగస్వాములు కూడా పాటించాలి’ అని డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు అంతర్గత విభేదాలను సూచిస్తున్నాయి.


ఇక, మహాయుతిలోని మరో భాగస్వామ్య పార్టీ ఎన్సీపీ చేసిన వ్యాఖ్యలు కూడా విబేధాలను బయటపెట్టాయి. ‘‘బీజేపీ పూర్తిగా విభజన రాజకీయాలనే నమ్ముకుంది... వారికి సొంతంగా ఏమీ లేదు. వారి జీవితమంతా మానిప్యులేషన్, ఇక్కడ, అక్కడ చీల్చడం చుట్టూనే తిరుగుతుంది’’ అని ఎన్సీపీ నేత, అజిత్ పవార్ సన్నిహితుడు మాణిక్‌రావ్ కొకాటే విమర్శించారు. తమ పాత కార్యకర్తలందరూ ఇళ్లకే పరిమితమయ్యారని ఆయన ఆరోపించారు.


అయితే, శివసేన కార్యకర్తలు, నాయకులను బీజేపీ తమ పార్టీలో చేర్చుకోవడం షిండే సేనకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ నేపథ్యంలోనే శివసేన మంత్రులు రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఈ విషయంపై శివసేన సీనియర్ నేత, మహారాష్ట్ర పరిశ్రమల మంత్రి ఉదయ్ సామంత.. ‘బహిష్కరణ’ వార్తలను కొట్టిపారేశారు కానీ కూటమిలో అంతా సవ్యంగా లేదని అంగీకరించారు.


విబేధాలు పెరుగుతున్న నేపథ్యంలో ఒకరి కార్యకర్తలను, కార్యవర్గ సభ్యులను మరొకరు చేర్చుకోరాదని బీజేపీ, శివసేనలు ఒక అనధికారిక ఒప్పందానికి వచ్చాయి. . కానీ, రూప్‌సింగ్ ధాల్, ఆనంద్ ధోకే, శిల్పరాణి వాడ్కర్, అనమోల్ మ్హత్రే వంటి పలువురు శివసేన నేతలు బీజేపీలో చేరడం గమనార్హం. ఈ పరిణామం బీజేపీ- శివసేన సంబంధాలను మరింత దెబ్బతీయడమే కాకుండా.. ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఆదివారం థానేలో ఆ రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. మాజీ ఎమ్మెల్యే వికాస్ మ్హత్రే మద్దతుదారులు, బీజేపీ నుంచి శివసేనలోకి చేరినవారు, బీజేపీ కార్యకర్తలతో ఘర్షణ పడ్డారని మీడియా నివేదికలు తెలిపాయి. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని అదుపు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa