ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డీకే సీఎం అయ్యేది అప్పుడే ,,, సిద్దరామయ్య కీలక వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Tue, Dec 02, 2025, 08:19 PM

కర్ణాటకలో నాయకత్వ మార్పుపై వివాదం కొనసాగుతుండగా.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌‌లు రెండోసారి కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ చేశారు. మంగళవారం ఉదయం డీకే నివాసానికి సీఎం సిద్ధూ వెళ్లారు. అల్పాహార భేటీ అనంతరం బయటకొచ్చిన సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా డీకే శివకుమార్‌కు సీఎం పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ ఎప్పుడు ఆదేశిస్తే.. అప్పుడే ఆయన ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. ప్రస్తుతం తమ పార్టీ 2028 అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలపైనే ప్రధానంగా దృష్టిసారించిందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని డీకే-సిద్ధూ పేర్కొన్నారు.


శాసనసభ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, రైతుల సమస్యలు సహా పలు ఇతర అంశాలపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చర్చించినట్లు సిద్ధరామయ్య వెల్లడించారు. ఈ విషయాలపై చర్చించడానికి అధిష్ఠానం పిలిస్తే తాము ఇద్దరం ఢిల్లీకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వంలోని నేతలంతా కలిసికట్టుగా ఉన్నామని.. రాష్ట్రాభివృద్ధికి కలిసి పని చేస్తున్నామని వివరించారు. 2028 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. అలాగే, ఈ నెల 8న కాంగ్రెస్‌ ఎంపీల సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు చేయనున్నట్లు సిద్ధూ తెలిపారు.


ఈ భేటీలోనూ నాయకత్వ మార్పుపై స్పష్టత రానప్పటికీ పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధమనే సంకేతాలు సిద్ధరామయ్య ఇచ్చారు. అధిష్ఠానం చెప్పినట్లయితే పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. ‘పార్టీ తీసుకునే నిర్ణయాన్ని ముఖ్యంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గే తీసుకునే నిర్ణయాన్ని ఇద్దరమూ అంగీకరిస్తాం’ అని ఆయన అన్నారు.


మరోవైపు, తమ ఇంటికి వచ్చిన సీఎం సిద్ధరామయ్య పట్ల డీకే కుటుంబం గౌరవం ప్రదర్శించినట్టు తెలుస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రిపై విమర్శలు చేసిన ఆయన తమ్ముడు డీకే సురేష్, సిద్ధరామయ్య పాదాలకు నమస్కరించి, గౌరవాన్ని చాటుకున్నారు. కాగా, డిసెంబరు 8న ఢిల్లీలో జరిగే ఎంపీల సమావేశానికి ఇద్దర్నీ పిలిచే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.


సీఎంతో బ్రేక్‌ఫాస్ట్ భేటీ గురించి డీకే.. ఎక్స్‌ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు. ‘‘ఈ రోజు నా నివాసంలో ముఖ్యమంత్రికి అల్పాహర ఆతిథ్యం ఇచ్చాను.. ఈ సందర్భంగా కాంగ్రెస్ దార్శనికతలో సుపరిపాలన, మా రాష్ట్ర నిరంతర అభివృద్ధికి మా నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటించాం.. కాంగ్రెస్‌లో మాది ఒకటే నినాదం.. పార్టీలో ఎటువంటి విబేధాలు లేవు.. అంతా మీడియా సృష్టే’’ అని పేర్కొన్నారు.


విశ్వసనీయ వర్గాల ప్రకారం.. తాను ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకుని, 2028 ఎన్నికల్లో డీకేకు మద్దతు ఇస్తాననేది సిద్ధరామయ్య ప్రతిపాదన. రాజకీయంగా ప్రభావం ఉన్న అహింద్ సమాజంలో సిద్ధరామయ్యకు ఉన్న బలం ఈ ప్రతిపాదనను ఆకర్షణీయంగా మార్చవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది. డీకే ఆ ప్రతిపాదనను అంగీకరిస్తే, రాష్ట్రంలోని రెండు ప్రధాన ఓటు బ్యాంకులైన వొక్కలిగ, అహింద్ వర్గాలను కాంగ్రెస్ ఏకతాటిపైకి తెచ్చే అవకాశముందని అంచనా.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa