దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత దేశానికి విచ్చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా స్వాగతం పలికారు. పాలం విమానాశ్రయం నుంచి ప్రధాని నివాసం వరకు ఈ ఇద్దరు అత్యంత శక్తిమంతమైన నేతలు ఒకే కారులో కలిసి ప్రయాణించారు. అయితే ఇక్కడే ఓ ఆసక్తికరమైన అంశం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈ ఇద్దరు నేతలూ.. తమ తమ విలాసవంతమైన, అత్యంత భద్రతా ప్రమాణాలు కలిగిన వాహనాలను పక్కన పెట్టి.. ఒక సాధారణ టయోటా ఫార్చ్యూనర్ కారులో పయనించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
భద్రతా ప్రమాణాలకు భిన్నంగా..
ప్రధాని మోదీ సాధారణంగా ఉపయోగించే అత్యంత విలాసవంతమైన, కట్టుదిట్టమైన భద్రత ఉండే రేంజ్‌రోవర్ కారును వదిలి.. టయోటా ఫార్చ్యూనర్‌లో పుతిన్‌ను తీసుకెళ్లడం అందరినీ ఆశ్చర్య పరిచింది. రష్యా అధినేత పుతిన్ కూడా తాను ఎప్పుడూ వాడే అత్యున్నత భద్రతా ప్రమాణాలు ఉన్న తన అధికారిక కారు ఆరస్ సెనేట్ లిమోసిన్‌లో కాకుండా ఫార్చ్యూనర్‌లో ప్రయాణించేందుకు అంగీకారం తెలిపారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత, ప్రోటోకాల్ నడుమ ప్రయాణాలు సాగించే ఇద్దరు దేశాధినేతలు భద్రతా ప్రమాణాలకు విభిన్నంగా ఒక సాధారణ కారును ఎంచుకోవడం ఇరుదేశాల మధ్య ఉన్న బలమైన స్నేహ బంధానికి నిదర్శనంగా భావిస్తున్నారు. గతంలో షాంఘై సహకార సదస్సు సందర్భంగా.. ప్రధాని మోదీ కోసం వెయిట్ చేసి మరీ.. పుతిన్ భారత ప్రధానిని తన కార్లో ఎక్కించుకొని వెళ్లారు.
పుతిన్ ప్రయాణానికి వాడిన ఈ టయోటా ఫార్చ్యూనర్ వాహనం గురించిన వివరాలు కూడా చర్చకు దారితీశాయి. ఈ కారు MH01EN5795 మహారాష్ట్ర నంబర్‌తో రిజిస్టర్ అయింది. ఇది బీఎస్-6 వాహనం కాగా.. 2024 ఏప్రిల్‌లో రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. అలాగే ఈ వాహనానికి సంబంధించిన ఫిట్‌నెస్ సర్టిఫికెట్ 2039 ఏప్రిల్ వరకు చెల్లుబాటు అవుతుంది.
పుతిన్ రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం భారత్‌కు చేరుకున్నారు. పాలం విమానాశ్రయంలో మోదీ స్వయంగా స్వాగతం పలికిన అనంతరం ఇద్దరూ లోక్ కల్యాణ్‌మార్గ్‌లోని ప్రధాని నివాసానికి వెళ్లారు. అక్కడ మోదీ పుతిన్‌కు గౌరవపూర్వకమైన విందు ఏర్పాటు చేశారు. దీనికి ముందే మోదీ.. పుతిన్‌కు అద్భుతమైన బహుమతిని అందజేశారు. రష్యన్ భాషలోకి అనువదించిన భగవద్గీతను అందజేయగా.. రష్యా అధ్యక్షుడు తెగ సంబుర పడిపోయారు. అయితే ఈ విషయాన్ని నేరుగా ప్రధాని మోదీయే ఎక్స్ వేదికగా వెల్లడించగా.. అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. నేడు ఈ ఇద్దరు దేశాధినేతల మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య రక్షణ, ఇంధనం, వాణిజ్యం వంటి అంశాలపై పలు కీలక ఒప్పందాలు కుదరనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa