ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభవార్త వినిపించారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఇంజినీరింగ్ విభాగం, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు, సిబ్బందితో మంగళగిరిలో జరిగిన మాటా మంతి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఉద్యోగులకు పలు కీలక సూచనలు చేశారు.
ప్రభుత్వ ఉద్యోగి కుమారుడిగా ఉద్యోగుల సాధకబాధకాలు తనకు తెలుసని.. అందుకే తన శాఖ పరిధిలోని ఉద్యోగులకు ఏం చేయగలనని మొదటి నుంచి ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ప్రమోషన్ వస్తే ఉద్యోగి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుందన్న పవన్ కళ్యామ్.. వారు మరింత ప్రభావవంతంగా పని చేస్తారని అన్నారు. అందుకే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ప్రమోషన్ల వ్యవహారాన్ని బలంగా, పారదర్శకంగా ముందుకు తీసుకువెళ్లామని వివరించారు.
పదోన్నతులతో ఉద్యోగులు ఎంత సంబరపడ్డారో.. ఉద్యోగులు అందించే సేవలతో ప్రజలు కూడా అంతే ఆనందపడాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రజలకు సేవలు అందించే క్రమంలో ఉద్యోగులు అందరూ నిష్పక్షపాతంగా, నిబద్ధతతో వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఏడాదిన్నర పాలనలో పంచాయతీరాజ్ ఉద్యోగులకు ఎన్నో నూతన సంస్కరణలు అమలు చేశామని.. మరిన్ని కూడా అమలు చేస్తామన్నారు. చట్టప్రకారం ఉద్యోగులకు చేయగలిగినవన్నీ చేస్తామన్న పవన్ కళ్యాణ్.. ఉద్యోగుల భద్రత, హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఈ క్రమంలోనే పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలో పెండింగ్ ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు వెంటనే చెల్లించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందన్న పవన్ కళ్యాణ్.. గ్రామాలను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే పంచాయతీరాజ్ శాఖను ఎంచుకున్నట్లు తెలిపారు. అనుభవం ఉన్న అధికారి అయిన శశిభూషణ్ కుమార్‌నుప్రధాన కార్యదర్శిగా తీసుకున్నామని.. డిప్యూటీ సీఎం హోదాలో ఎక్కడా తన సొంత తెలివితేటలు వాడలేదని చెప్పుకొచ్చారు. కొన్ని సందర్భాల్లో నిర్ణయం తీసుకుంటే తప్పు, తీసుకోకుంటే ఒప్పు అనే పరిస్థితులు వచ్చాయని.. అందుకే తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు. శశిభూషణ్ కుమార్, కృష్ణతేజ, వెంకటకృష్ణ లాంటి బలమైన అధికారులు తనతో ఉన్నారని.. వారి అనుభవంతో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామన్నారు.
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లోని ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో తాను కల్పించుకోనని ముందే చెప్పానని. పాదర్శకతతో పదోన్నతులు కల్పించామన్నారు. 10 వేల మంది పైచిలుకు ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించామని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ పదోన్నతుల వ్యవహారంలో ఈ స్థాయిలో సంస్కరణలు అమలు చేయలేదని పవన్ కళ్యాణ్ వివరించారు. ఆర్థిక వ్యవస్థ గాడిన పడకుండా అన్నీ ఒకేసారి చేయలేమన్న పవన్ కళ్యాణ్.. ఈ విషయాన్ని ఉద్యోగులు గుర్తు పెట్టుకోవాలన్నారు.ప్రతి ఒక్కరూ కూడా సంపద పెంచిన తర్వాత హక్కులు, జీతాల పెంపు గురించి మాట్లాడాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa