ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింగపూర్ చర్చిలో 'ఫేక్ బాంబు' కలకలం.. భారత సంతతి వ్యక్తి అరెస్ట్

international |  Suryaa Desk  | Published : Mon, Dec 22, 2025, 11:26 PM

అంతర్జాతీయ స్థాయిలో అత్యంత కఠినమైన భద్రతా నిబంధనలు ఉండే సింగపూర్‌లో ఓ చర్చికి వచ్చిన బాంబు బెదిరింపు స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది. అచ్చం బాంబును పోలి ఉన్న వస్తువులను చర్చిలో ఉంచి భక్తులను భయభ్రాంతులకు గురిచేసిన ఘటనలో భారత సంతతికి చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నకిలీ బాంబు బెదిరింపు కారణంగా చర్చిలో జరగాల్సిన ఆదివారం ప్రార్థనలు అన్నీ రద్దు అయ్యాయి.


అసలేం జరిగిందంటే?


సింగపూర్‌లోని అపర్ బుకిట్ టిమా ప్రాంతంలో ఉన్న ప్రముఖ 'సెయింట్ జోసెఫ్ చర్చి'కి ఆదివారం ఉదయం 7.11 గంటల సమయంలో ఒక అజ్ఞాత బెదిరింపు వచ్చింది. చర్చి ప్రాంగణంలో ఐఈడీ తరహాలో ఉన్న మూడు అనుమానాస్పద వస్తువులు కనిపించడంతో భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కార్డ్‌బోర్డ్ రోల్స్‌లో రాళ్లు నింపి.. బయటకు ఎరుపు వైర్లు కనిపిస్తున్న ఆ వస్తువులను నలుపు, పసుపు రంగు టేపులతో చుట్టి అత్యంత ప్రమాదకరమైన బాంబులా కనిపించేలా అమర్చారు. దీంతో చర్చి నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.


 విషయం తెలిసిన వెంటనే భద్రతా దళాలు, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ చర్చికి చేరుకున్నాయి. చర్చి పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు ఆ అనుమానాస్పద వస్తువులను పరీక్షించారు. సుదీర్ఘ తనిఖీ అనంతరం అవి కేవలం నకిలీ బాంబులని.. ప్రజలను భయపెట్టేందుకు ఉద్దేశ పూర్వకంగా చేసిన పని అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆదివారం జరగాల్సిన అన్ని మతపరమైన కార్యక్రమాలను అధికారులు రద్దు చేశారు.


నిందితుడు భారత సంతతి వ్యక్తే..


ఈ దర్యాప్తులో భాగంగా బాంబు బెదిరింపులకు పాల్పడింది భారత సంతతికి చెందిన సింగపూర్ పౌరుడు కోకుల్‌నాథ్ మోహన్ (49) అని పోలీసులు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో నిందితుడికి ఎటువంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు లేవని తేలింది. అయితే నిందితుడి మానసిక స్థితిపై అనుమానాలు ఉండటంతో కోర్టు అతడిని మూడు వారాల పాటు రిమాండ్‌కు తరలించి.. వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.


సింగపూర్ చట్టాల ప్రకారం ఉగ్రవాద బెదిరింపులకు పాల్పడటం తీవ్రమైన నేరం. ఈ కేసులో కోకుల్‌నాథ్ మోహన్ దోషిగా తేలితే గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష లేదా ఐదు లక్షల సింగపూర్ డాలర్ల (సుమారు రూ. 3 కోట్లకు పైగా) భారీ జరిమానా విధించే అవకాశం ఉందని అక్కడి న్యాయ నిపుణులు చెబుతున్నారు. ప్రజల భద్రతకు భంగం కలిగించే ఇటువంటి చర్యలను ఉపేక్షించే ప్రసక్తే లేదని సింగపూర్ పోలీసులు హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa